Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిక్కుబిక్కు మంటూ... బాధితులు

జోరందుకుంటున్న సహాయ చర్యలు 

యుద్ధప్రాతిపదికన తాత్కాలిక షెడ్లు నిర్మించాలని వేడుకోలు 

రాజంపేట, నవంబరు 29 : వరద విపత్తు జరిగి నేటికి 12రోజులు అవుతున్నా బాధితులు మాత్రం బిక్కుబిక్కుమంటూ తాత్కాలిక షెడ్లలో కాలం గడుపుతున్నారు. అధికార పునరావాస చర్యలు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల కొంత మేరకు పునరావాస చర్యలకు బ్రేకులు పడ్డా తిరిగి పుంజుకున్నాయి. ఆయా గ్రామాల్లో ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాలకు జర్మనీ షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి ఇళ్లు లేని బాధితులందరూ ఉండటానికి అనువుగా ఉన్నాయి. ఈ షెడ్లల్లోనే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వరదలో 90శాతం మరణించిన మూగ జీవాలు పోగా మిగిలిన 10 శాతం తమ యజమానులతో పాటు కుదుటపడుతున్నాయి. మనుషులను చూసినా, వాహనాల శబ్దం విన్నా వరద బీభత్సంలో తల్లడిల్లిన మూగజీవాలు ఒక్క సారిగా భయపడి పరిగెడుతున్నాయి.


- ప్రస్తుతం వర్షం వల్ల ఈ ప్రాంతాలకు ఇచ్చిన కరెంటు సౌకర్యానికి సాంకేతిక సమస్యలు ఏర్పడటంతో కరెంటుకు అంతరాయం ఏర్పడుతోంది. ఆయా గ్రామాల్లో కరెంటు సింగిల్‌ఫేస్‌ ఇవ్వడం వల్ల పూర్తిస్థాయిగా కరెంటు అందడం లేదు. పులపత్తూరు హరిజనవాడ, తొగూరుపేట ప్రాంతాలకు పూర్తిస్థాయిలో కరెంటు రావడం లేదు. పడిపోని ఇళ్లకు లైట్లు, ఫ్యాన్లు వెలగడానికి విద్యుతసరఫరా జరుగుతోంది. ఇళ్లు పడిపోయిన బాధితులు ఉంటున్న తాత్కాలిక గుడిసెలకు కరెంటు అందడం లేదు. దీని వల్ల వారు కొవ్వొత్తుల కింద కారు చీకట్లో కాలం గడపాల్సి వస్తోంది. 

- తొగూరుపేట, పులపత్తూరు, మందపల్లె, హరిజనవాడ, రామచంద్రాపురం, పాటూరు, సాలిపేట తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్న రక్షిత మంచినీటి పథకాలను ఇంకా పునరుద్ధరించలేకపోతున్నారు. ఈ నీటి పథకాలు కొట్టుకుపోవడం వల్ల వాటిని పునరుద్ధరించడానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నీటి పంపుసెట్లు ఆడటానికి మూడు ఫేసుల్లో కరెంటు అవసరం. ఆ మూడు ఫేసుల కరెంటు ఇవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. అయితే రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విద్యుతశాఖ ఓఎ్‌సడీ శ్రీనివాసులు, రాజంపేట ఈఈ చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో పది మంది ఈఈలు, సుమారు 500మంది సిబ్బంది ఈ పనిలో నిమగ్నమైయున్నారు. 

- ఇక పంచాయతీ రాజ్‌శాఖ ద్వారా దెబ్బతిన్న రోడ్లను పూర్తి చేయకపోయినా మట్టితో పూడ్చి తాత్కాలికంగా రవాణా వ్యవస్థను సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వరద ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా రూ.6.4కోట్ల నిధులను మంజూరు చేసి బాధితులకు వివిధ నష్టపరిహారాల కింద అందజేశారు. ఎక్కడ చూసినా ఇళ్లు కోల్పోయిన బాధితులు తమకు తక్షణం ఇళ్లు మంజూరు చేసి కట్టించాలని వేడుకుంటున్నారు. తాత్కాలిక ఇంటి షెడ్లను ప్రతి బాధితుడికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి టాయిలెట్ల గదులను అందరికీ అందజేస్తే ప్రధాన సమస్య తీరుతుందని అంటున్నారు. అయితే ఇంకా అక్కడక్కడ తమకు సాయం అందడం లేదంటూ కొందరు వేడుకుంటున్నారు. 


అన్నం పొట్లం తప్ప ఏ సహాయం అందలేదు

- షేక్‌ ఫైరోజ్‌, గుండ్లూరు గ్రామం 

మాది చెయ్యేరు ఏటిపక్కన ఇల్లు. మా ఇంటిపైనే వరదంతా వెళ్లి పాడైంది. శవాలన్నీ మా ఇంటి పైభాగాన పడిపోయాయి. ఆ భయానికి ఊరు వదిలి పారిపోయాం. ఈ రోజు వచ్చి ఇంటిలోవున్న బురదనంతా తీసేసి ఇంటిలో కాలుపెట్టాం. మాకు ఎవరో దాతలు ఇచ్చిన అన్నం పొట్లం తప్ప ఇంతవరకు ఏ సాయం అందలేదు. నాకు ఐదేళ్లలోపు వయసున్న నలుగురు బిడ్డలున్నారు. నా భర్త కూలీపనిచేసుకుంటున్నాడు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. 


