NEET: లోదుస్తులు తీస్తేనే నీట్‌ రాయనిచ్చారన్న వార్తలపై ఎన్‌టీఏ ఏమందంటే..

ABN , First Publish Date - 2022-07-19T20:47:03+05:30 IST

‘నీట్‌’ (NEET) పరీక్ష సందర్భంగా కేరళలోని కొల్లామ్‌ (Kollam) జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రం సిబ్బంది... విద్యార్థినులు లోదుస్తులు తీసిన తర్వాతే..

NEET: లోదుస్తులు తీస్తేనే నీట్‌ రాయనిచ్చారన్న వార్తలపై ఎన్‌టీఏ ఏమందంటే..

న్యూఢిల్లీ: ‘నీట్‌’ (NEET) పరీక్ష సందర్భంగా కేరళలోని కొల్లామ్‌ (Kollam) జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రం సిబ్బంది... విద్యార్థినులు లోదుస్తులు తీసిన తర్వాతే అనుమతించారనే వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొట్టిపారేసింది. ఈ ఘటనపై పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్‌ను NTA విచారించింది. ఈ విచారణలో లోదుస్తులు తీసిన తర్వాతే అనుమతించారనే వార్తలు కల్పితమని, దురుద్దేశపూర్వకంగా ఈ వాదనను తెరపైకి తెచ్చి ఫిర్యాదు చేశారని ఎన్‌టీఏ విచారణలో ఎగ్జామ్ సెంటర్ సూపరింటెండెంట్‌ చెప్పారు.


నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు చెబుతున్న ప్రకారం.. ఇలా జరిగిందని ఫిర్యాదు ఏమీ ఎన్‌టీఏకు అందలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఈ ఘటనపై తక్షణమే నివేదిక అందించాల్సిందిగా సదరు పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్‌కు, అబ్జర్వర్‌కు స్పష్టం చేసినట్లు ఎన్‌టీఏ అధికారులు తెలిపారు. ఆ బాలిక తండ్రి ఆరోపించినట్లుగా నీట్ డ్రెస్ కోడ్ అలాంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్ష జరగాలనే ఉద్దేశంతోనే నీట్ డ్రెస్ కోడ్‌ను అమలు చేసినట్లు తెలిపారు.



అసలు ఈ ఘటన ఏంటంటే..

కేరళలోని కొల్లామ్‌ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రం సిబ్బంది... విద్యార్థినులు లోదుస్తులు తీసిన తర్వాతే అనుమతించారని మీడియాలో వార్తలొచ్చాయి. సదరు కేంద్రంలో పరీక్ష రాసిన ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నీట్‌ నిబంధనల ప్రకారమే తాను బట్టలు వేసుకుందని, అందులో లోదుస్తుల ప్రస్తావనే లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్‌లలో ఎక్కువమంది పురుషులే ఉన్నారని, అలాంటప్పుడు విద్యార్థినులు లోదుస్తులు లేకుండా మూడు గంటలపాటు కూర్చొని పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తామని వారు తెలిపారు. సదరు సెంటర్‌లో సుమారు 100 మంది విద్యార్థినులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్టు సమాచారం.



ఈ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందు స్పందిస్తూ... విద్యార్థినుల పట్ల సిబ్బంది తీరు సరైందికాదని, ఈ విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కాగా... ఈ సంఘటనను కేరళ రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించింది. రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది. మహారాష్ట్ర వాషిం జిల్లాలోని ఓ నీట్‌ సెంటర్‌లో ఇద్దరు ముస్లిం విద్యార్థినులను బురఖాలు, హిజాబ్‌లు తీసేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. దీనిపై విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థునులు బురఖాలు, హిజాబ్‌లు తీసేయకపోతే తామే వాటిని కట్‌ చేస్తామంటూ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-19T20:47:03+05:30 IST