తిరుమల నడకదారిలో ఆళ్వార్‌ తీర్థం పునరుద్ధరణ

ABN , First Publish Date - 2021-04-19T07:00:18+05:30 IST

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో బయటపడిన పురాతనమైన ఆళ్వార్‌ తీర్థాన్ని రామానుజాచార్యుడి జయంతి సందర్భంగా పునరుద్ధరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

తిరుమల నడకదారిలో ఆళ్వార్‌ తీర్థం పునరుద్ధరణ
ఆళ్వార్‌ తీర్థం, పునరుద్ధరణ పనులను ప్రారంభిస్తున్న టీటీడీ అటవీ అధికారులు, ట్రెక్కర్స్‌

తిరుపతి/తిరుమల, ఏప్రిల్‌ 18  (ఆంధ్రజ్యోతి): అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలో బయటపడిన పురాతనమైన ఆళ్వార్‌ తీర్థాన్ని రామానుజాచార్యుడి జయంతి సందర్భంగా పునరుద్ధరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలిపిరి నుంచి గాలిగోపురానికి వెళ్లే మార్గంలోని 950వ మెట్టు వద్ద ఈ ఆళ్వార్‌ తీర్థం ఉండటం విశేషం. చెన్నైకి చెందిన ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శ్రీరామ్‌ తిరుమలలోని తీర్థాలను పరిశోధిస్తూ.. ఈ తీర్థం ఉనికిని తిరుమళీశై ఆళ్వార్‌ పాసురాల్లో చూశారు. 2004లో నడకదారిలో ఈ తీర్థాన్ని గుర్తించారు. దీని విశిష్టతను తిరుపతిలోని ట్రెక్కర్స్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో దట్టమైన అడవిలో పెద్ద పెద్ద వృక్షాల మధ్య, రాతితో నిర్మితమైన శిథిల స్థితిలో ఉన్న ఆళ్వార్‌ తీర్థం పునరుద్ధరణ పనులను టీటీడీ అటవీశాఖ సహకారంతో ఆదివారం ట్రెక్కర్స్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎఫ్‌వో చంద్రశేఖర్‌ యాదవ్‌, రేంజర్లు ప్రభాకర్‌ రెడ్డి, శ్రీనివాసులుతోపాటు ట్రెక్కర్స్‌ అయిన శ్వేత మాజీ డైరెక్టర్‌ భూమన్‌, రాఘవశర్మ, శ్రీరాం, సుబ్బరాయుడు, శ్రీనివాస్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T07:00:18+05:30 IST