మోదీ పాలనలోనే అంబేడ్కర్‌కు గౌరవం

ABN , First Publish Date - 2021-01-26T06:57:31+05:30 IST

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 71 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఆ రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందాయా, రాజ్యాంగ నిర్మాత...

మోదీ పాలనలోనే అంబేడ్కర్‌కు గౌరవం

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటితో 71 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఆ రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందాయా, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ కన్న కలలు నెరవేరాయా అన్న అనుమానాలు అనేకమంది వ్యక్తం చేస్తుండడం కద్దు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏడు దశాబ్దాల్లో దాదాపు అయిదున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని పాలించింది. కాంగ్రెస్ పాలకులు రాజ్యాంగద్రోహానికి పాల్పడ్డారు. అంబేడ్కర్ స్మృతిని గౌరవించడంలో ఉపేక్ష చూపారు. ఈ శోచనీయ, గర్హనీయ వాస్తవాల నేపథ్యంలో దేశ ప్రస్తుత రాజకీయ తీరుతెన్నుల్ని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం.


భారత రాజ్యాంగాన్ని ఒక పవిత్రగ్రంథంగా భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ఔదలదాల్చింది. మన రాజ్యాంగ ప్రాధాన్యం గురించి, అంబేడ్కర్ ఆశయాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఏటా నవంబర్ 26ను ‘రాజ్యాంగదినం’ (కానిస్టిట్యూషన్ డే)గా పాటించాలని 2015లో మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. 2015 అక్టోబర్ 11న ముంబైలో అంబేడ్కర్ సమానత్వ విగ్రహానికి శంకు స్థాపన చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మన దేశం పరాయిపాలన నుంచి విముక్తమై ఒక సర్వసత్తాక, సార్వభౌమిక దేశంగా ఏర్పడిందని చెప్పే ఒక కీలక తార్కాణం ‘భారత రాజ్యాంగం’.


భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ప్రధాని మోదీ ఆ అత్యున్నత పదవి చేపట్టారు. ఆయన సారథ్యం వహించిన భారతీయ జనతా పార్టీని ఈ దేశప్రజలు రెండుసార్లు అత్యధిక మెజారిటీతో ఎన్నుకున్నారు. అనేక రాష్ట్రాల్లో బిజెపికి పట్టం కట్టారు. పార్లమెంట్‌లో మెజారిటీ పార్టీ నాయకుడైన ఒక ప్రధానమంత్రి, ఆయన మంత్రిమండలి తమ శ్రేయస్సు కోసం తగిన నిర్ణయాలు తీసుకోవడానికిగాను ఈ దేశప్రజలు వారికి అధికారాన్ని కల్పించారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రాజ్యాంగవిహితం కాకుండా ఎలా ఉంటాయి? గతంలో వలే రాజ్యాంగాన్ని కాలరాచి, ప్రాథమిక హక్కులను బుట్టదాఖలుచేసి, ప్రతిపక్షాలను జైళ్ల పాలు చేసి, సామాన్యప్రజల గొంతు నొక్కి, ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్రప్రభుత్వాలను కూలదోసి, ఒకే కుటుంబపాలనను దశాబ్దాలుగా అమలు చేసి, ప్రధానమంత్రిని కీలుబొమ్మగా మార్చిన చీకటిరోజులు ఇప్పుడు మచ్చుకైనా కనపడవు. ఆ చీకటి రోజులకు సారథ్యం వహించిన శక్తులు ఇవాళ తుడిచిపెట్టుకుపోయే దశలో ఉన్నా మోదీ రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుష్ప్రచారానికి లంకించుకోవడంలో ఆశ్చర్యం లేదు.


