Jagan Sarkar మరో యూటర్న్.. ఈసారి ఏకంగా...!

ABN , First Publish Date - 2021-11-23T08:44:20+05:30 IST

జగన్‌ సర్కారు మరో విషయంలో మడమ తిప్పేయబోతోందని...

Jagan Sarkar మరో యూటర్న్.. ఈసారి ఏకంగా...!

  • మండలిపైనా మడమ తిప్పేస్తున్నారు!
  • రద్దు వద్దంటూ నేడు అసెంబ్లీలో తీర్మానం
  • గతంలో చేసిన ‘రద్దు’ తీర్మానం తూచ్‌
  • అది పార్లమెంటులో ప్రస్తావనకు
  • రానున్నదనే ఈ ఆకస్మిక నిర్ణయం?


అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు మరో విషయంలో మడమ తిప్పేయబోతోందని తెలిసింది. శాసనమండలిని రద్దుచేయాలని చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం ఈ మేరకు శాసనసభలో కొత్త తీర్మానం చేయనుంది. శాసనమండలిని యథాతథంగా కొనసాగించాలని అందులో కేంద్రాన్ని కోరుతుందని వైసీపీ వర్గాల సమాచారం. నిరుడు జనవరిలో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, మూడు రాజధానుల బిల్లులను మండలి వ్యతిరేకించింది. అయితే 151 స్థానాలున్న అసెంబ్లీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని, ప్రజాబలంతో గెలిచిన శాసనసభ నిర్ణయాన్ని టీడీపీ బలం ఎక్కువగా ఉన్న మండలి వ్యతిరేకించిందని సీఎం జగన్‌ ఆగ్రహించారు. మండలి నిర్వహణకు రోజూ రూ.లక్షల్లో భారం మోయాల్సి వస్తోందని.. అసలీ వ్యవస్థే వద్దని.. రద్దుచేయాలని కేంద్రాన్ని కోరుతూ గత ఏడాది జనవరి 27వ తేదీన శాసనసభలో తీర్మానం పెట్టారు. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడే కొంద రు మంత్రులు జగన్‌ను సముదాయించే ప్రయత్నం చేశారు. ఏడాది వేచి చూస్తే.. మండలిలోనూ వైసీపీకి ఆధిక్యం వస్తుందని సర్దిచెప్పాలని చూశారు.


అయితే.. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని జగన్‌ స్పష్టం చేశారు. ఇప్పుడు వైసీపీకి మండలిలో ఆధిక్యం లభించింది. ఇదే సమయంలో ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మం డలి రద్దు తీర్మానం ప్రస్తావనకు రానున్నట్లు ఉప్పందింది. ఇది వైసీపీ నేతలకు కలవరం కలిగించింది. అంతే.. శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరించుకుంటూ.. మంగళవారం మరో తీర్మానాన్ని చేసి తక్షణమే కేంద్రానికి పంపాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది. జగన్‌ చెప్పాడంటే చేస్తాడంతేనని వైసీపీ నేతలు ఇన్నాళ్లు ఇస్తున్న నినాదం క్రమంగా మసకబారుతోందని, నిన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనం, ఇప్పుడు మూడు రాజధానులపై ఆయన వెనక్కి తగ్గారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-11-23T08:44:20+05:30 IST