మానవత్వంతో స్పందించా.. ఇలా అవుతుందనుకోలేదు

ABN , First Publish Date - 2021-12-03T05:29:46+05:30 IST

కారు ప్రమాదం సంఘటన గురించి తెలిసిన వెంటనే తాను మానవతా దృక్పథంతో సాయమందించేందుకు కదిలానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు స్పష్టం చేశారు.

మానవత్వంతో స్పందించా.. ఇలా అవుతుందనుకోలేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

 మృతుడి కుటుంబానికి అండగా ఉంటా

 తక్షణ సాయంగా రూ. లక్ష అందజేస్తా

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు

దుబ్బాక, డిసెంబరు 2: కారు ప్రమాదం సంఘటన గురించి తెలిసిన వెంటనే తాను మానవతా దృక్పథంతో సాయమందించేందుకు  కదిలానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. కారు ప్రమాద ఘటనలో ఈతగాడు నర్సింహులు మృతి దురదృష్టకరమని, ఇలా అవుతుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి తాను పూర్తి సహాయ సహకారాలందిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. గురువారం రాత్రి దుబ్బాక క్యాంపు కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మృతుడు నర్సింహులు కుటుంబానికి తన వంతుగా మొదట రూ. లక్ష ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అంతేగాక నర్సింహులు కూతురు పేరుతో మరో రూ.50 వేలను పెళ్లి ఖర్చులకు డిపాజిట్‌ చేస్తానని తెలిపారు. ఆ ఇద్దరు పిల్లల చదువును తానే దగ్గరుండి చూసుకుంటాననీ, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావల్సిన అన్ని సహాయాలను అందిస్తామన్నారు. బుధవారం రాత్రి మృతుడి కూతురుతో కూడా తాను మాట్లాడాననీ, తానే మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నుంచి 30 హెచ్‌పీ మోటార్‌ తీసుకుని వచ్చి, నీటిని తోడేలా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఈ సంఘటన తనకు బాధ కలిగించిందని, దీనిని రాజకీయం చేయాలనుకున్నవారి విజ్ఞతకే వదిలేస్తానన్నారు. 

Updated Date - 2021-12-03T05:29:46+05:30 IST