మోదీ, కేసీఆర్‌లు రైతు వ్యతిరేకులు: Revanth

ABN , First Publish Date - 2021-08-06T22:29:52+05:30 IST

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాకు విపక్షాలు మద్దతు తెలిపాయి.

మోదీ, కేసీఆర్‌లు రైతు వ్యతిరేకులు: Revanth

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాకు విపక్షాలు మద్దతు తెలిపాయి. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అన్నదాతల ఆందోళన ప్రాంతానికి చేరుకుని సంఘీభావం తెలిపాయి. ‘సేవ్ పార్మర్స్, సేవ్ ఇండియా’ అంటూ నినాదాలు చేస్తూ రైతులకు విపక్షాలు మద్దతు తెలిపాయి. రాహుల్ గాంధీ కూడా ధర్నాలో పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘అన్నదాతలను కాపాడండి.. దేశాన్ని రక్షించండి’ అంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ రైతు వ్యతిరేకులేనని విమర్శించారు.


ఈ సందర్భంగా రేవంత్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆందోళన చేస్తున్నవారిపై ప్రధాని మోదీ దేశ ద్రోహ, రాజద్రోహం చట్టాలు పెట్టి ఆందోళనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ 8 నెలలుగా రైతులు రోడ్డుమీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారని, ఎంతోమంది రైతులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతులకు  పార్లమెంట్‌లో సంతాపం తెలపడానికి కూడా మోదీ అనుమతించలేదని అన్నారు. సూటు, బూటు వాళ్ల కోసమే ఈ సర్కార్ పనిచేస్తోందని ఆరోపించారు. ప్రధాని రైతు వ్యతిరేక చట్టాలను చేసినప్పుడు సీఎం కేసీఆర్.. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని, ఢిల్లీపై యుద్ధమేనని ప్రకటించారని, కానీ ఢిల్లీకి వచ్చి మోదీని, అమిత్ షాను కలిసిన తర్వాత ప్రధానికి కేసీఆర్ లొంగిపోయారని రేవంత్ ఆరోపించారు.

Updated Date - 2021-08-06T22:29:52+05:30 IST