రిటైర్మెంట్‌

ABN , First Publish Date - 2021-01-04T07:07:39+05:30 IST

ఎన్నేళ్ళుగానో క్రమం తప్పకుండా తిరిగిన గడియారం ఒక్కసారిగా ఆగిపోతుంది కదిలే ముళ్ళతో కదలికల్ని నిర్దేశిస్తూ.....

రిటైర్మెంట్‌

ఎన్నేళ్ళుగానో

క్రమం తప్పకుండా తిరిగిన గడియారం 

ఒక్కసారిగా ఆగిపోతుంది 

కదిలే ముళ్ళతో కదలికల్ని నిర్దేశిస్తూ 

అది సాగించిన నిరంకుశపాలన 

ఆఖరికి అంతమైపోతుంది.


నలుచదరపుచట్రంలో 

అంతవరకూ బందీయైున కాలం 

విశాలమైన పచ్చికబయలు లాగా 

కళ్ళముందుపరుచుకుంటుంది. 


పనిదినాల పంజరంలో 

గువ్వలా చిక్కిన విరామం 

మబ్బులు చూసిన నెమలిలా 

పురివిప్పుకుంటుంది. 


ఎన్నో చేయాలనిపిస్తుంది

అన్నివైపులకీ ఒకేసారి 

పరుగులు తీయాలనిపిస్తుంది. 


పదవులు, బాధ్యతలు, పోటీలు, వైషమ్యాలు

మచ్చలు మచ్చలుగా తేలిన పాత కుబుసం విడిచాక

తొడిగిన కొత్త చర్మం 

నునుపుగా, మెత్తగా కొత్త ఆశల్ని రేకెత్తిస్తుంది. 


మిగిలివున్న గడువు 

చిన్నదో, పెద్దదో ఎవరికి తెలుసు?

పొద్దు క్రుంకేలోగా

తెల్ల వెలుగులో దాగిన ఒకటిరెండు అపరిచిత వర్ణాల్ని 

కొద్దిగానైనా తెలుసుకోవాలని ఉంటుంది. 


ఒలికిన పాలను ఎలాగూ గిన్నెకెత్తుకోలేం

రాలిన ముత్యాలలో కొన్నిటినైనా

తిరిగి ఏరుకోకచ్చుననే ఊహ 

తలెత్తిన తెల్ల వెండ్రుకలా

తళుక్కున మెరుస్తుంది.



విన్నకోట రవిశంకర్‌

Updated Date - 2021-01-04T07:07:39+05:30 IST