బాడుగ బారం.. అద్దెలు చెల్లించలేక వ్యాపారుల ఇబ్బందులు..

ABN , First Publish Date - 2020-09-19T18:35:51+05:30 IST

సావిత్రి.. ఒంటరి మహిళ. తనకున్న రెండు పోర్షన్ల చిన్న ఇంటిలో ఒక పోర్షన్‌ను నెలకు రూ.3 వేలకు అద్దెకు ఇచ్చింది. ఈ మొత్తంతోపాటు ఆమెకు వచ్చే పింఛన్‌ సొమ్ముతో కలిపి జీవిస్తోంది. డయాబెటిస్‌, తదితర వ్యాధుల మందులకు, నెలవారీ ఖర్చులకు ఆమెకు అద్దె డబ్బులు,

బాడుగ బారం.. అద్దెలు చెల్లించలేక వ్యాపారుల ఇబ్బందులు..

వసూలు కాక యజమానుల అవస్థలు

పెరుగుతున్న కరోనా కష్టాలు


పాలకొల్లు(ఆంధ్రజ్యోతి): సావిత్రి.. ఒంటరి మహిళ. తనకున్న రెండు పోర్షన్ల చిన్న ఇంటిలో ఒక పోర్షన్‌ను నెలకు రూ.3 వేలకు అద్దెకు ఇచ్చింది. ఈ మొత్తంతోపాటు ఆమెకు వచ్చే పింఛన్‌ సొమ్ముతో కలిపి జీవిస్తోంది. డయాబెటిస్‌, తదితర వ్యాధుల మందులకు, నెలవారీ ఖర్చులకు ఆమెకు అద్దె డబ్బులు, పింఛన్‌ డ బ్బులే ఆధారం. ఇంట్లో అద్దెకు ఉండే వెంకటాచలం తాపీ పని చేస్తాడు. ఆరు నెలలుగా పనులు లేక అద్దె చెల్లించలేకపోయాడు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే అద్దె ఎలా ఇస్తామని, పనులు పుంజుకుంటే నెలవారీ అద్దెతోపాటు బకాయి చెల్లిస్తానని చెప్పినప్పటికీ.. ఇక్కడ ఎవరి కష్టాలు వారివి..!


జిల్లాలోకి కరోనా ప్రవేశించి ఆరు నెలలు గడుస్తున్నా.. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా..  వ్యాపారాలు ఇంకా గాడిన పడలేదు. చిన్న తరహా వర్తకులు ఆర్థికంగా తేరుకోలేదు. చిరుద్యోగులు, దినసరి కార్మికుల పరిస్థితి ఆశించిన విధంగా లేదు. నెలల తరబడి ఇల్లు, దుకాణాల అద్దెలు చెల్లింకపోవడంతో యజమానుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పులువురు గొడవలు పడుతున్నారు. తమకు మరికొంత సమయం కావాలని అద్దెదారులు అభ్యర్థిస్తున్నారు. తాము ఒక పోర్షన్‌లో ఉంటూ ఒక పోర్షన్‌ అద్దెకు ఇచ్చి అవే సొమ్ములతో ఇల్లు గడుపుకుంటున్నామని, నెలల తరబడి అద్దె ఇవ్వకుంటే తాము ఎలా బతికేదంటూ చిన్నతరహా ఇంటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అనంతస్వామి ఇంటిలో ఒక భాగాన్ని రెండు షాపులుగా మార్చి ఒక షాపు బార్బర్‌కూ, మరో షాపు మోటర్‌ మెకానిక్‌కు అద్దెకు ఇచ్చాడు. మూడు నెలలపాటు వీరిద్దరూ షాపు తీయలేదు. రెండు నెలలుగా షాపులు తీస్తున్నప్పటికీ ఇరువురికి పెద్దగా పనిలేక ఆదాయం తగ్గిపోయింది. తమను ఆర్థికంగా ఎవరైనా ఆదుకుంటారని ఎదురుచూస్తుంటే ఆరు నెలలుగా అద్దె కట్టడం లేదని యజమాని ఘర్షణకు దిగుతున్నాడు.  జిల్లాలో అనేక మంది అవస్థలు పడుతున్నారు. అద్దెలు వసూలు కాక రోజువారీ పంచాయితీలు పెరిగిపోయాయి. అద్దె ఇళ్లలో ఉంటున్న వారిలో 50 శాతం పైబడి నెల నెలా అద్దె సక్రమంగా చెల్లిస్తుండగా మరో 50 శాతం బాడుగదార్లు అద్దె చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు అద్దెలు నెల నెలా చెల్లిస్తున్నప్పటికీ వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు, సామాన్య ప్రజలు ఇంటి అద్దెను చెల్లించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో సుమారు రెండు లక్షల కుటుంబాలు అద్దె ఇళ్లల్లో ఉంటున్నాయి. వర్తక, వాణిజ్యాలు నిర్వహించే వారు 75 శాతం పైబడి రెంట్‌ లేదా లీజులలో ఉన్నారు. ప్రైవేట్‌ అద్దె షాపుల బకాయిలు యజమాని, లీజుదార్లకే పరిమితమై ఉన్న పరిస్థితుల్లో అవగాహన మేరకు అద్దె చెల్లిస్తున్నారు. పురపాలక సంఘాలలో అద్దె మాఫీ చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చేశారు. రానున్న రెండు, మూడు నెలల్లో జిల్లాలో వ్యాపారాలు పుంజుకోనట్లయితే అద్దె కష్టాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. 

Updated Date - 2020-09-19T18:35:51+05:30 IST