Abn logo
Sep 25 2021 @ 23:39PM

తొలగిన ఉత్కంఠ

పొందూరు: వైస్‌ ఎంపీపీ విషయంలో పోలీసులతో వాగ్వాదం చేస్తున్న బొత్స రమణ


పొందూరు, సంతబొమ్మాళి ఎంపీపీల ఎన్నిక

సభ్యుడి వ్యతిరేకతతో పొందూరు వైస్‌ ఎంపీపీ ఎన్నిక వాయిదా

పొందూరు, సెప్టెంబరు 25: ఎంపీపీ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు శనివారం తెరపడింది. ఎంపీపీగా కిల్లి ఉషారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉండగా కోరం లేకపోవడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.  శనివారం మరలా సమావేశం నిర్వహించినా కొంతసమయం ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం ఒంటి గంటకు వైసీపీకి చెందిన పది మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వైసీపీకి చెందిన ఇద్దరు, టీడీపీకి చెందిన తొమ్మిది మంది హాజరుకాకపోవడంతో మరోసారి వాయిదా పడు తుందేమోనని అందరూ భావించారు. మధ్యాహ్నం 1.45 గంటలకు వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు సువ్వారి దివ్య, పెయ్యిల సరస్వతి హాజరయ్యారు. కొద్దిసేపటి తర్వాత టీడీపీ సభ్యులంతా హాజరయ్యారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎన్నికల హాలులోకి వచ్చి కూర్చున్నారు. 21 మంది సభ్యులు హాజరైనా ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోవడంతో అధికారులు వైసీపీ అధిష్టానం సూచించిన కిల్లి ఉషారాణి పేరును ప్రకటించగా అందరూ ఆమోదించారు. ఇదిలా ఉండగా వైస్‌ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా వం డాన శ్రీదేవి పేరును ప్రకటించారు. ఈ సమయంలో బొత్స రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ వారించినా.. తనకు అవకాశం కల్పించాలని, గతంలో తనకు హామీ ఇచ్చారని ఎన్నిక ప్రక్రియను అడ్డుకున్నారు. ఈనేపథ్యంలో పోలీసులకు రమణకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు వైస్‌ ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి డి.కిరణ్‌కుమార్‌ ప్రకటించారు. కోఆప్షన్‌ సభ్యుడిగా షేక్‌ పీర్‌ భాషా ఎన్నికయ్యారు.


వలంటీరును వరించిన పదవి

 గోకర్ణపల్లిలో గ్రామవలంటీరుగా పనిచేసిన ఉషారాణి ఎంపీపీ గా ఎన్నికకావడం విశేషం. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేక పోవడంతోపాటు తొలిసారి ఎంపీటీసీగా ఎన్నికైన ఆమెకు అదృష్టం వరించింది. పరిషత్‌ ఎన్నికల ముందు ఉషారాణి వలంటీర్‌గా పనిచేసేది. ఆమె భర్త కిల్లి నాగేశ్వరరావు ఆర్‌ఎంపీగా పనిచేస్తు న్నాడు. తొలుత పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోయినా పార్టీ వెన్ను తట్టడంతో వలంటీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేశారు. ఎంపీటీసీగా  గెలుపొందిన ఉషారాణికి మండలంలోని పార్టీలో పరిస్థితులు, సమీకరణలు కలిసొచ్చాయి. వైసీపీ నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే గెలవడం, ఎంపీపీ మహిళకు రిజర్వు కావడం ఆమెకు కలిసొచ్చింది.

 

సంతబొమ్మాళి ఎంపీపీగా రాజేశ్వరి 

సంతబొమ్మాళి: ఎంపీపీగా మేరుగు రాజేశ్వరి, వైస్‌ ఎంపీపీగా పొందల తులస మ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుగ్గు నిర్మ ల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ శనివారం 10 మంది రెబల్‌ ఎంపీటీసీ సభ్యులు బాయ్‌కాట్‌ చేయడంతో ఈ ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెబల్స్‌తో సంప్రదింపులు చేసి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మేరుగు రాజేశ్వరికి ఎంపీపీగా నిర్ణయించగా రెబల్స్‌ ఆమోదించడంతో కథ సుఖాంతమైంది. ఈ మేరకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలుగా రాజేశ్వరి, తులసమ్మ ఎన్నికైనట్లు మండల ఎన్నికల అధికారి పీవీ శ్రీనివాసరావు తెలిపారు.

 

 సీతంపేట వైస్‌ ఎంపీపీగా సరస్వతి

సీతంపేట: సీతంపేట వైస్‌ ఎంపీపీగా కె.సరస్వతిని ఎన్నుకున్నట్లు  మండల ప్రత్యేకాధికారి బి.శ్రీనివాసరావు, ఎంపీడీవో ఉమా మహేశ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక సామాజిక భవ నంలో వైస్‌ ఎంపీపీ  ఎన్నిక జరిగింది. ఇప్పటికే ఎంపీపీగా బిడ్డిక ఆదినారాయణను ఎన్నుకొన్నారు.