Abn logo
Sep 17 2021 @ 00:29AM

జాతినిర్మాణంలో నవచైతన్యం

ప్రపంచ జనప్రియ నాయకులలో అగ్రగణ్యుడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన సుదినం నేడు. తొలుత గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా మహా ప్రభావశీలమైన రెండు దశాబ్దాల ప్రస్థానం ఆయన్ని, సుదీర్ఘకాలంగా ప్రజాసేవ చేస్తున్న ప్రభుత్వాధినేతల్లో అద్వితీయుడిగా నిలబెట్టింది. నరేంద్ర మోదీ సమ్మోహన శక్తి అద్భుతమైనది. భారత ప్రజలతో సుదృఢ రాజకీయ మమేకత, చైతన్యశీల భావోద్వేగ అనుబంధమూ అపూర్వమైనది. అందువల్లే, ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ గల నాయకుడు నరేంద్ర మోదీ అని ఒక విశ్వసనీయ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ సర్వేలో వెల్లడయినప్పుడు సహజంగానే భారతీయులు ఎవరూ ఆశ్చర్యపోలేదు. 


నరేంద్ర మోదీ కేవలం మన ప్రధానమంత్రి మాత్రమే కాదు; ఒక సంస్కర్తగా పరిణమించిన పరిపాలకుడు కూడా. మన సమాజాన్ని సంక్షుభితం చేస్తున్న సామాజిక సమస్యలను ధర్మనిష్ఠతో, ఆవేశపూరితంగా లేవనెత్తి, బహిరంగచర్చలు, ప్రజలను భాగస్వాములుగా చేయడం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేసిన, చేస్తున్న కార్యదక్షుడు. బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన కన్పించని భారతదేశం, స్వచ్ఛ్‌భారత్ అభియాన్, బేటీ బచావో-బేటీ పడావో, నమామిగంగా అభియాన్ మొదలైన ఉద్యమాలే ఆయన సంస్కరణోత్సాహానికి శ్రేష్ఠతర నిదర్శనాలు. 


మోదీజీ తనను తాను ‘ప్రధాన్ సేవక్’గా భావించుకుంటారు. సమున్నత నైతిక, సామాజిక విలువల ద్వారా మన పురానవ సమాజం, ఆధునిక దేశాన్ని సర్వసమగ్రంగా అభివృద్ధిపరచుకోవచ్చని ఆయన విశ్వసిస్తారు. తన బాధ్యతల విషయంలో ఆయన ఎన్నడూ సంకోచించరు. జాతిని పీడిస్తున్న, వేధిస్తున్న అత్యంత దుష్కర సమస్యలపై సమరంలో ఆయన సదా ముందుంటారు. లక్ష్య పరిపూర్తి అయ్యేంతవరకు ఆయన విశ్రమించరు. సామాజిక సంబంధాలలో, రాజకీయ జీవితంలో ఆయన చిత్తశుద్ధి, న్యాయనిరతి ప్రశ్నించరానివి. మోదీజీ జీవనయానం ఒక ఋషితుల్యుడి ప్రస్థానం. న్యాయబద్ధమైన సమాజం, శక్తిమంతమైన జాతి నిర్మాణానికి అవిరామంగా కృషి చేస్తున్న ధర్మబద్ధుడు ఆయన. 


మన రాజ్యాంగంలోని అధికరణలు 370, 35ఎ రద్దు కాగలవని భారతీయులు ఎప్పుడైనా భావించారా? ఎన్నడైనా కలగన్నారా? అత్యంత ముఖ్యమైన ఈ గమ్యాన్ని చేరేందుకు జాతికి దశాబ్దాల కాలం పట్టింది. అయితే 2019 ఆగస్టు 5న ప్రతిదీ మారిపోయింది. మోదీ నాయకత్వంలో దృఢసంకల్పం, జంకుగొంకు లేని నిబద్ధతను జాతి చూసింది. అధికరణ 370 రద్దుతో జమ్మూ-కశ్మీర్ భారత్‌లో సంపూర్ణంగా అంతర్భాగమయింది. ‘ఒకే జాతి, ఒకే రాజ్యాంగం’ అన్న మన వాగ్దానం నెరవేరింది. అదేవిధంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో మోదీ సర్కార్ వలే పూర్వ ప్రభుత్వాలు నిర్ణయాత్మక మైన ధైర్యసాహసాలు చూపలేకపోయాయి. సాహసోపేత సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల ద్వారా ఉగ్రవాదులు, భారత్ వ్యతిరేకశక్తులకు, ప్రపంచానికి ఆయన ఒక కఠిన సందేశాన్ని పంపించారు. భారత్ మారింది; అది ఇంకెంతమాత్రం ఒక మృదురాజ్యం (సాఫ్ట్‌స్టేట్) కాదు; తన ప్రజలు, సరిహద్దులను సంరక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళుతుంది, ఎటువంటి చర్యనూ చేపట్టేందుకు వెనుకాడబోదని మోదీ తన అసాధారణ నిర్ణయాల ద్వారా ఎలుగెత్తి చాటారు. 


