పేదలపై పగ!

ABN , First Publish Date - 2022-01-20T07:20:58+05:30 IST

పేదలపై పగ!

పేదలపై పగ!

ఇంటి స్థలం క్రమబద్ధీకరణపై దగా!

మాటతప్పి.. మడమ తిప్పిన జగన్‌

రూపాయికే 100 గజాలు రెగ్యులరైజ్‌ చేస్తామని 2019లో జీవో 463 జారీ

తర్వాత దానికి భిన్నంగా మరో ఉత్తర్వు

75 గజాలు దాటితే 70% విలువ కట్టాలి

150 గజాలపైన 100% విలువ చెల్లించాలి

78 గజాలకు 14 లక్షల డిమాండ్‌ నోటీసు

ఒకే దఫా చెల్లించాలని హుకుం

దరఖాస్తు చేసుకుని దొరికిపోయిన పేదలు

లక్షలకు లక్షలు కట్టలేరు.. ఇల్లు వదులుకోలేరు

సర్కారీ మోసంపై నిరుపేదలు లబోదిబో


అధికారంలోకి వచ్చీరాగానే పేదలపై వరాల వర్షం కురిపించారు. నిరుపేదలు కొద్దిపాటి ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకుని ఉంటే ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేస్తామంటూ 2019 నవంబరు 6న జీవో 463 జారీ చేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి పరిపాలనను చీకట్లోకి మార్చిన తర్వాత మరో  రహస్య జీవో 225ని జారీ చేశారు. క్రమబద్ధీకరించే భూమి విస్తీర్ణాన్ని 100 నుంచి 75 గజాలకు కుదించారు. 75 గజాల వరకే ఉచితంగా రెగ్యులరైజ్‌ చేస్తామని.. అదనంగా ఒక్క గజం దాటినా 70% విలువ చెల్లించాలని షరతు పెట్టారు. అంటే మరో అంశంలో కూడా జగన్‌ మాట తప్పారు.. మడమ తిప్పేశారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): నిలువ నీడలేని పేదలు, సామాన్యులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుని ఉంటుంటారు. అందులో ప్రభుత్వానికి అభ్యంతరకరమైన  భూముల్లో (చెరువులు, కుంటలు, అప్రూవ్డ్‌ లే అవుట్‌లు, ప్రజోపయోగమైనవిగా ప్రకటించిన భూములు, మాస్టర్‌ప్లాన్‌, జోనల్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌, రోడ్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ వంటివాటి పరిధిలోకి వచ్చేవి) ఇళ్లు నిర్మించుకుని ఉంటే క్రమబద్ధీకరించరు. అభ్యంతరం లేని భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటే 100 గజాల వరకు పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించేవారు. 100 గజాలపైనే ఉంటే భూమి విలువ ఆధారంగా రెగ్యులరైజ్‌ చేసేవారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జీవో 388 ఆధారంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 100 గజాల వరకు పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించేవారు. 101 నుంచి 250 గజాల వరకు భూమి మూల విలువ లో 15 శాతం మేర ఫీజు వసూలు చేసి రెగ్యులరైజ్‌ చేశారు. 251 నుంచి 500 గజాల వరకు 30 శాతం ఫీజు వసూలు చేశారు. 500 గజాలపైన ఉన్న భూములను వేలంలో విక్రయించడం లేదా ప్రభుత్వమే ఆ భూమిని హస్తగతం చేసుకోవడం చేసేది. జగన్‌ సర్కారు వచ్చాక ఈ జీవోను సమీక్షించారు. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు నూతన విధానం అంటూ 2019 నవంబరు 6న జీవో 463 జారీ చేశారు. 100 గజాల వరకు భూమిని ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేస్తామని.. 100 నుంచి 300 గజాల వరకు పేదలు ఆక్రమించుకుని ఉంటే జిల్లా కలెక్టర్‌ నిర్ణయించే ధర ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.


