మళ్లీ రిటైర్మెంట్‌ రగడ?

ABN , First Publish Date - 2021-04-04T07:21:40+05:30 IST

తిరుమల ఆలయం ప్రధాన..

మళ్లీ రిటైర్మెంట్‌ రగడ?

పింక్‌డైమండ్‌ సంగతి తేలకనే రమణదీక్షితులుకి ఆలయ ప్రధాన అర్చకత్వం

టీటీడీ సంచలన నిర్ణయం


తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుమల ఆలయం ప్రధాన అర్చకుడిగా దాదాపు మూడేళ్ల తర్వాత రమణదీక్షితులు బాధ్యతలు స్వీకరించబోతున్నారా? అందుకు అనుగుణంగానే టీటీడీ అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందా? రెండున్నర ఏళ్ల పాటూ కోర్టు ఆదేశాలను పట్టించుకోని టీటీడీ హఠాత్తుగా ఇప్పుడెందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది? 65 ఏళ్లు నిండి రిటైరైన అర్చకులు తిరిగి విధుల్లో చేరితే, వీరి స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న అర్చకులు నిశ్శబ్దంగా తప్పుకుంటారా? ఇది మరో అర్చక వివాదంగా మారబోతుందా? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం విస్తృతంగా వినిపిస్తున్నాయి.  


రమణదీక్షితులుకి ప్రధానార్చకుడిగా మళ్లీ బాధ్యతలు అప్పగిస్తే, మరి ఆయన తిరుమల ఆలయంలో పూజా కైంకర్యాల మీద చేసిన విమర్శలు, వజ్రాభరణాల మీద చేసి ఆరోపణల మాటేమిటనే అంశం చర్చకు వస్తోంది. శ్రీవారికి చెందిన పింక్‌ డైమండ్‌ మాయమైందంటూ రమణదీక్షితులు టీటీడీపై చేసిన ఆరోపణలు దేశవిదేశాల్లోని శ్రీవారి భక్తులను కలవరపరిచాయి. దేవస్థానం ప్రతిష్ట కూడా మసకబారే పరిస్థితి తలెత్తింది. జగన్‌ సహా పలువురు రాజకీయ నాయకులను ఆయన కలవడం, ప్రధాన నగరాల్లో ప్రెస్‌మీట్‌లు పెట్టి ఆరోపణలు చేయడం వంటివి టీటీడీకి మచ్చగా మారాయి. విజయసాయి రెడ్డి కూడా ఆయన ఆరోపణలకు జత కలిసి విమర్శలు చేశారు. దీంతో టీటీడీ రమణదీక్షితులపై రూ. వంద కోట్లకు పరువునష్టం కేసు పెట్టింది. దానికోసం రూ. కోటి కోర్టులో ఫీజు కింద చెల్లించింది కూడా. ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అనేక సార్లు ఆయన సీఎం జగన్‌ను కలిశారు. రమణదీక్షితులుని టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడుగా, శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడుగా కూడా నియమించారు.


ఓవైపు ఆయనపై వంద కోట్లకు పరువునష్టం కేసు వేసిన టీటీడీ మరోవైపు ఆయన్నే దేవస్థానంలో రెండు కీలక పదవుల్లో నియమించడం దుమారం రేపింది. గౌరవ ప్రధాన అర్చక హోదా కన్నా రెగ్యులర్‌ ప్రధాన అర్చకుడిగా మునుపటి తరహా బాధ్యతల్లోనే ఉండాలని రమణదీక్షితులు కోరుకున్నారు. ఇప్పుడు ఆయన ఆకాంక్ష నెరవేరుతోంది. ఆలయ రెగ్యులర్‌ ప్రధాన అర్చకుడుగా నియమించేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రమణదీక్షితులపై పరువునష్టం కేసు కొనసాగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయాన్ని టీటీడీ ఎలా సమర్థించుకుంటుందో తెలియాల్సి ఉంది. టీటీడీ వ్యవహారాల మీద తరచూ వ్యాఖ్యలు చేసే పలువురు ప్రముఖులు ఈ నిర్ణయం పట్ల విస్మయం ప్రకటిస్తున్నారు. 


దేవస్థానంలో నాలుగు మిరాశీ కుటుంబాలకు చెందిన వారినే ప్రధాన అర్చకులుగా నియమించడం ఆనవాయితీ. ఒక్కో కుటుంబం నుంచీ ఒకరు చొప్పున మొత్తం నలుగురు ప్రధాన అర్చకులు వుంటారు. వీరిలో ముగ్గురు శ్రీవారి ఆలయంలో, ఒకరు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తారు. ఇతర సాధారణ అర్చకులుగా కూడా ఈ నాలుగు కుటుంబాలకు చెందిన వారు పలువురు దేవస్థానంలో వంశపారంపర్యంగా కొనసాగుతున్నారు. 2018లో టీటీడీ బోర్డు తీర్మానం ద్వారా రిటైరైన నలుగురు ప్రధాన అర్చకుల స్థానాల్లో అదే కుటుంబాలకు చెందిన వారిని ప్రధాన అర్చకులుగా నియమించారు. గొల్లపల్లె కుటుంబంలో రమణదీక్షితులు రిటైరు కాగా ఆయన స్థానంలో అదే వంశానికి చెందిన వేణుగోపాలదీక్షితులు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా నియమితులై కొనసాగుతున్నారు. అలాగే తిరుపతమ్మ వంశానికి సంబంధించి నరసింహదీక్షితులు రిటైరు కాగా  గోవిందరాజ దీక్షితులు ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. పైడిపల్లి వంశానికి చెందిన నారాయణదీక్షితులు రిటైరు కాగా ఆ కుటుంబాలకు చెందిన కృష్ణ శేషాచల దీక్షితులు ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. పెద్దింటి వంశానికి చెందిన శ్రీనివాసమూర్తి దీక్షితులు రిటైరవగా ఆయన స్థానంలో అదే వంశానికి చెందిన శ్రీనివాసదీక్షితులు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడుగా వున్నారు. అలాగే అప్పటి నుంచీ రిటైరైన సుమారు 20 మంది స్థానాల్లో ఇతర అర్చకులు నియమితులయ్యారు.


తాజాగా టీటీడీ జారీ చేసిన ఆదేశాలతో ఇపుడు రిటైరైన సుమారు 20 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సి వుంది. వారిని మునుపటి స్థానాల్లో నియమిస్తే సాంకేతికంగా చాలా ఇబ్బందులు తలెత్తనున్నాయి. శ్రీవారి ఆలయంలో ముగ్గురు ప్రధాన అర్చకులే వుండాలి. ఇపుడు మొత్తం ఆరు మంది అవుతారు. అలాంటప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు ప్రధాన అర్చకుల పరిస్థితి ఏమిటన్నది అంతుబట్టడం లేదు. దీనిపై టీటీడీ కూడా సంబంధిత ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో రిటైరైన ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు అనారోగ్యంతో మరణించినందున అక్కడ సమస్య లేదు.

Updated Date - 2021-04-04T07:21:40+05:30 IST