పేదోళ్ల చావులను కప్పిపుచ్చడానికీ.. తెలంగాణ సెంటిమెంట్‌నే వాడతారా?

ABN , First Publish Date - 2020-07-29T08:15:51+05:30 IST

కరోనా వల్ల పేదోళ్లు పిట్టల్లా రాలుతున్న సందర్భంలో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక

పేదోళ్ల చావులను కప్పిపుచ్చడానికీ.. తెలంగాణ సెంటిమెంట్‌నే వాడతారా?

  • కాళోజీ, దాశరథిలనూ వాడుకున్నారు
  • ఆంధ్రా ఆనవాళ్లు చెరిపేయాలంటే
  • మొదటి మార్చాల్సింది కేటీఆర్‌ పేరునే
  • ఏబీఎన్‌ డిబేట్‌లో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు


హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కరోనా వల్ల పేదోళ్లు పిట్టల్లా రాలుతున్న సందర్భంలో ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఒక విశ్లేషణాత్మక కథనాన్ని రాస్తే.. ఆ పేదోళ్ల చావులను కప్పి పుచ్చేందుకు నమస్తే తెలంగాణ పత్రిక ఆంధ్ర, తెలంగాణ సెంటి మెంట్‌ను వాడుకుంటోందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లడానికి అనిశెట్టి ప్రభాకర్‌, కాళోజీ, దాశరథి వంటి కవులు రాసిన గేయాలనూ వారి వ్యాపారం, దొంగతనాలను కవర్‌ చేసుకునేందుకు వాడుకున్నారని అన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక.. తెలంగాణ గుండె చప్పుడు కాదని, అది కేసీఆర్‌ గుండె చప్పుడని విమర్శించారు. మంగళవారం ఏబీఎన్‌ చానల్‌లో జరిగిన చర్చలో రేవంత్‌ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌కు మైండ్‌ బ్లాంక్‌ అయినప్పుడల్లా పాయింట్‌ బ్లాంక్‌ అంటూ సవాల్‌రెడ్డి పేరుతో శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యాసాలు రాస్తుంటాడని అన్నారు. ఇప్పటివరకు కలం పేరు మార్చుకున్నవారిని చూశామని, కానీ.. కులం పేరు మార్చుకున్న వ్యక్తిని ఈయననే చూస్తున్నామని వ్యాఖ్యానించారు. సచివాలయం కూల్చివేతను ‘ఆంధ్రా వలస పాలనకు ప్రతీక పతనం’ అంటూ రాశారని, నిజంగా ఆంధ్రా వలస ఆనవాళ్లను చెరిపేయాలంటే ముందుగా మార్చాల్సింది కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ పేరునని అన్నారు.


వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నప్పుడు, చినజీయరు స్వామిని సీఎం కుర్చీలో కూర్చో పెట్టి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు తెలంగాణ సెంటి మెంటు గుర్తుకురాలేదా? అని రేవంత్‌ ప్రశ్నించారు. నిండు శాసనసభలో.. ‘తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్రా’ అంటూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించిన విషయాన్ని మరిచి.. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌తో దోస్తీ చేస్తున్న కేసీఆర్‌.. తెలంగాణకు ప్రతీక ఎలా అవుతారని అన్నారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని బతికించింది ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లు కాదా? అని ప్రశ్నించారు. కరోనా సహాయక చర్యల కోసం దాతలు ఇచ్చిన రూ.4 వేల కోట్ల నిధుల్లో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 


సచివాలయాన్ని అర్ధరాత్రి కూల్చాల్సిన అవసరమేంటి?

సచివాలయంలో ఐదు చోట్ల గుప్త నిధులు ఉన్నట్లుగా 2012లో నమస్తే తెలంగాణ పత్రికే రాసిందని రేవంత్‌ తెలిపారు. మీడియాను కూడా అనుమతించకుండా సచివాలయాన్ని అర్ధరాత్రి రహస్యంగా కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన నల్లపోచమ్మ దేవాలయం, 132 ఏళ్ల కిందట ఆరో నిజాం కట్టిన మసీదును ఎలా కూల్చారని ప్రశ్నించారు. నిజాం సంపదను కొల్లగొట్టాలన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహారం ఉందని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నియోజకవర్గంలో ఒక మందిరాన్ని కూలిస్తే బీజేపీ ఎందుకు అజెండాగా తీసుకోలేదని, మసీదును కూలగొడితే అసదుద్దీన్‌ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.


చర్చలో ఫోన్‌ ద్వారా పాల్గొన్న జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ సచివాలయంలోని నిజాం కట్టడమైన జీ బ్లాక్‌లో రోజ్‌ ఉడ్‌, మహాగనీ వంటి ఖరీదైన కలప వాడారని, ఆ కలపతో చేసిన కుర్చీలు, టేబుళ్లు.. కలప ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై విచారణ కోసం జ్యుడీషియరీ కమిషన్‌ వేయాల్సిందిగా కోర్టును కోరతానని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ తెలిపారు.

Updated Date - 2020-07-29T08:15:51+05:30 IST