సంపన్న వర్గాలు ప్రభుత్వ భూమిని 300 గజాల మేర ఆక్రమించుకుని ఉంటే కలెక్టర్‌ నిర్ణయించే ధర ఆధారంగానే రెగ్యులరైజ్‌ చేయాలని ఆదేశించారు. క్రమబద్ధీకరణ పరిమితిని 300 గజాల వరకే అనుమతించారు. కటాఫ్‌ డేట్‌ (భూమిపై పొజిషన్‌లో ఉన్న కాలం)ను 2019 అక్టోబరు 15గా నిర్ణయించారు. అంటే అప్పటికే ఆ భూమిపై పొజిషన్‌ లో ఉండి, ఇల్లు కట్టుకుని ఉంటే నిబంధనల ప్రకారం వారికి ఆ భూమిని రెగ్యులరైజ్‌ చేయాలని జీవో 463 చెబుతోంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న 4 లక్షల మంది రెగ్యులరైజేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 


అంతలోనే దొంగదెబ్బ..

ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఊరించిన జగన్‌ సర్కారు.. తర్వాత తన అసలు రూపం బయటపెట్టుకుంది. భూమి క్రమబద్ధీకరణ పెద్ద ఆదాయ మార్గమని గుర్తించి.. గుట్టుగా పాలసీని మార్చేసింది. గత ఏడాది ఆగస్టు 23న జీవో 225ని జారీ చేసింది. అప్పటికే  జీవోలను రహస్యంగా ఉంచుతున్న సర్కారు దీనిని కూడా బయటకు రానివ్వలేదు. బయటికొస్తే లోగుట్టు బట్టబయలవుతుందని గెజిట్‌లోనూ పొందుపరచలేదు. ఆ జీవోను పరిశీలిస్తే అందులో ఎంత మోసం ఉందో తెలిసిపోతోంది. పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించే భూమిని 100 నుంచి 75 గజాలకు తగ్గించారు. పేదలకు 75 గజాల వరకే ఉచితంగా రెగ్యులరైజ్‌ చేయాలని.. ఒకవేళ వారు ఆక్రమించుకున్న భూమి 76 గజాలున్నా.. భూమి కనీస ధరలో 75 శాతం ఫీజు వసూలు చేయాలని నిర్దేశించారు. 150 గజాలు ఆక్రమించుకుని ఉంటే 75 శాతం, 300 గజాల వరకు ఆక్రమించుకుని ఉంటే 100 శాతం బేసిక్‌ విలువను వసూలు చేసి రెగ్యులరైజ్‌ చేయాలని రహస్య ఉత్తర్వులో పేర్కొన్నారు. రెగ్యులరైజేషన్‌కు కటాఫ్‌ టాఫ్‌డేట్‌ను 2019 నవంబరు 15గా నిర్ణయించారు. జీవో 463 ప్రకారం కటాఫ్‌ డేట్‌ 2019 అక్టోబరు 15 కాగా.. ఇప్పుడు 225 జీవో ప్రకారం కటాఫ్‌ డేట్‌ 2019 నవంబరు 15. దీనిని బట్టి జీవో 463 ప్రకారం పేదలకు క్రమద్ధీకరణలు చేయలేదనే అర్థమవుతోంది.


ఇదీ మోసం..?