లాల్ బహదూర్ శాస్త్రి తరువాత యావద్భారత ప్రజలను దేశభక్తి ప్రపూరితులను చేసి, వారిని ఒక సమున్నత కర్తవ్యపాలనకోసం సమైక్యపరిచిన ఏకైక నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా విలయంలో ఆయన విజ్ఞప్తులను ప్రతి పౌరుడూ మతనిష్ఠతో అనుసరించాడు. తత్ఫలితంగా ఆ మహమ్మారిపై పోరులో భారత్ అద్వితీయమైన విజయాన్ని సాధించింది. మోదీ ఉత్తేజకర పిలుపునకు స్పందించి ‘పిఎమ్ కేర్స్ ఫండ్’కు ఎంతో మంది విరాళాలను అందించారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకువచ్చాయి. ప్రజలు తమ భయాందోళనలను విడనాడి బృహత్తరమైన టీకాకరణ (వ్యాక్సినేషన్)లో పాల్గొన్నారు. మహా వేగవంతంగా సాగిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 75 కోట్ల మందికి టీకా రెండు డోసులూ ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచ రికార్డు. 


శీఘ్రనిర్ణయాలు తీసుకోవడం నరేంద్ర మోదీ నాయకత్వ ఉత్కృష్ట లక్షణాలలో ఒకటి. ఇదే ఆయన్ని, తన పూర్వపు ప్రధానమంత్రులు, సమకాలిక ప్రభుత్వాధినేతల నుంచి విశిష్టంగా నిలబెడుతోంది. అతి స్వల్పవ్యవధిలో పూర్తిగా భారత్‌లోనే  కరోనా టీకాను అభివృద్ధిపరచడం ద్వారా ప్రపంచాన్ని ఆయన విస్మయపరిచారు. కొవిడ్ సంక్షోభం తీవ్రమయినప్పుడు వైద్య అవసరాలకు సంబంధించిన ఆక్సిజన్ సరఫరాలను కొద్ది రోజుల వ్యవధిలోనే ఇతోధికంగా పెంపొందించారు. ఇదీ మన ‘ప్రధాన్ సేవక్’ నాయకత్వ మహత్తు.


ప్రతి భారతీయుని ఆలోచనాసరళిని, దేశ రాజకీయ కార్యకలాపాల సంస్కృతిని కూడా మౌలికంగా మార్చివేశారు. మోదీకి ముందుభారత రాజకీయాలు కులతత్వం, వంశపారంపర్య పాలన, సంతుష్టీకరణ విధానాలు, బంధుప్రీతితో అలరారుతూ ప్రజాహితాన్ని కాల రాచేవి. ఆయన రాకతో అదంతా మారిపోయింది. రాజకీయాలలో ఉండడమంటే ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించడమేనని ఆయన నిరూపించారు. ఎవరి పట్ల, ఎటువంటి అంతరాలు చూపకుండా ప్రతి ఒక్కరి విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే ఆదర్శాన్ని ఆయన సంపూర్ణంగా పాటించారు. కుల మతాలు, భాషా, ప్రాంతీయ అంతరాలకు అతీతంగా రాజకీయాలను ఆయన రూపొందించారు. పురోగమనశీల రాజకీయాలకు పటిష్ఠ పునాదులను ‘ప్రధాన్ సేవక్’ నిర్మించారు. 


2014కి పూర్వం రాజకీయపార్టీల మేనిఫెస్టోలు ఓట్ల సమీకరణకు ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడేవి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను చేపట్టిన తరువాత బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి మాట ‘ప్రధాన్ సేవక్’కు అనుల్లంఘనీయమైపోయింది. మన ప్రభుత్వానికి అది ఒక అత్యంత ముఖ్యమైన మార్గదర్శకపత్రమయింది. ఇప్పుడు ఒక మేనిఫెస్టో ప్రాధాన్యాన్ని ప్రజలు, పార్టీలు గుర్తిస్తున్నాయి. ఇది, మన ప్రభుత్వ విధానం లేదా రాజ్య పాలనాపద్ధతిలో ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఒక స్పష్టమైన మార్పు. 


నరేంద్ర మోదీ ప్రభుత్వ పని సంస్కృతికి పర్యాయపదం ‘ప్రగతి’. ముందుగానే చొరవతో కార్యాచరణకు ఉపక్రమించడం, చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయ డం, అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేకుండా పథకాలు, కార్యక్రమాలను అమలుపరచడం ద్వారా ప్రజలకు ఇతోధిక శ్రేయస్సు సమకూర్చడం మోదీ సర్కార్ విశిష్టత. కనుకనే దశాబ్దాలుగా అసంపూర్ణంగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టులను స్వల్ప కాలంలో పూర్తి చేయగలిగింది. 


