చట్టపరంగా చక్రవడ్డీ సహా తిరిగిచ్చేస్తాం

ABN , First Publish Date - 2021-10-25T05:45:35+05:30 IST

టీడీపీ అధికారంలోకి రాగానే ఇప్పుడు విర్రవీగుతున్న వారందరికీ ఎక్కడున్నా సరే చట్టపరంగా చక్రవడ్డీ సహా తిరిగిచ్చేస్తామని మాజీ మంత్రి అమరనాథరెడ్డి తెలిపారు.

చట్టపరంగా చక్రవడ్డీ సహా తిరిగిచ్చేస్తాం
మీడియాతో మాట్లాడుతున్నఅమరనాథరెడ్డి

మాజీ మంత్రి అమరనాథరెడ్డి 


తిరుపతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధికారంలోకి రాగానే ఇప్పుడు విర్రవీగుతున్న వారందరికీ ఎక్కడున్నా సరే చట్టపరంగా చక్రవడ్డీ సహా తిరిగిచ్చేస్తామని మాజీ మంత్రి అమరనాథరెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆదివారం ఆయన నాయకులతో కలసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో వైసీపీ కార్యకర్తల బెదిరింపులు, దాడులను నాయకులంతా ఏకమై సమష్టిగా ఎదుర్కొంటామని, ఎవరూ భయపడొద్దని ఽభరోసా ఇచ్చారు.  టీడీపీ కార్యాలయాలపై దాడి చేయడం, బాధితులపై అక్రమ కేసులుపెట్టి అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు అరెస్టు చేసేముందు నోటీసుల ద్వారా వివరాలు అడగాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌రెడ్డి కలిసి మూడు ప్రాజెక్టుల కోసం తక్కినవన్నింటినీ కోల్డ్‌ స్టోరేజీలో పెట్టేశారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కక అభివృద్ధి పనీ చేయలేదన్నారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. ఎందుకంటే టెండరు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని గుర్తుచేశారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఆందోళనలో ఉందన్నారు. తమనేత పట్టాభి వైసీపీ నేతలు భావిస్తున్నట్టు సీఎంను పరుషంగా మాట్లాడలేదని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చెప్పారు. అందుకే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చేస్తున్న అరాచకాలన్నింటినీ వడ్డీ సహా చెల్లిస్తామన్నారు. తిరుపతిలో తనతో పాటు తమ నాయకులు ఎలాంటి నేరాలు చేయకపోయినా చెరసాల జీవితం అనుభవిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను వినియోగదారుల కోరిక మేరకు తగ్గించమని ప్రజల తరపున ప్రతిపక్ష పార్టీగా ఆందోళనలు చేపడితే అధికారపార్టీ నేతలు భౌతిక దాడులు చేస్తూ, వాహనాలను ధ్వంసం చేశారన్నారు.  తెలుగుదేశం పార్టీ ఏకార్యక్రమం చేపట్టినా అరెస్టులు, నిర్బంధాలు, హౌస్‌ అరెస్టులు చేస్తున్నారని ఆవేదన చెందారు. అనాలోచిత, అనుభవరహిత పాలనతో ప్రజలను గందరగోళ పరిస్థితులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన వర్గాలకు చెందిన తమపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ పేర్కొన్నారు. రేణిగుంట ఘటనలో తమపై దాడిచేసిన వారిని వదిలేసి తమపైనే కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తప్పుడు కేసులను తీయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తాను బెంగుళూరులో ఉంటే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురుజాల సందీప్‌ తెలిపారు. తమను ఎన్నివిధాలుగా ఇబ్బంది పెట్టినా ఆత్మస్థైర్యం కోల్పోయేదిలేదన్నారు. తమ ధైర్యం చంద్రబాబు నాయుడని, కార్యకర్తలకు పూర్తి భరోసా ఇచ్చేందుకు ఏ సమయంలోనైనా పార్టీ అధిష్ఠానం సిద్ధంగా ఉందనేందుకు తన ఘటనే నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో నాయకులు జేడీ రాజశేఖర్‌, బీఎల్‌ సంజయ్‌, ఆర్సీ మునికృష్ణ, శ్రీధర్‌వర్మ, బుల్లెట్‌ రమణ, విజయలక్ష్మి, మనోహర్‌, చిట్టిబాబు, సప్తగిరి ప్రసాద్‌, రవినాయుడు, ఊట్ల సురేంద్ర నాయుడు, బ్యాంకు శాంతమ్మ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T05:45:35+05:30 IST