ఎన్నికల ప్రచారంపైనా ఆంక్షలు

ABN , First Publish Date - 2021-04-21T05:07:16+05:30 IST

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికలపై కరోనా ప్రభావం పడింది. కరోనా వైరస్‌ విస్త్రృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

ఎన్నికల ప్రచారంపైనా ఆంక్షలు

 ఉదయం 6నుంచి రాత్రి 8గంటల వరకు అవకాశం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 20: సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికలపై కరోనా ప్రభావం పడింది. కరోనా వైరస్‌ విస్త్రృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రచారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా.. రేపటితో ఉపసంహరణ గడువు ముగియగానే ప్రచారం ఆరంభమవుతుంది. పట్టణంలోని 43 వార్డుల్లో ఆయా పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. వీరంతా ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. 23నుంచి 28 సాయంత్రం 5గంటల దాకా ప్రచారం చేసుకోవచ్చు. గతంలో ఉదయం 6నుంచి రాత్రి 10గంటల దాకా ప్రచారం చేసుకునే వీలుండేది. కరోనా నేపథ్యంలో ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకే ప్రచారం చేసుకునేలా ఆంక్షలు విధించారు. అంతేగాకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 6గంటల వరకే లౌడ్‌ స్పీకర్లు, బహిరంగ సభలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇందులో ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలని, సభలు, సమావేశాల్లో భౌతికదూరం తప్పనిసరిగా పేర్కొన్నారు. 


సోషల్‌ మీడియాకు ప్రాధాన్యత


ఇటీవల ఏ ఎన్నికల్లో చూసినా సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటింటా పలుమార్లు తిరిగే కంటే ఓటర్ల నంబర్లకు ఫోన్లు చేయడం, వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీనికితోడు పట్టణంలో ఓటర్లు కూడా వినూత్న రీతిలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడిగేందుకు రావొద్దని తమ ఇళ్లముందు ఫ్లెక్సీలు కడుతున్నారు.


 

Updated Date - 2021-04-21T05:07:16+05:30 IST