Abn logo
Sep 14 2021 @ 00:15AM

వ్యక్తిస్వేచ్ఛకు పేటెంట్ల ప్రతిబంధకాలు

వ్యక్తి స్వాతంత్ర్యాన్ని గౌరవించనందుకు, ప్రజా స్వామ్యాన్ని పాటించనందుకు తాలిబాన్లను పాశ్చాత్య, భారతీయ మీడియా తీవ్రంగా విమర్శిస్తోంది. 1990 దశకంలో అధికారంలో ఉన్నప్పుడు తాలిబాన్లు తమ వ్యతిరేకుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారు. మహిళలకు కనీస మానవహక్కులు కూడా ఇవ్వలేదు. అంతర్జాతీయ సమాజం గౌరవించే మానవతా, నాగరీక విలువలను వారు కాలరాచివేసారనడంలో సందేహం లేదు. 


స్వేచ్ఛారహిత, ప్రజాస్వామ్యేతర దేశాల రికార్డు మరోరకంగా ఉండడం గమనార్హం. అమెరికన్ సంస్థ ఎడెల్మాన్ ట్రస్ట్ 2020లో నిర్వహించిన ఒక అధ్యయనంలో 90శాతం మంది చైనీయులు తమ నిరంకుశ ప్రభుత్వంలో సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని వెల్లడయింది. చైనాతో పోలిస్తే మనదేశంలో 81శాతం మంది, అమెరికాలో 39శాతం మంది ప్రజలు మాత్రమే తమ ప్రజాస్వామిక ప్రభుత్వాలలో నమ్మకాన్ని కలిగి ఉన్నారని అదే అధ్యయనం పేర్కొంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2011లో 61శాతం మంది చైనీయులు తమ స్థానిక ప్రభుత్వాలు సామాన్య ప్రజల పట్ల దయా దాక్షిణ్యాలతో వ్యవహరిస్తున్నాయని భావించారు. ఇలా భావిస్తున్న వారి సంఖ్య 2016లో 74శాతానికి పెరిగిందని హార్వర్డ్ అధ్యయనం వెల్లడించింది. అమెరికన్, భారత ప్రజాస్వామ్య ప్రభుత్వాల కంటే చైనా నియంతృత్వ పాలకుల పట్లే ప్రజలు ఎక్కువ సంతృప్తితో ఉన్నారనేది స్పష్టం. మరింత ముఖ్యమైన వాస్తవమేమిటంటే అమెరికా మిత్రదేశాలు కువైట్, సౌదీ అరేబియా; శత్రుదేశాలు ఉత్తర కొరియా, చైనా వ్యక్తి స్వాతంత్ర్యం, ప్రజాస్వామిక పద్ధతులను గౌరవించడం లేదు. మరి ఆ మానవతా, నాగరీక విలువలను గౌరవించడం మాత్రమే ప్రజల శ్రేయస్సుకు దోహదం చేస్తుందా? ఈ విషయాన్ని మనం నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 