75 గజాల భూమిని ఉచితంగానే క్రమబద్ధీకరించి డీకేటీ పట్టా రూపంలో ఇస్తామని చెప్పారు కదా.. ఇందులో మోసం ఏముందనుకుంటున్నారా? ఇందులోనే అసలు మోసం ఉంది. 75 గజాల్లో పేదలు ఎలాంటి ఇళ్లు కట్టుకోగలరు? కనీసం నలుగురు సభ్యులు ఉండే ఓ పేద కుటుంబం ఇల్లు కట్టుకోవాలం టే 100 నుంచి 150 గజాలపైనే భూమి కావాలి. అందుకే గత ప్రభుత్వాలు 100 గజాల మేర పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించాయి. మిగతా 50 గజాల భూమికి బేసిక్‌ విలువలో 15 శాతం ఫీజును వసూలు చేశాయి. జగన్‌ సర్కారు వచ్చాక దానిని ఎత్తివేశారు. క్రమబద్ధీకరించే భూమిని 100 నుంచి 75 గజాలకు కుదించారు. ఎలాగూ పేదలు కట్టుకునే ఇల్లు 75 గజాలపైనే ఉంటుందని అంచనావేసి, దాని క్రమబద్ధీకరణ ఫీజును భూమి బేసిక్‌ విలువలో 75 శాతంగా నిర్ణయించారు. ఇది మోసం కాదా? కొత్త ట్విస్టు ఏమిటంటే.. ఒకవేళ పేదలు ఎవరైనా 75 గజాల్లోపే ఇల్లు కట్టుకుని ఉన్నా.. వరండా, ఇతర ప్రాంతం కలిపి 76 గజాలు దాటితే వాటికి ఉచితం వర్తించ దు. ఆ భూములకు అంటే.. 75 శాతం బేసిక్‌ విలువ కట్టితీరాల్సిందే. జీవో 225 ప్రకారం భూముల క్రమబద్ధీకరణకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్‌ నడుస్తోంది. సర్వేలు పూర్తయ్యాయి. అనేక ప్రాంతాల్లో రెగ్యులరైజేషన్‌కు ఫీజులు ఏ మేరకు చె ల్లించాలో నిర్దేశిస్తూ డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న రెండు నెలల్లో ఒకేదఫా డబ్బు చెల్లించాలని స్పష్టం చేస్తున్నారు. జీవో 225 చాలా టె క్నికల్‌గా ఉంది. ఆచరణలోకి వచ్చేసరికి అది మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. రెగ్యులరైజేషన్‌ పేరిట భారీగా ప్రభుత్వ ఖజానా నింపుకోవాలన్న ఏకైక తలంపుతోనే ఈ జీవో తెచ్చినట్లుగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అందులోని కీలకమైన నిబంధనలను బయటకు రానివ్వడం లేదు.


ఓ ఉదాహరణ..

కృష్ణా జిల్లా విజయవాడ నార్త్‌ మండలం ముత్యలంపాడు గ్రామం పరిధిలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఓ పేద మహిళ జీవో 225 ప్రకారం భూమి క్రమబద్ధీకరణకు గత ఏడాది అక్టోబరు 20న దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ఆక్రమించుకున్న భూమి 78 గజాలు ఉందని, సబ్‌ డివిజన ల్‌ అప్రూవల్‌ కమిటీ నిర్దేశించిన ఫీజు రూ.14.91 లక్షలు చెల్లించి రెగ్యులరైజ్‌ చేయించుకోవాలని రెవెన్యూ అధికారులు నిరుడు నవంబరు 22న డిమాండ్‌ నోటీసు పంపించారు. నోటీసు అందిన రెండు నెలల్లోగా ఒకే విడతగా 14.91 లక్షల రూపాయలు సీఎఫ్‌ఎమ్‌ఎస్‌లో డిమాండ్‌ డ్రాఫ్టు లేదా చలానా రూపంలో చెల్లించాలని ఆదేశించారు. గడువులోగా డబ్బు చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక పేద మహిళ వద్ద 14 లక్షల సొమ్మే ఉంటే దర్జాగా భూమి కొనుక్కునేది.


సొంతంగా ఇల్లు కట్టుకునేది. నిలువనీడలేకనే ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని ఇల్లు వేసుకుంటే 14 లక్షలు ఫీజు కట్టమంటే ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? పైగా ఆ ఫీజును ఏ ప్రాతిపదికన ఖరారు చేశారు? విజయవాడ నగర శివారు ప్రాంతంలో భూమి బేసిక్‌ విలువను ఏ ప్రాతిపదికన లెక్కించినా అంత రాదని నిపుణులు చెబుతున్నారు.పేదల నుంచి సొమ్ము దండుకోవడానికే జీవో 225 ఉన్నట్లుగా ఉందని ఆక్షేపిస్తున్నారు. జగనన్న మేలు చేస్తారన్న నమ్మకంతో లక్షలాది మంది భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నామని లిఖితపూర్వకంగా రాసిచ్చి ప్రభు త్వం చేతికి తమ జుత్తు అందించినట్లయింది. ఫీజులు చెల్లించాలని సర్కారు డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పుడు పేదలు వెనక్కి పోలేరు. అలాగని లక్షల రూపాయలు చెల్లించలేరు. 

Updated Date - 2022-01-20T07:20:58+05:30 IST