నేటి యువతకు తప్పుడు చరిత్రను చూపిస్తున్నారు: రేంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-11-14T18:40:01+05:30 IST

జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం ఈ దేశ ప్రజలకు ఒక పండుగని రేవంత్ రెడ్డి అన్నారు.

నేటి యువతకు తప్పుడు చరిత్రను చూపిస్తున్నారు: రేంత్ రెడ్డి

హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం ఈ దేశ ప్రజలకు ఒక పండుగని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో ఎలాంటి పాత్ర లేనివారిని దేశ భక్తులుగా చూపిస్తున్నారని విమర్శించారు. నేటి యువతకు తప్పుడు చరిత్రను చూపిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని, వాయిదా వేశామని స్పష్టం చేశారు. కలెక్టర్లు రాజకీయ అవతారం ఎత్తారని, టీఆర్ఎస్‌ ధర్నాలకు అనుమతిచ్చి..కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నిబంధనలు తమ పార్టీకేనా? టీఆర్ఎస్, బీజేపీలకు ఉండవా? అని నిలదీశారు. బీజేపీ, టిఆర్ఎస్‌లు తొడుదొంగలని రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.


ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వడ్లు కొనేందుకు రూ. 10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా? అని ప్రశ్నించారు. ధర్నాలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ముఖ్యమంత్రి ఎందుకు దీక్ష చేయడం లేదన్నారు. వడ్లు కొనలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రతీ ధాన్యం గింజా కొనాల్సిందేనని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-14T18:40:01+05:30 IST