50వేల రిపోర్టులు పెండింగ్‌

ABN , First Publish Date - 2020-08-02T10:38:14+05:30 IST

ఎర్లీ డిటెక్షన్‌, ఎర్లీ టెస్ట్‌, ఎర్లీ రిజల్టు, ఎర్టీ ట్రీట్‌మెంట్‌. నాలుగు ఎర్లీలు సాధిస్తే కరోనా వ్యాప్తి నివారణతో పాటు, మరణాలు ..

50వేల రిపోర్టులు పెండింగ్‌

తిరుపతి (ఆంధ్రజ్యోతి): ఎర్లీ డిటెక్షన్‌, ఎర్లీ టెస్ట్‌, ఎర్లీ రిజల్టు, ఎర్టీ ట్రీట్‌మెంట్‌. నాలుగు ఎర్లీలు సాధిస్తే కరోనా వ్యాప్తి నివారణతో పాటు, మరణాలు తగ్గించవచ్చు అని ఇటీవల కొవిడ్‌ సమన్వయ కమిటీలోని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కమిటీ జిల్లా అధికారులకు, నేతలకు విన్నవించింది. ఎర్లీ డిటెక్షన్‌కు, గతంలో ప్రభుత్వం కృషి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జనం అవగాహన పెరిగి ఎవరికి వారు భయంతో గంటల కొద్ది క్యూలో ఉండి, శ్వాబ్‌ ఇస్తున్నారు. కాకపోతే ఆ తర్వాత రిపోర్టు వచ్చేదాకా వాళ్ళ గుండెల్లో రైళ్లు ఎన్ని రోజులైనా పరిగెడుతూనే ఉన్నాయి.


రిపోర్టు ఏమొస్తుందో అనే ఆందోళన... ఎంతకీ రావడం లేదనే టెన్షన్‌ వారిని భయంలో కూరుకుపోయేలా చేస్తోంది. జిల్లాలో ఎడాపెడా శ్వాబ్‌ సేకరిస్తున్నా పరీక్షలు అంతే వేగంగా సాగడం లేదని ఇంతకాలం అందరూ ఆందోళన చెందారు. అసలు పరీక్షలు పూర్తయి ఫలితం వచ్చినా బాధితులకు రిపోర్టులు అందించడంలో విపరీత జాప్యం జరుగుతోంది. జిల్లాలో దాదాపు 50వేల రిపోర్టులు సిద్ధమైనా బాధితులకు సమాచారం అందకుండా ఆగిపోయాయని తెలుస్తోంది.


తిరుపతిలోని స్విమ్స్‌, రుయాలతో పాటూ ఒక ప్రైవేటు ల్యాబులో టెస్టులు రాత్రింబవళ్ళు చేస్తున్నారు. వేలాదిగా వచ్చిపడుతున్న శ్వాబ్‌లు పరీక్షించి రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు. అందాకా బాగానే ఉన్నా వీటిని బాధితులకు అందేలా చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. రిపోర్టు ఫలితాలను రెండు వెబ్‌సైట్లలో ఫీడ్‌ చేయాలి. ఒకటి స్టేట్‌ వెబ్‌ సైట్‌, రెండు ఐసీఎంఆర్‌ వెబ్‌ సైట్‌. తిరుపతిలోని ల్యాబుల్లో పాజిటివ్‌ వచ్చిన ఫలితాలను స్టేట్‌ వెబ్‌ సైట్‌లో ఫీడ్‌ చేస్తున్నారు. అయితే ఐసీఎంఆర్‌ వెబ్‌సైట్‌ లో ఫీడ్‌ చేయడం లేదు.


ఐసీఎంఆర్‌ సైట్‌లో ఫీడ్‌ చేస్తేనే అది మెసేజ్‌ రూపంలో బాధితులకు వస్తుంది. అనేక వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి వస్తోంది. ఇందుకు చాలా సమయమే పడుతోంది. ఇంత సమాచారాన్ని నమోదు చేయడానికి తగిన ఏర్పాట్లు ఏవీ ఈ ల్యాబుల్లో లేకపోవడం వల్ల ఈ జాప్యం జరుగుతోంది. ఒక్కసారిగా ఇంత సమాచారం గుప్పించడంతో సర్వర్‌ డౌన్‌ కావడం కూడా కారణం అవుతోంది.ఇంత పని చేయడానికి తగినంత మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా లేరు. ఉన్నవారు ఎంత పని చేసినా తరగడం లేదు. దీంతో ల్యాబ్‌ల్లో కుప్పలు తెప్పలుగా రిపోర్టులు మూలన పడి ఉంటున్నాయి. 


టీటీడీ అండ... తరగని రిపోర్టుల కొండ

ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని టీటీడీ సాయం కోరారు. పదిమంది డీటీపీ ఆపరేటర్లను తాత్కాలికంగా టీటీడీలోని ఐటీ విభాగం కేటాయించింది కూడా. అయినా రిపోర్టులు పేరుకుపోతూనే ఉన్నాయి. ఇందుకు కారణం స్విమ్స్‌లో ఏడుగురు, రుయాలో ముగ్గురు మాత్రమే డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉండడం. వీరికి పదిమంది తోడు అయినా నిల్వ ఉండిపోయిన సమాచారం నమోదు చేయడం సాధ్యం కావడం లేదు. ప్రతి రిపోర్టుకు సంబంధించీ 19 అంశాల సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న తీరులోనే జరిగితే ఇంకో పది రోజులకు కూడా రిపోర్టులు తరగవు. పాజిటివ్‌ వచ్చిన వారి సమాచారం అయినా వెంటనే అందే ఏర్పాటు చేయకపోతే చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంది. 

Updated Date - 2020-08-02T10:38:14+05:30 IST