Abn logo
Sep 27 2021 @ 13:56PM

బంద్‌లో పాల్గొనాల్సిన సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో విందులో పాల్గొన్నారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ జరుగుతుంటే.. సీఎం కేసీఆర్ ఈ బంద్‌కు మద్దతు ఇవ్వకుండా ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో విందులో పాల్గొన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉప్పల్‌లో జరుగుతున్న ధర్నాలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ 19 ప్రతిపక్ష పార్టీలు నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజీల్ పెంపుకు వ్యతిరేకంగా, నిరుద్యోగ సమస్యపై, ప్రధాని ఇచ్చిన హామీలు వైఫల్యం, నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ భారత్ బంద్ జరుగుతోందన్నారు.


ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ వేర్వేరుకాదని, ఒకే తానులోని ముక్కలని, నాణేనికి బొమ్మా, బొరుసు లాంటివాళ్లని రేవంత్ అన్నారు. కేవలం సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేస్తే.. పోయిన వారమే ప్రధాని, అమిత్ షా, మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిశారన్నారు. ఇవాళ బందులో పాల్గొనకుండా.. ఢిల్లీలో మోదీతో విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారంటే.. ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసీఆర్ భయపడుతున్నారని రేవంత్ విమర్శించారు.

ఇవి కూడా చదవండిImage Caption