‘గాంధీ’లో రోజూ వెయ్యి మందికి ఎంపీ రేవంత్ నిత్యాన్నదానం

ABN , First Publish Date - 2021-05-16T16:43:03+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ రోగుల

‘గాంధీ’లో రోజూ వెయ్యి మందికి ఎంపీ రేవంత్ నిత్యాన్నదానం

హైదరాబాద్/అడ్డగుట్ట : గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ రోగుల కుటుంబాలు, సహాయకులకు నిత్యాన్నదానం చేస్తామని ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. సోనియాగాంధీ రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి వద్ద వెయ్యి మందికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామన్నారు.  గాంధీ ఆస్పత్రి వద్ద నిత్యన్నదానం కార్యక్రమాన్ని శనివారం రేవంత్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉండడంతో కరోనా బాధితుల సహాయకులకు తినేందుకు భోజనం దొరకడంలేదన్నారు. వీరి కోసం యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.


గాంధీ కొవిడ్‌ ఆస్పత్రి అయినా కనీస సౌకర్యాలు లేవన్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులు ఇతర సిబ్బందికి ప్రభుత్వం ఆహారం ఏర్పాటు చేయలేదన్నారు. ఇక నుంచి ప్రతి రోజూ వెయ్యిమందికి భోజనం ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సెకెండ్‌ డోస్‌ అందించడానికి వ్యాక్సిన్‌ లేదని అన్నారు. వ్యాక్సిన్‌ లేకనే ఇలా డోసుల వ్యవధి పెంచుతున్నారన్నారు. టిమ్స్‌లో 8వ అంతస్తులో ఆక్సిజన్‌ దొరడంలేదని విమర్శించారు. ఆస్పత్రుల్లో మంచాలు, రెమిడిసర్‌ కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌ టీంలో వైద్యులు లేరని ఆరోపించారు. కార్పొరేట్‌ కంపెనీలను పిలిచి దండుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఒక వైపు జనం రెమెడిసివిర్‌ కోసం పాట్లు పడుతోంటే టీఆర్‌ఎస్‌ నేతల వద్ద రెమ్‌డిసివిర్‌ స్టాక్‌ పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడంలేదో చెప్పడంలేదన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా కోట్లల్లో బిల్లులు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 


గాంధీ ఆస్పత్రికి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆహార పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సమయంలో ఔట్‌సోర్సు విభాగంలో పనిచేస్తున్న లక్ష్మి. ఆస్పత్రి లోపలి భాగం నుంచి దండం పెడుతూ తమకు జీతాలు రావడంలేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇలా దండ్డం పెట్టింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీగార్డులు, పారిశుధ్య కార్మికులకు సరిగ్గా జీతాలు రావడం లేదని విన్నవించారు. (అడ్డగుట్ట - ఆంధ్రజ్యోతి)



Updated Date - 2021-05-16T16:43:03+05:30 IST