నీటిపారుదల శాఖలో..పునర్‌ వ్యవస్థీకరణకు కసరత్తు

ABN , First Publish Date - 2020-10-20T06:07:11+05:30 IST

పలు విభాగాలుగా చీలి ఉన్న నీటిపారుదల రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించి హైదరాబాదులో కసరత్తు జరుగుతోం

నీటిపారుదల శాఖలో..పునర్‌ వ్యవస్థీకరణకు కసరత్తు

ఉమ్మడి జిల్లాకు ఇద్దరు సీఈలు,నలుగురు ఎస్‌ఈలు

ఒకే గొడుగు కిందకు అన్నిశాఖలు


ఖమ్మం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పలు విభాగాలుగా చీలి ఉన్న నీటిపారుదల రంగాన్ని  రాష్ట్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించి హైదరాబాదులో కసరత్తు జరుగుతోంది. నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరించి మేజర్‌, మీడియం, మైనర్‌ శాఖలతో పాటు ఐడీసీ స్పెషల్‌, ఎన్‌ఎస్‌పీ తదితర నీటిపారుదల విభాగాలను కూడా నీటిపారుదలశాఖ కిందకు తేబోతున్నారు. ఈప్రక్రియలో భాగంగా ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి జిల్లాల్లో కూడా ఒకే గొడుగు కిందకు నీటిపారుదలశాఖ రాబోతోంది. ఖమ్మంలో ప్రస్తుతం ఒక చీఫ్‌ ఇంజనీర్‌ మాత్రమే ఉన్నారు. రీఆర్గనైజేషన్‌లో భద్రాద్రి జిల్లాకు కూడా ఒక చీప్‌ ఇంజనీర్‌ పోస్టు మంజూరు అవుతుంది. దీంతో వేర్వేరు జిల్లాలకు ఇద్దరు సీఈలు నీటిపారుదల వ్యవహారాలను చూడబోతున్నారు. దీంతోపాటు ఖమ్మంజిల్లాకు ఇద్దరుఎస్‌ఈలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇద్దరు ఎస్‌ఈలు రానున్నారు. ప్రస్తుతం నీటిపారుదలశాఖ కింద రెండు జిల్లాలో ఇద్దరు ఎస్‌ఈలు మాత్రమే ఉన్నారు. 


కొత్త డివిజన్ల ఏర్పాటు  

రెండు జిల్లాల్లో నీటిపారుదల శాఖలో కొత్త డివిజన్లు, సబ్‌డివిజన్లుఏర్పాటుకానున్నాయి. దీంతో పాలనాపరంగా పనులు సులభతరం కానుంది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సీతారామసాగునీటి ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారురూ.15వేల కోట్లతో పదిలక్షల ఎకరాలకు సాగునీరందించే సీతారామ పనులు పర్యవేక్షణకు ఇద్దరు ఎస్‌ఈలు ఉండగా మరో ఇద్దరు అదనంగా రానున్నారు. దుమ్ముగూడెం వద్ద రూ.3500కోట్లతో సీతమ్మసాగర్‌ పనులు జరగబోతున్నందున అక్కడ కూడా ప్రత్యేకంగా ఒక ఎస్‌ఈ పోస్టు మంజూరుకానుంది. ఇకపై నీటిపారుదలశాఖ ఒకేగూటికి చేరితే లిఫ్ట్‌ ఇరిగేషన్‌, ఎన్నెస్పీ, చెరువుల నిర్మాణంతోపాటు అన్నిరకాల నీటిపారుదల పనులన్నీ ఒకేశాఖపరంగా చూడనున్నారు. ఇలా ఇరిగేషన్‌ను రీ ఆర్గనైజ్‌ చేయడం ద్వారా త్వరితగతిన టెండర్లు, డిజైన్లు పనులు పర్యవేక్షణ, సకాలంలో అనుమతులతో పనులు వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు.  

Updated Date - 2020-10-20T06:07:11+05:30 IST