గణతంత్ర దినోత్సవ గౌరవం గాలికి...

ABN , First Publish Date - 2022-01-27T05:23:35+05:30 IST

గణతంత్ర దినోత్సవం రోజుదేశవ్యాప్తంగా అధికారులు జాతీయ జెండాలను ఆయా కార్యాలయాల వద్ద ఆవిష్కరిస్తుంటారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరైనప్పటికి జెండా ఆవిష్కరణ మాత్రం అధికారులే చేస్తుంటారు. బుధవారం అద్దంకి నగరపంచాయతీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చైర్‌పర్సన్‌ చేయగా, కమిషనర్‌ ఫజులుల్లా మాత్రం వెనుక వరుసలో నిలబడిపోయారు. దీంతో అక్కడ హాజరైన వారందరూ విస్మయానికి గురయ్యారు

గణతంత్ర దినోత్సవ గౌరవం గాలికి...
అద్దంకి నగరపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వెనుక వైపు నిలబడి ఉన్న కమిషనర్‌ ఫజులుల్లా

జెండా ఆవిష్కరించిన చైర్‌పర్సన్‌

ఆవిష్కరించాల్సిన కమిషనర్‌ వెనక్కు..

విస్మయానికి గురైన పలువురు

అద్దంకి, జనవరి 26 : గణతంత్ర దినోత్సవం రోజుదేశవ్యాప్తంగా అధికారులు జాతీయ జెండాలను ఆయా కార్యాలయాల వద్ద  ఆవిష్కరిస్తుంటారు.  కొన్ని చోట్ల  ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరైనప్పటికి జెండా ఆవిష్కరణ మాత్రం అధికారులే చేస్తుంటారు. బుధవారం అద్దంకి నగరపంచాయతీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చైర్‌పర్సన్‌ చేయగా,  కమిషనర్‌ ఫజులుల్లా మాత్రం వెనుక వరుసలో నిలబడిపోయారు. దీంతో అక్కడ హాజరైన వారందరూ విస్మయానికి గురయ్యారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య వచ్చిన సమయానికి చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ రాలేదు. దీంతో కృష్ణచైతన్య ఫోన్‌ చేసి మాట్లాడటంతో చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ  అప్పటికప్పుడు హడావుడిగా వచ్చారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. ఆ సమయంలో కమిషనర్‌ సమీపంలోనే వెనుక వరుసలో ఉండి పోయారు. ఈ విషయమై కమిషనర్‌  ఫజులుల్లాను ఆంధ్రజ్యోతి ఫోన్‌లో వివరణ కోరగా జాతీయ జెండాను అధికారిగా తాను ఎగుర వేయాల్సిన విషయాన్ని తెలియజేశానని చెప్పుకొచ్చారు. గణతంత్ర వేడుకల నిర్వహణకు తయారు చేసిన ఆహ్వాన పత్రంలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించలేదన్న ఉద్దేశంతో వారు హాజరయ్యేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణచైతన్య ఫోన్‌ చేయటంతో తప్పనిసరి పరిస్థితులలో అప్పటికప్పుడు హడావుడిగా వచ్చినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ పలు సందర్భాలలో కంట తడిపెట్టడం కనిపించింది.  

 

Updated Date - 2022-01-27T05:23:35+05:30 IST