పౌరులకు ప్రాథమిక హక్కులను ఇవ్వడం మాత్రమే కాదు, బాధ్యతలు, ప్రాథమిక విధులనూ రాజ్యాంగం నిర్దేశించిందని మోదీ పదే పదే గుర్తుచేశారు. ప్రతి పాఠశాల, కళాశాలలో రాజ్యాంగం గురించి నవతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టీకరించారు. హక్కులకూ విధులకూ మధ్య సమతుల్యతను చక్కగా పాటించినప్పుడే మనదేశం బలోపేతమవుతుందని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని ఆయన ఉటంకించారు. రాజ్యాంగంలోని నాలుగో విభాగంలో దేశ పౌరుల విధులను స్పష్టంగా నిర్దేశించారు. రాజ్యాంగంతో పాటు మన జాతీయ పతాకానికి, జాతీయగీతానికి, వ్యవస్థలకు, ఆదర్శాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యవస్థల్ని ప్రక్షాళన చేయడం, భారతీయ సంస్కృతి, సామాజిక విలువలను గౌరవించడం, మనదేశ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయడం, విచ్ఛిన్నకర శక్తులకు ప్రోత్సాహం అందించకపోవడం, దేశభద్రత, సమగ్రత విషయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయడం అనేవి మన ప్రధాన విధులు. భారతీయ జనతాపార్టీ ఇందుకు భిన్నంగా ఏమీ ఎక్కడా పేర్కొనలేదు. అయితే మన జాతి విలువలకు, సమగ్రతకు ప్రాధాన్యమీయని వారు, సంఘవ్యతిరేక విచ్ఛిన్నకర శక్తులకు, ఉగ్రవాదులకు ఊతం ఇచ్చేవారు, కులతత్వాన్ని ప్రోత్సహించేవారు తమ హక్కులను కాలరాస్తున్నారంటూ మాట్లాడడం ఏ విధంగా సమర్థనీయం అవుతుంది? దేశం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి వెనుకాడేవారు, దేశభక్తికి విలువనీయని వారు రాజ్యాంగానికి ఏ విధంగా విలువ ఇవ్వగలరు? ఈ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రశ్నలు చర్చనీయాంశాలు కావాలి.


కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగానికి ఏ మాత్రం విలువ ఇవ్వ లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు సముచిత గౌరవం ఇవ్వలేదు. ఒక విధంగా అవమానించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆ మహానుభావుడు రచించిన ఏ పుస్తకాన్నీ తిరిగి ప్రచురించలేదు. ఏ సంస్థనూ ఆయన పేరుతో నెలకొల్పలేదు. వీపీ సింగ్ హయాంలోనే పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఆయన చిత్రాన్ని ఆవిష్కరించారు. నేషనల్ ఫ్రంట్ హయాంలోనే ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. అంబేడ్కర్ రాజ్యాంగ అసెంబ్లీలోకి ప్రవేశించడం కూడా కాంగ్రెస్‌కు అసలు ఇష్టం లేదు. మహాత్మాగాంధీ, డాక్టర్ రాజేంద్రప్రసాద్, సర్దార్ పటేల్ మూలంగానే అంబేడ్కర్ రాజ్యాంగ అసెంబ్లీలో ప్రవేశించి ముసాయిదా కమిటీకి చైర్మన్ కాగలిగారు. గాంధీజీ మూలంగానే దేశ న్యాయశాఖ మంత్రి అయ్యారు. అయినా అంబేడ్కర్‌కు సరైన గౌరవం ఇవ్వనందువల్లే ఆయన తన పదవి నుంచి వైదొలిగారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనపై పోటీ చేసి ఓడించింది. కశ్మీర్‌లో 370 అధికరణను తీవ్రంగా వ్యతిరేకించిన అంబేడ్కర్, కశ్మీర్‌ను అన్ని రాష్ట్రాలతో సమానంగా చూసేందుకు 365- ఏ అధికరణను రూపొందించిన విషయం మరిచిపోరాదు. ఈ నేపథ్యంలో ఏడు దశాబ్దాలకు పైగా అల్లకల్లోలంగా ఉన్న కశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగం చేయాలని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం నిర్ణయించడంతో రాజ్యాంగానికి పూర్తి న్యాయం చేసినట్లయింది. జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ విభజన, 370 అధికరణ కింద ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో ఒకే దేశం- ఒకే రాజ్యాంగం అమలులోకి వచ్చినట్లయిందని 2020 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటించారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడం, భారతదేశంలో మహిళలు, దళితులు, గిరిజనుల కోసం ప్రకటించిన పథకాలు కశ్మీర్‌లోనూ అమలు చేయడం తమ ప్రభుత్వ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మాత్రమే అంబేడ్కర్ స్మృతి చిరస్మరణీయంగా నిలిచిపోయే అనేక నిర్ణయాలను తీసుకున్నారు. ఆయన జీవనయానంలో మైలు రాళ్లుగా నిలిచిన పలు ప్రదేశాలను అభివృద్ధిపరచి ఆయన పేరుతో వివిధ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. ఇవాళ రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న నిజమైన దేశ భక్తులకూ, దేశాన్ని దశాబ్దాలుగా దోచుకుని కూడా ఇంకా అధికారం కోసం వెంపర్లాడుతూ కుట్రలు చేస్తున్న శక్తులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఎవరు నిజాయితీగా దేశం కోసం తపిస్తున్నారో ప్రజలకు తెలుసు.



వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

(నేడు గణతంత్ర దినోత్సవం)

Updated Date - 2021-01-26T06:57:31+05:30 IST