Abn logo
Dec 3 2020 @ 12:10PM

ఓల్డ్ మలక్‌పేటలో ప్రశాంతంగా కొనసాగుతున్న రీ పోలింగ్

హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో రీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డివిజన్ పరిధిలో మొత్తం ఓటర్లు 54,655 మంది కాగా..అందులో పురుషులు 27,889, స్త్రీలు 26,763, ఇతరులు ముగ్గురు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రిటర్నింగ్ అధికారిగా తాహసీల్దార్ శైలజను ప్రత్యేకంగా నియమించారు. ఎన్నికల బరిలో ఉన్న ఆరుగురు అభ్యర్థుల్లో సీపీఐ అభ్యర్థి ఫాతిమాకు కేటాయించిన ఎన్నికల గుర్తు తారుమారు కావడంతో ఆ పార్టీకి చెందిన నాయకులు ఎన్నికల కమషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ మంగళవారం జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి.. గురువారం రీ పోలింగ్ నిర్వహిస్తోంది.


రీపోలింగ్ కోసం అధికారులు 69 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అలాగే 12 మంది మైక్రో అబ్జర్వర్‌‌లను నియమించారు. దాదాపు 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఓల్డ్ మలక్‌పేట్ రీపోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను నగర అదనపు పోలీసు కమిషనర్ చాహర్ పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ రీపోలింగ్ కొనసాగుతోంది. క్విక్ రియాక్షన్ టీం అందుబాటులో ఉంది. స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీ పోలీస్, ఆర్మ్ రిజర్వ్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
Advertisement