Abn logo
Dec 1 2020 @ 03:51AM

రుషికొండ కాటేజీలపై కన్ను!

హరిత రిసార్ట్స్‌లో క్యాంపు ఆఫీసులు? 

రాజధానిని తరలించే యత్నాలు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాట్లు చాపకింద నీరులా సాగిపోతున్నాయి. హైకోర్టులో కేసులు నడుస్తున్నా, ఇక్కడ కొత్త నిర్మాణాలపై స్టే ఉత్తర్వులు ఉన్నా ఏ పనీ ఆగడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా అన్ని శాఖలు తమకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. సీఎం క్యాంప్‌ ఆఫీసుగా రుషికొండలో ఏపీఐఐసీ నిర్మించిన మిలీనియం టవర్‌ లేదా స్టార్టప్‌ విలేజ్‌ను ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. డీజీపీ కార్యాలయం కోసం రుషికొండ ఐటీ పార్కులోని బీజేపీ నాయకుడికి చెందిన ఐటీ భవనాన్ని ఇప్పటికే ఎంపిక చేసుకున్నారు. అవసరమైన మార్పులను కూడా సూచించారు. పోలీస్‌ శాఖలో ఇతర  విభాగాల కోసం ఆ పక్కనే ఖాళీ భవనాలు తీసుకోవడానికి యత్నిస్తున్నారు. రుషికొండలో ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థకు ‘హరిత’ పేరుతో రిసార్ట్స్‌ ఉన్నాయి.


ఎదురుగా సముద్రం, ప్రశాంత వాతావరణంతో ఆకట్టుకునేలా ఉన్న వీటిని రాజధాని కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని చాలాకాలంగా పరిశీలిస్తున్నారు. అమరావతి నుంచి విశాఖ వస్తున్న ఉన్నతాధికారుల్లో చాలామంది హరితలో కాటేజీ కావాలని ప్రత్యేకంగా కోరుతున్నారు. వీలైతే అందులో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిల్లా అధికారులకు సూచిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కొన్ని ముఖ్యమైన శాఖలను విశాఖకు తరలించాలని అధికార పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా హరిత రిసార్ట్స్‌కు అవసరమైతే అదనపు వసతులు సమకూర్చే ప్రయత్నాల్లో జిల్లా అధికారులు ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement