Abn logo
Nov 24 2021 @ 00:46AM

ఆమెను ఆమెగానే గౌరవించండి

ఈమధ్య రాజకీయ, సినిమా రంగాలలో ఒక కొత్త ఒరవడి మొదలయింది. ఇరుపక్షాలు బరితెగించి రోడ్డుమీదకు వచ్చి ఇష్టమొచ్చినట్లు కెమెరాల సాక్షిగా తిట్టుకుంటున్నారు. ఆ క్రమంలో ఒకరి ఆంతరంగిక జీవిత రహస్యాలను మరొకరు బయటపెడ్తూ జనానికి కొంత వినోదం, మరికొంత ఏవగింపు కలిగేట్లు ప్రవర్తిస్తున్నారు. డిక్షనరీలో దొరకని అర్థాలు గల పదాలు వాడుతూ ఈ పురుష సింహాలు గ్రామసింహాల స్థాయికి దిగజారి మోరలెత్తి మరీ అరుస్తున్నారు.


ఇతర దేశాల సంగతేమో గాని మన దేశంలో అన్ని భాషల వాళ్లు ఇద్దరు పురుషులు పోట్లాడుకుంటుంటే ఎదుటివాడి అమ్మను, అక్కను అవమానపరిచే పదాలు వాడటం అతి సహజం. అది మన ఘనమైన సంస్కృతిలో ఒక భాగం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తేడా ఏమంటే ‘భార్య‘లను కూడా బరిలోకి తీసుకువచ్చి తిట్టుకుంటుంటే ఆ భాష వినలేక, తాము ఎన్నుకున్న నాయకులు, తాము అభిమానించే నటులు ఇంత దిగజారుడు మనుషులా అని అచ్చెరువొందుతున్నారు జనం.


అసలు మగవాళ్లెందుకంత agressiveగా ఉంటారు? తారతమ్యాలు మరచి కోపంలో విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయి ఎందుకలా ఎదుటివాడిని అవమానిస్తూ తాము నలుగురి ముందు నవ్వులపాలవుతారు? అసలు కోపం అంటే ఏమిటి? సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ప్రకారం మానవ వ్యక్తిత్వ వికాస పెరుగుదలలోని ఐదు మెట్లలో రెండవ దశకు చెందిన anal stage ఈ కోపం. అంటే చాలా మంది పురుషులు ఇంకా రెండవ దశను దాటి ఎదగడం లేదన్నమాట!


ఈ తిట్ల ప్రస్థానం ఏడాది, రెండేళ్ల క్రితం రెండు జాతీయ పార్టీల పోట్లాటలతో ప్రారంభమయింది. ఒక పార్టీ ‘మీది దరిద్రపు పార్టీ’ అంటే వాళ్లు ‘మీది ముదనష్టపు పార్టీ’ అన్నారు. ‘మీ పార్టీ మూడు ముక్కలయింది’ అని ఒకరంటే మరొకరు ‘మీ పార్టీ సర్వనాశనం అవుతుంది’ అని శపించారు. అవి అంతటితోనే ఆగిపోయాయి. వ్యక్తిగతంగా పోలేదు. కాని మెల్లమెల్లగా రాజకీయాల్లో తిట్ల పురాణాలు ప్రారంభమయ్యాయి.


ఒకప్పుడు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు సిద్ధాంతాలు వేరైనా పరస్పర గౌరవంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రజాక్షేత్రం కోసం పాటుబడేవాళ్లు. ఇప్పుడు ప్రభుత్వ పార్టీలు ప్రతిపక్షాలను పురుగుల కన్నా హీనంగా చూస్తున్నాయి. ఇక ప్రతిపక్షాలవాళ్లు ముఖ్యమంత్రిని, కాబినెట్‌ మంత్రులను పట్టుకుని ‘ఏరా’, ‘ఒరే’ అంటా ‘సన్నాసి’, ‘చవట’ అని తిడ్తున్నారు. వాక్స్వాతంత్ర్యం అంటే ఇదేనా?


ఈమధ్య సినిమారంగంలో కూడా రాజకీయాల ప్రభావం ఎక్కువైనట్లు కనపడుతోంది. సాధారణ ఎన్నికల్లో జరిగే సంఘటనలు, ప్రలోభాలు అన్నీ అక్కడ కూడా జరుగుతున్నాయి. కులాలవారీగా, ప్రాంతాలవారీగా చీలికలు ఏర్పడ్డట్లు సినిమారంగం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య ఇద్దరు నటుల మధ్య ఎందుకో హోరాహోరీ మాటల యుద్ధం జరిగింది. ఆ ఇద్దరు నటులకూ సంస్కారవంతులన్న పేరుంది. కాని వాళ్లు (లేదా వారి అభిమానులు) ఎదుటిపక్షం వాడి భార్య శీలం గురించి మాట్లాడటం, ఆ వ్యక్తి తన భార్య పాతివ్రత్యాన్ని బహిరంగంగా defend చేసుకోవడానికి తంటాలుపడడం చూస్తుంటే సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకుంది. విచిత్రమేమంటే ఆ ఇద్దరు నటులు ఎవరికి వారు తాము స్త్రీ జాతిని గౌరవిస్తామని బాహాటంగా చెప్పుకునేవారే!


