డ్రెయినేజీ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ABN , First Publish Date - 2022-01-19T05:06:55+05:30 IST

వైరాలోని జాతీయ ప్రధాన రహదారితోపాటు ఇతర ఆర్‌అండ్‌బీ రహదారులకు రెండువైపులా డ్రెయినేజీల నిర్మాణానికి సంబంధించి కొన్నినెలలుగా ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి.

డ్రెయినేజీ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
డ్రెయినేజీ నిర్మాణంపై స్పష్టతనిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌, ఆర్‌అండ్‌బీ డీఈ, మిషన్‌ భగీరథ అధికారులు

 50-55అడుగుల మధ్య నిర్మాణానికి మూడుశాఖల అధికారుల నిర్ణయం

వైరా, జనవరి 18: వైరాలోని జాతీయ ప్రధాన రహదారితోపాటు ఇతర ఆర్‌అండ్‌బీ రహదారులకు రెండువైపులా డ్రెయినేజీల నిర్మాణానికి సంబంధించి కొన్నినెలలుగా ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. ఈ డ్రెయినేజీ నిర్మాణాలకు సంబంధించి ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ, మునిసిపల్‌ శాఖల అధికారుల మధ్య సమన్వయం ఏర్పడి ఒక స్పష్టతకు వచ్చారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు మధ్యనుంచి 50-55అడుగుల మధ్యలో డ్రెయినేజీ నిర్మించేందుకు మూడుశాఖల అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆమేరకు కాంట్రాక్టర్‌కు స్పష్టతనిచ్చారు. మంగళవారం మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌.వెంకటస్వామి, ఆర్‌అండ్‌బీ డీఈఈ దేవికాచౌహాన్‌, ఏఈఈ భగవాన్‌నాయక్‌, మిషన్‌ భగీరథ డీఈఈ మూర్తి, వైరా, కొణిజర్ల ఏఈఈలు చైతన్య, శ్రీనివాసరావు మునిసిపల్‌ కార్యాలయంలో సమావేశమై డ్రెయినేజీ నిర్మాణానికి సంబంధించి చర్చించారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 45.50అడుగుల మధ్య డ్రెయినేజీ నిర్మాణం చేయాలని మునిసిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్ణయించగా మిషన్‌ భగీరథకు చెందిన గ్రిడ్‌ అలాగే ఇతర పైపులైన్లు అదేచోట ఉండటంతో భగీరథ అధికారులు అభ్యంతరం తెలిపారు. పైపులైన్‌ పైన డ్రెయినేజీ నిర్మిస్తే భవిష్యత్‌లో దాని మరమ్మతులు కానీ ఇతరత్రా నిర్మాణాలకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భగీరథ పైపులైన్‌పైన డ్రెయినేజీ నిర్మాణాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మూడుశాఖల మధ్య సమన్వయం కొరవడిందని ‘ఆంధ్రజ్యోతి’ స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటుచేసుకొని పైపులైన్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా 50-55అడుగుల మధ్యలో డ్రెయినేజీ నిర్మించాలని నిర్ణయించి కాంట్రాక్టర్‌కు స్పష్టతనిచ్చారు. మూడుశాఖల అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి ఈ విషయాన్ని ప్రకటించారు. మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ముళ్లపాటి సీతరాములు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T05:06:55+05:30 IST