కొండా విశ్వేశ్వరరెడ్డితో రేవంత్‌రెడ్డి కీలక భేటీ

ABN , First Publish Date - 2021-07-13T23:28:20+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పీడు పెంచారు. ఓ వైపు పార్టీ బలోపేతంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న

కొండా విశ్వేశ్వరరెడ్డితో రేవంత్‌రెడ్డి కీలక భేటీ

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పీడు పెంచారు. ఓ వైపు పార్టీ బలోపేతంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర పార్టీలో అసంతృప్తి నేతలను ఆహ్వానించేందుకు ఆయన ఇప్పటికే సంకేతాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులోభాగంగా మంగళవారం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో రేవంత్‌రెడ్డి భేటి అయ్యారు. కొండా ఇంటికి వెళ్లి రేవంత్ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కొండాతో రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.


నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత విశ్వేశ్వరరెడ్డితో పలువురు నేతలు మంతనాలు జరిపారు. అయితే ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరలేదు. ఇటీవల మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుకముందు ఆయనతో విశ్వేశ్వరరెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓ ప్రత్యామ్యాయ వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచనతోనే ఈటలతో భేటీ అయినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు విశ్వేశ్వరరెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Updated Date - 2021-07-13T23:28:20+05:30 IST