Abn logo
Sep 20 2021 @ 20:25PM

రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ వెనుక వైడ్ యాంగిల్ ఏంటి?

హైదరాబాద్: ‘‘ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదు? ఐపీఎస్‌ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైంది?’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన సోమవారం ఉదయం గన్‌పార్క్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘అకున్ సబర్వాల్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. డ్రగ్స్ కేసు విచారణలో ఉండగానే అకున్ సబర్వాల్‌ని తప్పించారు. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకూ పబ్బులు వ్యాప్తి చెందాయి. విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైంది. కేటీఆర్‌కి బాధ్యత లేదా? పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు’’ అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘ఎవరు నేరగాళ్లనే చర్చ తర్వాత చేద్దాం. అమర వీరుల స్తూపం ముందు మేము రెడీగా ఉన్నాం. మా తండ్రి, తాత, ముత్తాత చరిత్ర కూడా చర్చిద్దాం. డ్రగ్స్ కేసు చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. మీ ఆస్తులు అడగడం లేదు. రానా, రకుల్ ప్రీత్ సింగ్‌ని ఈడీ పిలిచింది. వాళ్ళని నేను అంటుంటే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు. కేసులు వేస్తం అని బెదిరిస్తున్నారు. కేటీఆర్ నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నేను ఎమ్మెల్సీ అయ్యాను. నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే‌గా కేవలం 100 ఓట్లతోనే గెలిచావు.’’ అని రేవంత్ అన్నారు. 


దీంతో రేవంత్‌పై కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. సిటీ సివిల్‌ కోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధంలేని విషయాల్లో దురుద్దేశపూర్వకంగా.. తన పేరును వాడుతున్నారని కేటీఆర్‌ పిటిషన్‌‌లో పేర్కొన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని శిక్షించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రగ్స్‌ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరవుతున్న.. వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టును మంత్రి కోరారు. 

ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో  ‘‘టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విసురుతున్న వైట్ ఛాలెంజ్ వెనుక వైడ్ యాంగిల్ ఏంటి?. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి కేటీఆర్‌పై విమర్శలకి లింకేంటి?. రేవంత్ ఛాలెంజ్ కేటీఆర్ కౌంటర్ తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేస్తాయా?. యువ నేతల సవాళ్లు వైట్ ఛాలెంజ్ నుంచి లైడిటెక్టర్ పరీక్షల వైపు ఎందుకు మళ్లాయి?. కేటీఆర్‌ను వైట్ ఛాలెంజ్‌కు రమ్మనేందుకు రేవంత్ దీక్షలు చేయడం అవసరమా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



ఇవి కూడా చదవండిImage Caption