Sep 26 2021 @ 01:26AM

అందరూ ఆనందంగా ఉండాలనుకొనే వ్యక్తి తేజ్‌! -పవన్‌కల్యాణ్‌

‘‘సాయితేజ్‌ తొలి సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లా. ఆ తర్వాత ఎప్పుడూ తేజ్‌ సినీ వేడుకలకు రాలేదు. ‘గోకులంలో సీత’ వరకూ అన్నయ్యగారి మద్దతు తీసుకోలేదు. నాకు ఏ చిత్రాలు వచ్చాయో అవే చేశా. అలాగే తేజ్‌, వైష్ణవ్‌! వాళ్లు కుటుంబం మీద ఆధారపడకూడదు. సొంతకాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో ఎప్పుడూ రాలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సాయితేజ్‌ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో జె. భగవాన్‌, జె. పుల్లారావు నిర్మించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. అక్టోబర్‌ 1న థియేటర్లలో విడుదల కానుంది. శనివారం రాత్రి ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పవన్‌ మాట్లాడుతూ ‘‘సినిమా విడుదల టైమ్‌లో తేజ్‌కు యాక్సిడెంట్‌ అయ్యింది. చాలా బాధాకరమైన విషయమిది. ఎంతో ఖర్చుపెట్టి నిర్మాతలు సినిమా తీశారు. ఇప్పుడు హీరో లేని లోటు ఉంది. ఏదో విధంగా మనవంతు కృషి చేయాలని నేనొచ్చా. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకొనే వ్యక్తి తేజ్‌. అందరి ఆశీస్సులతో సినిమా బాగా ఆడాలి’’ అన్నారు.


‘‘కరోనా సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు జీ స్టూడియోస్‌ మాకు అండగా నిలబడింది’’ అని పుల్లారావు చెప్పారు. ‘‘థియేటర్లలో వదిలిపోయే సినిమాలా కాకుండా... గుండెల్లో ఇంటికి మోసుకువెళ్లే సినిమా ‘రిపబ్లిక్‌’ అవుతుందని నమ్ముతున్నా. తేజ్‌ త్వరగా కోలుకుంటున్నాడు. సైన్యాధ్యక్షుడిలా తిరిగొస్తాడు. కథలో ఆత్మ దెబ్బ తినకూడదని సైనికుడిలా తేజ్‌ పోరాడాడు’’ అని దేవ కట్టా చెప్పారు. బైక్‌ మీద వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ తప్పకుండా ధరించాలని వైష్ణవ్‌తేజ్‌ కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, ‘దిల్‌’ రాజు, దర్శకులు హరీశ్‌ శంకర్‌, క్రిష్‌, కిశోర్‌ తిరుమల, మారుతి తదితరులు పాల్గొన్నారు.