మోదీ యశోభూషణాలు విశిష్టమైనవి. అసాధారణ వ్యక్తిత్వం, లోపరహిత గుణ సంపన్నత, మచ్చలేని పేరుప్రతిష్ఠలు, సమర్థ, ప్రభావశీల నాయకత్వం, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు, మనసు నిండా కరుణ, కార్యసాధనలో ఓర్పు, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం మోదీ విలక్షణతలలో కొన్ని మాత్రమే. ఇవన్నీ ప్రతిరోజూ ఆయన రాజకీయ, సామాజిక జీవితంలో ప్రతిఫలిస్తుంటాయి. ఒక ‘బాల స్వయంసేవక్’ నుంచి ‘ప్రధాన్ సేవక్’ అయ్యేంతవరకు ఆయన సదా కఠోర క్రమశిక్షణాయుత జీవితాన్ని గడిపారు. 


అంతర్జాతీయ వ్యవహారాలలో మోదీ పాత్ర అనితరసాధ్యమైనది. అమెరికా, యూరోపియన్, గల్ఫ్ దేశాలతో మన దౌత్య సంబంధాలను ఒక కొత్త స్థాయికి ఆయన తీసుకువెళ్ళారు. ఇటీవలే ముగిసిన ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో భారత్ మున్నెన్నడూ లేని విధంగా తన క్రీడా ప్రతిభను ప్రదర్శించింది. నిర్ణయాత్మకంగా వ్యవహరించే, వ్యవస్థానిర్మాణ దక్షుడైన ప్రధానమంత్రి నాయకత్వం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. 


నరేంద్ర మోదీ తన యావజ్జీవితాన్ని సంపూర్ణంగా రైతులు, దళితులు, మహిళలు, అణగారిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అంకితం చేశారు. యువజనుల శ్రేయస్సుపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. కొవిడ్ ఉపద్రవంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహారధాన్యాలను ఆయన సమకూర్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 55 కోట్ల మందికి ఐదు లక్షల రూపాయల విలువైన వైద్య బీమా సదుపాయం కల్పించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద 12 కోట్ల మంది రైతులకు (వీరిలో 80 శాతం మంది సన్నకారు, చిన్నకారు రైతులు) రూ.6000 వార్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. పేదలకు గృహవసతి కల్పించడంలో ఒక విప్లవాత్మక మార్పును సాధించారు. 


నరేంద్ర మోదీ యోగసాధకుడు. భారతదేశ సమున్నత సంస్కృతీ సంప్రదాయమైన యోగాను యావత్ప్రపంచానికీ సుపరిచితం చేసిన ఘనత ఆయనదే. ప్రతి జూన్ 21న అంతర్జాతీయ యోగాదివస్ మానవాళికి మోదీ కానుక. ఆయన శక్తి సామర్థ్యాలు, ఓపిక ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైనవి. మోదీ పుట్టిన రోజును భారతీయ జనతాపార్టీ మొదటి నుంచీ ‘సేవా దివస్’గా నిర్వహిస్తూ వస్తోంది. ఆయన నాయకత్వంలో, ‘సేవా హి సంఘథాన్’ అనే ఆదర్శభావంతో పార్టీ పని చేస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ఆయన పుట్టినరోజున ప్రత్యేకంగా కృషి చేస్తారు. ఇందులో భాగంగా ఆసేతు హిమాచలం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు; పేదలకు ఆహారధాన్యాలు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఆర్తులకు అవసరమైన ప్రతి సహాయాన్ని సమకూరుస్తారు. మన ప్రధానమంత్రి జీవితం నుంచి ప్రేరణ పొంది జాతి సమున్నతికి, పౌరుల సంక్షేమానికి కృషి చేస్తామని ఈ సుదినాన మనమందరం ప్రతిన బూనాలి. 


ప్రజల సంక్షేమానికి, శ్రేయస్సునకు నరేంద్ర మోదీ తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసినందునే అన్నిటా అద్భుత విజయాన్ని సాధించారు. ఆయన సదా ‘మొదట దేశమే’ అన్న ఆదర్శాన్ని పాటించారు. సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ లక్ష్య పరిపూర్తిలో సఫలమయ్యారు. భారత్‌ను ఒక ‘విశ్వగురు’గా చేయడమే ఆయన ఏకైక ధ్యేయం. ప్రపంచంలో నేడు తమకు విలక్షణ కీర్తిప్రతిష్ఠలు సముపార్జించుకున్న నాయకులు చాలామంది ఉన్నారు. అయితే వారిలో అత్యధికులు కేవలం ఒకటి లేదా రెండు మౌలిక చొరవలతో మాత్రమే ఆ ప్రతిష్ఠను పొందారు. అయితే మన ప్రధానమంత్రి పూర్తిగా భిన్నమైన విశిష్టుడు. వివిధ రంగాలలో ఆయన పూర్తిగా నవ్యపథాలను అనుసరించారు. అసాధారణ విజయాలను సాధించారు. భారతదేశమూ, ప్రపంచమూ నరేంద్ర మోదీ విజయాలను, విశిష్టతలను సదా గుర్తుంచుకుంటాయి. 

                                (నేడు నరేంద్ర మోదీ 71వ పుట్టినరోజు)

జగత్ ప్రకాష్ నడ్డా

భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు

ప్రత్యేకంమరిన్ని...