కాంగ్రెస్ దళితుల పార్టీ: రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-03T21:08:07+05:30 IST

కాంగ్రెస్ దళితుల పార్టీ అని, ఇతర పార్టీల్లో దళిత విభాగం ఆరో వేలుగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ దళితుల పార్టీ: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ దళితుల పార్టీ అని, ఇతర పార్టీల్లో దళిత విభాగం ఆరో వేలుగా ఉంటుందని, దళితున్ని రాష్ట్రపతిని చేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ ఎస్సీ విభాగం సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ బీజేపీ మల్లికార్జున ఖర్గేను ఓడించి దళిత వ్యతిరేక బుద్దిని చాటుకుందని విమర్శించారు. రాజ్యసభలో సభాపక్ష నాయకునిగా ఖర్గేకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. పంజాబ్‌లో పేద దళితున్ని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. అలాగే తెలంగాణలో శాసనసభా పక్ష నేతగా దళిత నాయకుడు భట్టికి అవకాశం ఇచ్చిందన్నారు.


ఏపీలో దళిత బిడ్డ శైలజానాథ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నియమించిందని రేవంత్ రెడ్డి అన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలను కాంగ్రెస్ ఏనాడు నిర్లక్ష్యం చేయలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెట్టిన విశాఖ ఉక్కు సహా పబ్లిక్ రంగ సంస్థలను మోదీ తెగ నమ్ముతున్నారని, దాంతో ఆ సంస్థల్లో రిజర్వేషన్లను అమలుచేసే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ అమ్ముతున్న ఆస్తులను పెంచింది కాంగ్రెస్ అన్నది గుర్తుపెట్టుకోవాలన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డికి, పల్లాకు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చి రిజర్వేషన్లు లేకుండా చేశారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో పేదలకు చదువు దూరం అయిందని, మోదీ, కేసీఆర్ విధానాలు ప్రమాదకరంగా మారాయని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2021-10-03T21:08:07+05:30 IST