గాంధీని కలిసినోడిని..

- పేరేచర్ల జగన్నాదమయ్య, తొగూరుపేట గ్రామం 

నా వయస్సు 89 ఏళ్లు. 1933లో నేను ఈ చెయ్యేటి గడ్డన తొగూరుపేటలో పుట్టినాను. ఆ రోజుల్లో గాంధీని కలిసినోడిని. 1946, 1956, 2002 చెయ్యేటికి ఇలాంటి వరదొచ్చి అంతా దెబ్బతిన్నది నా కళ్లారా చూశా. అయితే ఇంత పెద్ద యెల్లవ జీవితంలో చూడలేదు. దీనికి కారణం ఎవరిది తప్పో అని నిందించుకోవడం కంటే... సహాయపడటం మంచిది. నేను నందలూరుకు నా భార్య సీతమ్మతో కలిసి కూతురు వద్దకు వెళ్లినాం. ఆ రాత్రి నా ఇల్లంతా ఏట్లో కొట్టుకుపోయింది. నా మాదిర ఊర్లో ఇళ్లన్నీ కూలిపోయినాయి. ఇక మేము ఊర్లో ఉండి ఏం ఉపయోగం. మాలా ఏ ఊర్లో అయినా ఇళ్లు లేనోళ్లకు రాత్రింబవళ్లు కష్టపడి ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తే అదే నిజమైన సాయం చేసినట్లు.


పొంగి ప్రవహిస్తున్న చెయ్యేరు

చెయ్యేరు నది పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల మట్టికట్టలు లేకపోవడంతో వరద నీరంతా కిందకి చేరుతోంది. దీని వల్ల రాజంపేట మండలంలోని గుండ్లూరు వద్ద చెయ్యేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న జనానికి తిరిగి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. అయితే సోమవారంవర్షం తగ్గుముఖం పట్టింది. ఒక వైపు ఎండ, మరో వైపు అప్పుడప్పుడు కురిసే వానతో ప్రజలు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు.


శభాష్‌.. పద్మజ 

వరద ప్రభావిత ప్రాంతాలలో కొందరు అధికారుల సేవలు ప్రశంసలు చూరగొంటున్నాయి. అందులో జిల్లా ఐసీడీఎస్‌ అధికారిణి పద్మజ ఒకరు. ఈమెను తొగూరుపేట, రామచంద్రాపురం ప్రాంతాలలో సహాయ పునరావాస కార్యక్రమాల అధికారిగా నియమించారు. వరద వచ్చిన మరుసటి రోజు నుండి నేటి వరకు ఆమె నిర్విరామంగా రాత్రింబవళ్లు సేవలు అందిస్తున్నారు. గ్రామానికి రోడ్డు, కరెంటు సౌకర్యం, ఆయా గ్రామ ప్రజలు పడుకోవడానికి జర్మన షెడ్లు, తాగునీటి వసతి, వైద్య ఆరోగ్య సేవలు కల్పించడంలో ఆమె ఎంతో శ్రమించారు. వరద వచ్చిన తరువాత నాలుగు రోజులు కరెంటు లేకపోయినా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బాధితులతో కలసి తాత్కాలిక షెడ్లలో ఉంటూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా మహిళలకు పెద్ద ఓదార్పుగా ఉంటున్నారు. తొగూరుపేట, రామచంద్రాపురం చుట్టుపక్కల గ్రామాల్లో ఆమె అందరితో కలియదిరుగుతూ ప్రభుత్వపరంగా అందాల్సిన పరిహారాలను ఇప్పిస్తున్నారు. ప్రతి ఇంటికి గ్యాస్‌ కనెక్షన ఇప్పించడంలో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. జేసీబీలను ఏర్పాటు చేయించి ఆ ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సోమవారం పద్మజ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తాను ఇక్కడ ఆర్డీవోగా, తహసీల్దారుగా పనిచేశానన్నారు. ఒక ఆడబిడ్డగా అందరితో కలిసిపోయి ఆపత్సమయంలో వీరికి సేవ చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు.


స్తంభించిన జనజీవనం

కాశినాయన నవంబరు 29: కాశినాయన మండలంలో సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 76 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఏఎ్‌సవో అశోక్‌ తెలిపారు. కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. వరి, ఉల్లి, పత్తి, మిరప, సెనగ, మినుము లాంటి పంటలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఉప్పలూరు గ్రామ సమీపంలోని ఉప్పాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ గ్రామానికి బయటి ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నవరం గ్రామ సమీపంలో సగిలేరు నది బ్రిడ్జిపై ప్రవహిస్తుండటంతో దాదాపు 8 గ్రామాల ప్రజలకు పోరుమామిళ్ల పట్టణంతో సంబంధాలు నిలిచిపోయాయి. నర్సాపురంలోని తహసీల్దారు కార్యాలయంలో ఉంటూ ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు సిబ్బందిని కాపలా పెట్టి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తహసీల్దారు రవిశంకర్‌, ఆర్‌ఐ మోహనరాజు తెలిపారు.

పులపత్తూరులో ఏర్పాటు చేస్తున్న జర్మన షెడ్డు


Advertisement
Advertisement