సంప్రదాయాలకు పెద్దపీట

ABN , First Publish Date - 2022-09-25T04:49:34+05:30 IST

అభివృద్ధి, సంక్షేమంతో పాటు సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేశారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.

సంప్రదాయాలకు పెద్దపీట
బతుకమ్మ సంబురాలను ప్రారంభిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

బతుకమ్మ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


జడ్చర్ల, సెప్టెంబరు 24: అభివృద్ధి, సంక్షేమంతో పాటు సంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్దపీట వేశారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల బాదేపల్లి బాలుర జడ్పీహెచ్‌ఎస్‌ ప్రాంగణంలో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో ఒక రోజు ముందుగానే జడ్చర్లలో బతుకమ్మ సంబురాలు ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. బతుకమ్మ పండుగకు గతంలో అంతగా ప్రాధాన్యం ఉండేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణతో పాటు విదేశాలలో సైతం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. బతుకమ్మ పండుగకు మహిళలు పుట్టింటికి వెళ్తారని, పుట్టింటివాళ్లు పెట్టే చీరలా ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతీ మహిళ సీఎం కేసీఆర్‌ చీరలను పంపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గడిచిన పది రోజులుగా ఆసరా పింఛన్ల సంబురాలు జరుగుతున్నాయన్నారు. నా పెద్ద కుమారుడు కేసీఆర్‌ పింఛన్‌ ఇస్తున్నాడంటూ వృద్ధులు సంతోషంగా ఉన్నారన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గల్లీ, వాడ, పట్టణంతో పాటు దేశ, విదేశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు పెరిగాయని, దీంతో గ్రామాలలో, వ్యక్తిగతంగా ఇళ్లల్లో పండుగలను ఘనంగా చేపడుతున్నారన్నారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడారు.
బతుకమ్మ ఆడిన మంత్రి, ఎమ్మెల్యే: మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి బతుకమ్మ సంబురాలను ప్రారంభించి, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సంబురాలను వీక్షించేందుకు మహిళలు, యువతులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామరావు, డీఈవో రవీందర్‌, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోడ్గల్‌యాదయ్య, జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీ, వైస్‌ చైర్‌పర్సన్‌ పాలాదిసారిక, మిడ్జిల్‌ జడ్పీటీసీ శశిరేఖ, కౌన్సిలర్‌లు, ముడా డైరెక్టర్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T04:49:34+05:30 IST