వ్యక్తిస్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యపాలన పరమలక్ష్యం ప్రజల సంక్షేమమే అనడంలో సందేహమేమీ లేదు. మరి వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అమెరికా సంపూర్ణంగా గౌరవిస్తోందా? ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) ఆధ్వర్యంలోని పేటెంట్ల చట్టాలకు సంబంధించి వ్యక్తి స్వేచ్ఛల విషయాన్ని పరిశీలిస్తే అమెరికా రెండు నాల్కల ధోరణి స్పష్టమవుతుంది. కొత్త సాంకేతికతలను సమకూర్చుకోవడం ద్వారా ప్రజలు మరింత సంక్షేమాన్ని సమకూర్చుకుంటారు. ఆహారాన్ని వండడంలో సంప్రదాయ పరికరాల కంటే ప్రెషర్ కుకర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా గృహిణి తన శ్రమను తగ్గించుకోవడం లేదా? సామాన్యుల శ్రేయస్సునకు తోడ్పడుతున్న ఇటువంటి కొత్త సాంకేతికతలు శతాబ్దాలుగా సృష్టి అవుతూనే ఉన్నాయి. అయితే వినూత్న సాంకేతికతలకు పేటెంట్లు ఇవ్వడమనేది అధునాతన పరిణామం. ఐదు శతాబ్దాల క్రితం గూటెన్‌బర్గ్ ప్రింటింగ్ ప్రెస్‌ను రూపొందించినప్పుడు దానికి ఎవరూ పేటెంట్ ఇవ్వలేదు. ఆ విప్లవాత్మక సాంకేతికతను జర్మన్ ప్రజలతో పాటు యూరోపియన్లు అందరూ స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. పుస్తకాల ముద్రణతో విజ్ఞాన వికాసాలను ఇతోధికంగా సాధించారు. పేటెంట్ల పరిరక్షణ లేనందున కొత్త సాంకేతికతల ఆవిష్కరణలు నిలిచిపోలేదు. వాస్తవానికి ఆ ఆవిష్కరణలు శతవిధాల అధికమయ్యాయి. పేటెంట్లు లేనిపక్షంలో కొత్త ఆవిష్కరణలు జరగవనడం ఎంతమాత్రం సరికాదు. 


సరే, మన కాలానికి వద్దాం. 1995 నుంచి పేటెంట్ పరిరక్షణ అనేది విస్తృతమయింది, పటిష్ఠమయింది. అమెరికా నాయకత్వంలో ప్రపంచ వాణిజ్య సంస్థ పేటెంట్ల వ్యవస్థను విశ్వవ్యాప్తంగా అమలుపరుస్తోంది. వాటిని స్వేచ్ఛగా వినియోగించుకునే వెసులుబాటు ప్రపంచ ప్రజలకు ఎంతమాత్రం లేదు. అసలు అలా ఉపయోగించుకోవడమనేది ఒక పెద్ద నేరంగా ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయి. మరి ప్రజల శ్రేయస్సు ఎలా పెరుగుతుంది? నవ సాంకేతికతలు, వాటిని ఆవిష్కరించిన వ్యక్తి సొంతదేశంలోని ఆవిష్కర్త దేశ ప్రజలకు సైతం స్వేచ్ఛగా లభించకపోవడం మరింత శోచనీయమైన విషయం. భారీ ధరకు మాత్రమే అవి అందుబాటులోకి వస్తున్నాయి. ఇది, ప్రజల సంక్షేమాన్ని కుదించివేస్తోంది. ఇక ఆవిష్కర్తకు మాత్రం తాను సృష్టించిన సాంకేతికతపై సర్వహక్కులు దక్కుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎవరు దానిని ఉపయోగించుకోవాలనుకున్నా వారు అందుకు తగు ధరను ఆవిష్కర్తకు చెల్లించితీరాల్సిందే. అలా అంతర్జాతీయంగా కొత్త సాంకేతికతల పెటెంట్లకు రక్షణ లభిస్తోంది. ఇది ‘వ్యక్తిస్వాతంత్ర్యం’ అనే నాగరీక విలువను తిరస్కరించడమే.


వ్యక్తిస్వేచ్ఛకు వ్యతిరేకంగా నేనేమీ వాదించడం లేదు. అది ఒక మహోన్నత ఆదర్శం. ఈ ఆదర్శం ఇంకా ఎక్కడా సంపూర్ణంగా ఆచరణలోకి రాలేదు. ఈ వాస్తవం దృష్ట్యా వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మాత్రమే ప్రజల శ్రేయస్సునకు దారితీస్తాయని భావించవలసిన అవసరం లేదు. అలా విశ్వసించడం మూర్ఖత్వమే అవతుంది. ప్రజలకు సంపూర్ణంగా స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఇచ్చి, కొత్త సాంకేతికతల సృష్టికర్తలకు తక్కువ వ్యాపారస్వేచ్ఛ కల్పిస్తే మానవాళికి మరింత శ్రేయస్సు సమకూరే అవకాశముందని భావిస్తున్నాను. ఈ విషయమై ప్రతి ఒక్కరూ పక్షపాతరహితంగా ఆలోచించాలి.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...