Abn logo
Sep 26 2021 @ 02:34AM

తెలంగాణ వర్సిటీలో గుట్టుగా పోస్టుల భర్తీ!

ఔట్‌సోర్సింగ్‌ ద్వారా 49 మంది నియామకం..

నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంపై అనుమానాలు

అక్రమాలు జరిగాయంటూ విద్యార్థి సంఘాల ఆందోళన


నిజామాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో నోటిఫికేషన్‌ ఇవ్వకుండానే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా సిబ్బందిని భర్తీ చేయడం దుమారం రేపుతోంది. ఈ ప్ర క్రియలో అక్రమాలు జరిగాయని విద్యార్థి సంఘా లు ఆరోపిస్తుండగా.. అలాంటిదేమీ లేదని వర్సిటీ యంత్రాంగం చెబుతోంది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధి లో ఇప్పటికే 270 మంది వరకు ఔట్‌సోర్సింగ్‌ సి బ్బంది పని చేస్తున్నారు. ఇటీవలే కొత్తగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం.. అత్యవసర పనుల పేరిట ఔట్‌సోర్సింగ్‌ ద్వారా 49 మందిని భర్తీ చేసింది. పది రోజులుగా వీరు విధులకు హాజరవుతున్నారు. వాస్తవానికి విశ్వవిద్యాలయం పరిధిలో ఏ నియామకం చేపట్టాలన్నా ఉ న్నత విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి.  తప్పకుండా నోటిఫికేషన్‌ ఇవ్వాలి. కానీ, ఈ నిబంధనలన్నింటికీ వర్సిటీ అధికారులు నీ ళ్లు వదిలారు. అదేమంటే అత్యవసర పనుల నిమిత్తం తీసుకున్నామని సమాధానమిస్తున్నారు. వి ద్యార్థి సంఘాల నాయకులు దీన్ని తప్పుపడుతున్నారు.  కొత్త పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయడం వల్ల తాము నష్టపోతున్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియామకాలను రద్దు చేసి ఔ ట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేసి నా నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని కోరుతూ కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు.


గతంలోనూ ఇదే పరిస్థితి

గత వీసీ హయాంలోనూ ఎలాంటి అనుమతులు లేకుం డా 40 మందిని భర్తీ చేయగా... విద్యార్థి సంఘా ల ఆందోళనలతో వారిని తొలగించారు. పోస్టుల భర్తీని ఈసీ సమావేశం సైతం తప్పు ప ట్టింది. ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా కొత్త ని యామకాలు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చారు. ఉన్న సిబ్బందితోనే పని చేయాలని సూచించారు. అప్పటి నుంచి మూడేళ్లుగా నియామకాలు చేపట్టలేదు. ఇటీవల కొత్త వీసీగా రవీందర్‌ గుప్తా వచ్చిన తర్వాత కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న కారణంతో పోస్టుల భర్తీ ప్రారంభించారు. అయితే, నిబంధనలు పాటించకపోవడం, కనీసం నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


అవసరాల రీత్యానే భర్తీ చేశాం

కరోనా కారణంగా విశ్వవిద్యాలయంలో చాలా మంది విధులకు హాజరు కావడం లేదు. డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బంది అత్యవసరం కావడం వల్లే ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో కొందరిని తీసుకున్నాం. ఈసీ అనుమతి తీసుకున్న తర్వాతే వారికి వేతనాలు చెల్లిస్తాం. పోస్టుల భర్తీలో డబ్బు వసూలు చేశారని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు.

- రవీందర్‌ గుప్తా, తెలంగాణ వర్సిటీ వీసీ