గుస్సాడీ నృత్యానికి గౌరవం

ABN , First Publish Date - 2021-01-27T06:55:52+05:30 IST

గుస్సాడీ నృత్య గురువు, కళాకారుడు కనకరాజుకి కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఈయన కొమురం భీం జిల్లా, జైనూరు మండలం...

గుస్సాడీ నృత్యానికి గౌరవం

గుస్సాడీ నృత్య గురువు, కళాకారుడు కనకరాజుకి కేంద్రప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఈయన కొమురం భీం జిల్లా, జైనూరు మండలం, మార్లవాయి గ్రామ నివాసి. అక్కడే ప్రభుత్వ హాస్టల్‌లో వంటవాడుగా, దినసరి జీతగానిగా (టెంపరరీ) పనిచేస్తున్నారు. ఈ హాస్టల్‌ ఐటిడిఎ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆయన తండ్రి పేరు కనక రాము. తల్లి రాజుబాయి. కనకరాజు వయసు సుమారు డెబ్బై ఏళ్ళు. ఈయన ఒక పేద గోండు, ఆదివాసీ కుటుంబంలో పుట్టారు. ఆయనకి పదిమంది సంతానం. గుస్సాడీ నృత్యం గోండుల పారంపరిక సామూహిక నృత్యం. గోండు గిరిజనుల సాంప్రదాయిక నృత్యంపై పట్టు సాధించారు. వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతోమందికి గుస్సాడీ నృత్యం నేర్పించిన గురువు. తలమీద వందలాది నెమలి ఈకలతో తయారుచేసిన టోపీ ధరించి, చేతిలో రోకల్‌ అనే కర్రను పట్టుకుని, బండారు సంచి నడుముకి చుట్టి, నడుముకి పులిచర్మం ధరించి ప్రత్యేక ఆహార్యంతో నృత్యం చేస్తారు. అయితే ఈ నృత్యం ఎవరికి తోచినట్లు వారు చేస్తారు. అది గమనించి కొందరు గోండు పెద్దలు తెలంగాణ గోండి ఆదివాసీలలో మొదటి ఐఎఎస్‌ సాధించిన మడావి తుకారాం వంటి వారు గుస్సాడీ నృత్యశైలికి ఒక రూపాన్ని తీసుకురావడానికి 1980లో ప్రయత్నం చేశారు. అప్పుడు కనకరాజు కూడా తనవంతు సహకారం అందించారు.


ఆ తరువాత ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఈ గుస్సాడీ నృత్యం ట్రూపు పాల్గొన్నది. దానికి రాజు లీడర్‌. అలా ‘గుస్సాడీ రాజు’గా అతను ఆ ప్రాంతంలో పేరు పొందారు. ఇందిరాగాంధి, జైల్‌సింగ్‌, అబ్దుల్‌ కలాం వంటి సుప్రసిద్ధుల ముందు తన కళను ప్రదర్శించి మెప్పు పొందారు. వేల నెమలీకల టోపీని, గుస్సాడీ ఆహార్యం పెద్దలకు బహూకరించాడీయన. ఆ తరువాత గుస్సాడీ నృత్యానికి ఒక శైలిని ఏర్పరచడంలో రాజు కృషి చేశారు. గోండీ సంస్కృతిపై సినిమా సంస్కృతి, ఇతర నృత్యశైలులు దాడి చేస్తున్న సమయంలో రాజు గుస్సాడీ లేదా ధింసా నృత్యానికి గౌరవం తీసుకువచ్చారు. గుస్సాడీ నృత్యం చాలా ప్రాచీన నృత్యరూపకం. దానిని పరిరక్షించి, ఆ నృత్యానికి ప్రజాదరణ కల్పించినవాడు రాజు. 


