రూ. 2 వేల నోటుపై గాంధీ బొమ్మను తొలగించండి.. మోదీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ

ABN , First Publish Date - 2021-10-08T02:13:37+05:30 IST

రూ. 2,000, 500 నోట్లపై ముద్రిస్తున్న మహాత్మాగాంధీ బొమ్మను వెంటనే తొలగించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు

రూ. 2 వేల నోటుపై గాంధీ బొమ్మను తొలగించండి.. మోదీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ

న్యూఢిల్లీ: రూ. 2,000, 500 నోట్లపై ముద్రిస్తున్న మహాత్మాగాంధీ బొమ్మను వెంటనే తొలగించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. అవినీతికి, బార్లలోనూ వీటిని ఉపయోగిస్తున్నారని, కాబట్టి ఆ నోట్లపై గాంధీ బొమ్మ ఉండడం హర్షనీయం కాదని ఆయన పేర్కొన్నారు.


రాజస్థాన్‌లో ఇటీవల అవినీతి కేసులు వెలుగుచూస్తుండడంతో ఆ రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన భరత్ సింగ్ కుందన్‌పూర్ ప్రధానికి ఈ లేఖ రాశారు. రాష్ట్రంలో రోజుకు రెండు కేసుల చొప్పున జనవరి 2019 నుంచి 31 డిసెంబరు మధ్య మొత్తంగా 616 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 


గాంధీ 152వ జయంతి సందర్భంగా అక్టోబరు 2న ఈ లేఖ రాశారు. పెద్ద నోట్లు దుర్వినియోగం అవుతున్నాయని, కాబట్టి వాటిపై ఉన్న గాంధీ బొమ్మను తొలగించాలని ఆ లేఖలో కోరారు. రూ. 5, రూ. 10, రూ. 50, రూ. 100, రూ. 200 నోట్లపై మాత్రమే గాంధీ బొమ్మను ఉంచాలన్నారు.


ఆ నోట్లను ఎక్కువగా పేదలే ఉపయోగిస్తుంటారని,  కాబట్టి దుర్వినియోగం అయ్యే అవకాశం లేదని అన్నారు. పెద్ద నోట్లపై గాంధీ బొమ్మను తొలగించి ఆ స్థానంలో ఆయన కళ్లద్దాలను ఉపయోగించవచ్చని సూచించారు. అలాగే, అశోక చక్రాన్ని కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. గత ఏడున్నర దశాబ్దాలుగా దేశంలో అవినీతి దారుణంగా పెరిగిపోయిందన్నారు.  

Updated Date - 2021-10-08T02:13:37+05:30 IST