తిరుమలలో నిండుకుండల్లా జలాశయాలు

ABN , First Publish Date - 2020-08-04T17:46:37+05:30 IST

టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆఫ్ సీజన్‌లో డ్యామ్‌లు నిండుతున్నాయి.

తిరుమలలో నిండుకుండల్లా జలాశయాలు

తిరుపతి: టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆఫ్ సీజన్‌లో డ్యామ్‌లు నిండుతున్నాయి. జులై మాసంలోనే 90 శాతం మేరకు జలాశయాలు నిండగా మరోదఫా వర్షం కురిస్తే ఈనెలలో పూర్తి స్థాయిలో నీటి నిల్వలతో డ్యామ్‌లు కళకళలాడనున్నాయి. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ తిరుమలలో ఐదు జలాశయాలు నిర్మించింది. భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో అందుకనుగుణంగా నీటి వాడకం పెరుగుతూ రావడంతో నిల్వలకోసం టీటీడీ డ్యామ్‌లను నిర్మిస్తూ వచ్చింది. మొదటి డ్యామ్ గోగర్భం డ్యాంను 1963లో నిర్మిస్తే.. పెద్దదైన పాపవినాశనం డ్యామ్‌ను 1983 నుంచి వాడకంలోకి తీసుకువచ్చింది. 


తర్వాత చిన్నదైన ఆకాశగంగ జలాశయాన్ని 2002లో నిర్మించగా 2012లో జంట ప్రాజెక్టులైన కుమారధార, పసుపుధార డ్యామ్‌లను టీటీడీ నిర్మించింది. గోగర్భం జలాశయంలో 2833 లక్షల గ్యాలన్ల నీటి నిల్వలు చేసుకునే సామర్థ్యం ఉండగా.. పాపవినాశనంలో 5240 లక్షల గ్యాలన్లు, ఆకాశగంగలో 685 లక్షల గ్యాలన్లు, జంట డ్యామ్‌లైన కుమారధార, పసుపుధారలలో 5540 లక్షల గ్యాలన్లు నీటి నిలువ చేసుకునే అవకాశం ఉంది. శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య దృష్ట్యా ప్రతి నిత్యం 34 లక్షల గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. వేసవి కాలంలో అయితే 40 లక్షల గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. దీంతో టీటీడీ తిరుమలలో ఉన్న జలాశయాలతోపాటు తిరుపతిలోని కల్యాణీ డ్యామ్ నీటిని వినియోగిస్తోంది. ప్రతినిత్యం 14 లక్షల గ్యాలన్ల నీరు తిరుపతి నుంచి తిరుమలకు తరలించి వినియోగిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ నీటిని సరఫరా చేస్తోంది.

Updated Date - 2020-08-04T17:46:37+05:30 IST