రిపబ్లిక్‌ టీవీపై బార్క్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-10-20T06:45:56+05:30 IST

రిపబ్లిక్‌ టీవీ చానల్‌పై టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్‌(టీఆర్పీ) సంస్థ బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్‌) ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము పంపిన ఓ ప్రైవేటు/గోప్య ఈ-మెయిల్‌ను బహిరంగపర్చడం.. అందులోని సారాంశాన్ని తప్పుగా చూపించడంపై మండిపడింది...

రిపబ్లిక్‌ టీవీపై బార్క్‌ ఆగ్రహం

ఈ-మెయిల్‌ బయట పెట్టడంపై గరం


ముంబై, అక్టోబరు 19: రిపబ్లిక్‌ టీవీ చానల్‌పై టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్‌(టీఆర్పీ) సంస్థ బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్‌) ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము పంపిన ఓ ప్రైవేటు/గోప్య ఈ-మెయిల్‌ను బహిరంగపర్చడం.. అందులోని సారాంశాన్ని తప్పుగా చూపించడంపై మండిపడింది. ఈ నెల 16, 17 తేదీల్లో రిపబ్లిక్‌ మీడియా నెట్‌వర్క్‌ సీఈవో వికాస్‌ ఖంచన్దానీ, బార్క్‌ సీఈవో సునీల్‌ లూలా మధ్య ఈ-మెయిల్‌ ద్వారా సంభాషణ జరిగింది. ‘‘రిపబ్లిక్‌ గ్రూప్‌ ద్వారా ఏదైనా ఉల్లంఘన జరిగి ఉంటే.. వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టగలరు’’ అని వికాస్‌ కోరగా.. దానికి సునీల్‌ లూలా బదులిచ్చారు.


‘‘మీకు బార్క్‌పై విశ్వాసం ఉన్నందుకు ధన్యవాదాలు. మీ(రిపబ్లిక్‌ టీవీ)పై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసి ఉంటే బార్క్‌ మీకు ముందుగానే సమాచారం అందిం చి ఉండేది. అందుకు సంబంధించిన ఆధారాలు పంపి మీ వివరణ కోరి ఉండేది’’ అని సునీల్‌ లూలా పేర్కొన్నారు. ఈ సంభాషణ ఆధారంగా రిపబ్లిక్‌ తప్పు చేయలేదంటూ ఆ చానల్‌ కథనాలను ప్రసారం చేసిం ది. తన వెబ్‌సైట్‌లో కథనాన్ని ప్రచురించింది. దీన్ని బార్క్‌ ఖండించింది. రిపబ్లిక్‌ టీవీ కథనంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనపై రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామి స్పందించారు. ‘‘బార్క్‌ ఈ-మెయిల్‌ని బట్టి ముంబై పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ అబద్దాలు చెబుతున్నారనేది తేలింది. ఆయన వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలి. ఈ-మెయిల్‌ను తప్పుగా వాడుతున్నామని బార్క్‌ చెబుతోంది. ఈ-మెయిల్‌లోని ఏ భాగాన్ని తప్పుగా వాడామో చెప్పలేదు’’ అని ఆయన ఓ వార్తాసంస్థతో అన్నారు. 


ముందు అర్ణబ్‌కు సమన్లివ్వండి: హైకోర్టు

టీఆర్పీ కుంభకోణానికి సంబంధించి రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామిపై అభియోగాలు మోపేట్లయితే.. ముందుగా ఆయనకు సమన్లు ఇవ్వాలని ముంబై పోలీసులకు బాంబే హైకోర్టు సూచించిం ది. తమపై కేసులను రద్దు చేయాలని, లేదంటే దర్యా ప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ రిపబ్లిక్‌ టీవీ, అర్ణబ్‌ గోస్వామి వేసిన వ్యాజ్యాన్ని కోర్టు సోమవారం విచారించింది. సమన్లు జారీ అయితే అర్ణబ్‌ పోలీసుల ఎదుట హాజరు కావాలని, విచారణకు సహకరించాలని ఆదేశించింది. కాగా.. ముంబై పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌పై రూ.200 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్లు రిపబ్లిక్‌ చానల్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామి వెల్లడించారు. 

Updated Date - 2020-10-20T06:45:56+05:30 IST