స్ర్తీ జాతి అంటే ఏమిటి? అది బ్రహ్మపదార్థంలా కంటికి కనపడని శక్తి కాదు కదా! రక్తమాంసాలు గల వ్యక్తుల సమూహం. వాళ్లకీ రోషాలు, పౌరుషాలు ఉంటాయి... ఇష్టాలుంటాయి. ఐతే తన ప్రత్యర్థి భార్య కూడా ఆ స్త్రీ జాతిలో ఒక భాగమేనని వారికి ఎందుకు తట్టదో! మన సమాజంలో మగవాడికి ‘ఇజ్జత్‌’ అతని కుటుంబ స్ర్తీల ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటుందన్న నమ్మకాన్ని సాకుగా తీసుకుని ఎదుటివాడి భార్యని కించపరచడం ద్వారా పురుషుడి అహాన్ని దెబ్బతీయాలనుకోవడం ఎంత అమానుషం! మీ ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఒక అమాయక స్త్రీని బలిపశువును చేస్తారా? వ్యక్తిగతమైన ప్రత్యేకతలు గాని, తమ పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన గాని లేని అర్భకులే ఇలాంటి రోత రాజకీయాలకు పాల్పడతారు. తమ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఇల్లాళ్లను వీధికీడ్చి తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవాలనుకోవడం పురుష లక్షణమేనా?


ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సాక్షిగా జరిగిన సంఘటనలు, సంభాషణలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ఉన్నాయి. వీరేనా మన నేతలు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులలంకరించిన వీళ్లేనా మన మనుగడను శాసించే మహానుభావులు? ఎదుటిపక్షం వాడి భార్య శీలం గురించి విమర్శించడం, వారి సంతానం geneologyని నిర్ధారించడానికి మాత్రమే ఉందా అసెంబ్లీ? అంతకు మించి ఘనకార్యాలేమీ చెయ్యలేరా? ప్రజలు వారికి ఓటు వేసిందీ, తమ జీవితాన్ని వారి చేతుల్లో పెట్టిందీ ఇందుకేనా? వాళ్ల వాళ్ల వ్యక్తిగత కక్షలను తీర్చుకునేందుకు వేదికగా అసెంబ్లీనే కావలసివచ్చిందా? జనం వారి గురించి ఏమనుకుంటున్నారో ఎప్పుడైనా ఆలోచించేరా?


పురుషుడు తన స్వార్ధప్రయోజనాల కోసం స్త్రీ మానాభిమానాలను పణంగా పెట్టడం మనదేశంలో కొత్తేం కాదు. జూదంలో రాజ్యాన్ని కోల్పోయినా ఆగక చివరికి భార్యనే పణంగా పెట్టిన ధర్మరాజు, ఎవడో తాగుబోతు అన్న మాటలకు నిండుచూలాలైన భార్యను అడవిలో వదిలేసిన శ్రీరామచంద్రుడు గల ఘనచర్రిత మనది. వాళ్ల వారసులైన మీరు అంతకన్న గొప్పగా ఉంటారని ఆశించడం తప్పే! అసలు తప్పంతా ప్రజలదే! తాము ఎవరికి, ఎందుకు ఓటు వేస్తున్నామో ఆలోచించకుండా కులాలు, మతాలు, ప్రాంతాల ప్రాతిపదిక మీదనో, తాత్కాలికంగా లభించే చిల్లర సంతోషాల కోసం వారిని ఎన్నుకున్న ప్రజలదే తప్పు.


ఓ మగానుభావులారా! మీ అందరికీ ఒకటే నా విన్నపం! మీ నీచ నికృష్ట రాజకీయాల్లోకి ఏమాత్రం సంబంధంలేని మీ ఇంటి (లేదా ఎదుటివాడి ఇంటి) ఆడవాళ్లను ఈడ్చకండి. మీరు కొట్టుకుంటే కొట్టుకోండి. చంపుకుంటే చంపుకోండి. మీరు మీరు ఎన్ని వెధవ పనులయినా చెయ్యండి. మిమ్మల్ని కట్టుకున్న పాపానికి మీ ఆడవాళ్లను మీ పగలకు, ప్రతీకారాలకు బలిచేయకండి. ఒకడికి భార్య అయినంత మాత్రాన స్ర్తీ ఆమె అతని సొత్తుకాదు, బానిస కూడా కాదు. ఆమె కూడా మీలాటి మనిషే! మీలాగే ఆమెకూ ఇష్టాయిష్టాలు, పరువు, ప్రతిష్ఠ ఉంటాయి. భర్తతో సంబంధం లేకుండా వ్యక్తిగా, ఆమెను ఆమెగా గౌరవించడం నేర్చుకోండి.

డా. పరిమళా సోమేశ్వర్‌