కుదరదు కట్టాల్సిందే.. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లపై నిర్ణయం

ABN , First Publish Date - 2020-09-19T18:38:51+05:30 IST

కరోనా కష్టాలు మున్సిపాలిటీలను వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు మూతపడ్డాయి. మూడు నెలలపాటు వ్యాపారాలు లేవు. దీంతో అద్దె మినహాయించాలంటూ వ్యాపారులు మున్సిపాలిటీలకు ప్రతిపాదించారు

కుదరదు కట్టాల్సిందే.. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లపై నిర్ణయం

మూడు నెలలపాటు మినహాయింపునకు వ్యాపారుల వేడుకోలు

కుదరదని తేల్చేసిన మున్సిపల్‌ శాఖ.. అద్దె వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): కరోనా కష్టాలు మున్సిపాలిటీలను వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లు మూతపడ్డాయి. మూడు నెలలపాటు వ్యాపారాలు లేవు. దీంతో అద్దె మినహాయించాలంటూ వ్యాపారులు మున్సిపాలిటీలకు ప్రతిపాదించారు. తర్జన భర్జనలు పడ్డ మున్సిపాలిటీలు చివరకు వసూలు చేయాలని, ఇందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. ఏలూరు నగరపాలక సంస్థతోపాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల్లోనూ లాక్‌డౌన్‌ కాలంలో షాపులు మూతపడ్డాయి. అద్దెవసూళ్లు మందగించాయి. జిల్లాలోని మున్సిపాలిటీల్లో కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టం కోటి రూపాయల వరకు ఏడాదికి అద్దె వసూలవుతుంది. మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో చిరు వ్యాపారాలతోపాటు, ఆటోమొబైల్స్‌, మెకానిక్‌ షాపులు వంటివి ఉన్నాయి. లాక్‌ డౌన్‌లో దాదాపు అన్ని షాపులు మూతపడ్డాయి. వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు.


జంగారెడ్గిడూడెం, కొవ్వూరు, నిడదవోలు వంటి మున్సిపాలిటీల్లో ఒక్కో షాపు అద్దె సగటున రూ.3 వేల వరకు ఉంటుంది. అదే తాడేపల్లిగూడెం, భీమవరం పురపాలక సంఘాల్లో అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. వ్యాపారాలు లేకపోవడంతో అంత పెద్ద మొత్తంలో అద్దె చెల్లించలే మంటూ షాపు నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం మూడు నెలలపాటు మినహాయింపు ఇస్తే కోలుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలత రాలేదు. ప్రస్తుతం అన్‌లాక్‌ నడుస్తున్నా వ్యాపారాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని నిర్వాహకులు చెపుతున్నారు. ఒకేసారి గత బకాయిలు, ప్రస్తుత అద్దె చెల్లించడం కష్టతరం కానుందని నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు.

Updated Date - 2020-09-19T18:38:51+05:30 IST