డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్పు... బీజేపీకి శశి థరూర్ సలహా...

ABN , First Publish Date - 2021-01-20T21:36:30+05:30 IST

చైనాను గుర్తుకు తెచ్చే ఓ పండు పేరును గుజరాత్ ప్రభుత్వం

డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్పు... బీజేపీకి శశి థరూర్ సలహా...

న్యూఢిల్లీ : చైనాను గుర్తుకు తెచ్చే ఓ పండు పేరును గుజరాత్ ప్రభుత్వం మార్చడంపై జోకులు పేలుతున్నాయి. కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కార్తి చిదంబరం, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ సెటైర్లు వేశారు. 


గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ మంగళవారం మాట్లాడుతూ, డ్రాగన్ పండు పేరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పండు పై భాగం కమలం పువ్వును పోలి ఉంటుందని చెప్పారు. దీనిని ఇప్పటి వరకు డ్రాగన్ ఫ్రూట్ అని పిలుస్తున్నారని, ఈ పేరు చైనాకు సంబంధించినదని, దీని పేరును తాము మార్చామని చెప్పారు. ఈ పండు పేరును ‘కమలం’గా మార్చినట్లు తెలిపారు. పేరు మార్చడానికి గుజరాత్ ప్రభుత్వం దరఖాస్తు చేసిందన్నారు. ఇదిలావుండగా, రైతులు ఇప్పటికే ఈ పండుకు ‘కమలం పండు’గా బ్రాండింగ్ చేసేశారు. 


ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విటర్ వేదికగా బీజేపీకి ఓ సలహా ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పోటీ పడుతున్నారా? ఎగతాళి చేస్తున్నారా? ఈ ముఖ్యమంత్రులకు బాగా తెలిసిన ఏకైక విషయం పేర్లు మార్చడమే కాబట్టి, వీరికి పని కల్పించేందుకు బీజేపీ ప్రభుత్వం ‘నేషనల్ రీనేమింగ్ కౌన్సిల్’ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. 


డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో డ్రాగన్‌ను వధించారని పేర్కొన్నారు. 


శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఇచ్చిన ఓ ట్వీట్‌లో ‘‘డ్రాగన్‌ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు, ఓ ఆగండి, నా ఉద్దేశం డ్రాగన్ ఫ్రూట్’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-20T21:36:30+05:30 IST