మాస్టర్‌ కనకరాజు సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఆర్ట్స్‌ విభాగంలో పురస్కారం అందించింది. ఒక ఇంటర్వ్యూలో తనకు లభించిన ఈ గుర్తింపు వల్ల తన కష్టాలు గట్టెక్కుతాయని, ఆర్థికంగా నిలదొక్కుకోగలనని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు కనకరాజు. కళను బతికించాలంటే కళాకారుడు బతకాలి. ఆదివాసీ కళలకు, నృత్యాలకు, సంగీత వాద్యాలకు, వాగ్గేయకారులకు మరిన్ని పురస్కారాలు లభించాలి. తద్వారా వారి సంస్కృతి కాపాడబడుతుంది అని చాలామంది కళాభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


55 ఏళ్ళుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, నేర్పుతూ వస్తున్న ‘రాజు’, ఈ నృత్యానికి దేశవ్యాప్తంగా ‘గుర్తింపు’ని కూడా తెచ్చారు. కనకరాజుకు పద్మ పురస్కారంతో ఎనిమిది రాష్ట్రాలలో ఉన్న గోండి ఆదివాసీ నృత్యానికి గౌరవం లభించినట్లుగా భావిస్తున్నారు. గుస్సాడీ నృత్యంలో వాయించే సంగీత వాద్యాలను గోండులే వాయిస్తారు. ఆ సంగీత లయకు అనుగుణంగా లయబద్ధంగా కదులుతూ చేసే నృత్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆడియెన్స్‌కి ఆనందం కలిగిస్తుంది. వారు చేసే కదలికలు ఎంతో హుందాగా ఉంటాయి. గుస్సాడీ నృత్యానికి ‘వన్నె’ తెచ్చిన కనకరాజు ఆర్థిక స్థాయిలో మార్పు వస్తే బాగుంటుందని మార్లవాయి గ్రామ గోండు ప్రజలు భావిస్తున్నారు. స్థానికంగా ఐటిడిఎ అధికారులు ఆయనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆదివాసీ కళలు, సంస్కృతులను కాపాడాలని ప్రజలు ఆశిస్తున్నారు. వారి సంగీతం, సంగీతవాద్యాలపై శ్రద్ధ చూపాలని, వాటిని భవిష్యత్‌ తరాలకు అందించే దిశగా ఆలోచనలు చేయవలసిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా నొక్కి చెబుతున్నారు. ఒక వంటవానిగా పనిచేసేవాడు పద్మశ్రీ గౌరవం పొందడం కళారంగంలో సాధ్యం అని నిరూపించిన కనకరాజుకి అభినందనలు!


ఇప్పటికీ ఆరోగ్యం సహకరించినప్పుడల్లా పోయి పిల్లలకి ఆహారం వండిపెడుతూ ఆ నాలుగు డబ్బులతో తన కుటుంబసభ్యుల ఆకలి తీరుస్తున్నారు. మరోవైపు ఆదివాసీ కళారంగానికి తన వంతు సేవ చేస్తున్నారు. ఐతే తమ పొట్ట కోసం ఇంకా పాకులాట ఆగలేదు. ఇప్పటికైనా తన వృద్ధాప్యంలో లభించిన ఈ గుర్తింపు బుక్కెడు బువ్వ పెడుతుందని ఆశిస్తున్నాడాయన. అలా ఆశపడే కనకరాజు జీవితంలో మార్పు ఏమైనా వస్తుందా అనేది ప్రశ్న. ఆదివాసీ కళా సాహిత్య సంస్కృతుల్ని కూడా వాడుకుంటున్నాం. కాపాడుకోవడం లేదు. ఆ గుర్తింపు, గౌరవం వారికి అన్నం పెట్టదని గమనిస్తేనే ఏం చేయాలో తెలుస్తుంది.


రాష్ట్ర, కేంద్ర సంగీత నాటక అకాడమీలు గుర్తించనప్పుడు పద్మ అవార్డు రావడం విచిత్రం. అనేక గుర్తింపులు, ఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న కళాకారులకే అవార్డులు, రివార్డులు ఇస్తే ఒరిగేదేమీ లేదు. ఇలాంటి కళాకారులు ఈ నేలమీద ఉన్నారనే ఇంగితం లేని పాలకవర్గాల సాంస్కృతిక శాఖలు తలదించుకునేలా చేసిన ఈ గౌరవం ఏమైనా ఆలోచింపజేస్తుందా? చూడాలి.

జయధీర్‌ తిరుమలరావు

Updated Date - 2021-01-27T06:55:52+05:30 IST