Abn logo
Aug 10 2020 @ 05:36AM

కథపై పగబట్టాలి!

ఈ ప్రపంచానికి చెడు చేసేవాళ్ళకంటే మేధావుల మౌనంవల్లే ఎక్కువ నష్టం జరుగుతోందని నెపోలియన్‌ ఏనాడో చెప్పాడు. విషయానికొస్తే, 27.07.2020 వివిధలో వచ్చిన ‘కథలు పగపడతాయా’ అన్న శ్రీ బి. తిరు పతిరావుగారి వ్యాసం కూడా డెరీడా చెప్పిన మంచి కొటేషన్‌తో మొదలవుతుంది. మనిషికి ఎన్నో ఆలోచనలొస్తాయి. కొన్ని అవే క్షణంలో మరచిపోతే ఇంకొన్ని మనిషిని వెంటాడి కలచి వేస్తాయి. కవులైతే కవిత్వం ద్వారానో, కథ ద్వారానో దానికి ఒక రూపాన్నిచ్చి సేద తీర తారు. నోరుగలవాళ్ళు ఇంకో విధంగా ఇతరు లతో పంచుకుని కడుపులోని గ్యాస్‌ తగ్గించు కుంటారు. ఇవేవీ చేయలేనివాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళే ఎక్కువ కదా ఈ ప్రపంచంలో! అందుకే ఆ వ్యాసం చద వండి, ఇంతకుముందు చదవకపోతే. ఆ వ్యాసంలో భాగంగా అనువదించిన ఎ.కె. రామానుజన్‌ సేకరించిన కథ ‘ఎ స్టోరీ అండ్‌ ఎ సాంగ్‌’ ప్రతి కథా రచయిత చదివి తీరాలి. మన వాళ్ళు పాటిస్తున్న ప్రతి మూఢనమ్మకానికి ఒక సైన్సు కారణాన్ని కల్పించి చెప్పే నేటి కీలక సమయంలో ఆ కోణం నుండి కాక సమాజానికి మంచిని చేయాలన్న కోణం నుండి మనం చూడాలి. ఆ కథలో భర్తకు భార్యపై అనుమానం కలగడానికి కారణం ఒక కథ, ఒక పాట. అవి మనసులో ఉన్నా భార్య ఎవరితోనూ పంచు కోక అవి చెప్పు లుగా, చొక్కాగా మారడమే భర్త అనుమానానికి కారణం. కారణం తెలుసుకున్న భర్త మారిపోతాడు. ఆ కథలో ఉన్న కొన్ని వెసులుబాట్ల వల్ల కథ సుఖాంతంగా మారుతుంది. 


కథకులకు ఉండే పెద్ద సమస్యను ఈ వ్యాసంలో తడిమారు తిరుపతిరావు. కథ మనసులో దాగి ఉంటుంది. దాన్ని ఎలా మొదలుపెట్టాలి, ఎలా ముగించాలి, పాత్రల పేర్లేమి, సంఘటనలు, మధ్యలో వ్యాఖ్యానాలు, ముగింపు ఇలా కథ పేపరుపైకి లేదా స్ర్కీన్‌ పైన దించేవరకు మనసులోని ఆ భారం దిగదు. కవిత రాసేసినంత సులభంగా కథ మనల్ని ముందుకు పోనివ్వదు. కథలు ఎలా రాయాలి అన్న విషయంపై ఎన్ని పుస్తకాలు వచ్చినా అవి కథా రచయితను చిన్నపిల్లలను వేలుపట్టు కొని నడిపించినంత సులువుగా ఏమీ ఉండదు వాస్తవంలో. ఎందుకంటే ప్రతి కథా ఒక ప్రయోగమే. రచయితను ముప్పు తిప్పలుపెట్టే విషయంలో కథకు ఎలాంటి సెంటి మెంట్లు ఉండవు. కథ అంద రినీ ఒకేవిధంగా చూస్తుంది, సతా యిస్తుంది. అది వేరే విధంగా ప్రవర్తిస్తే ఇంకా ఎన్నో కథలు ఆ కథా ప్రపంచా నికి దొరికేవి, ఎందరో కథకులూ దొరికే వాళ్ళు. అందుకే కథకులు కథపై పగ బట్టాలి. దాన్ని ఎలాగైనా లొంగదీసు కొని పాఠక లోకానికి, కథా జగత్తుకు విలువైన కథల్ని అందించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారాలంటే ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిల్లో ప్రయత్నాలు చెయ్యాలి. నేను సైతం అంటూ ప్రపంచాన్ని ముందుకు నడి పించేవాళ్ళకు దన్నుగా నిలబడాలి. ఎలాగైనా కథను అందుకు ఉపయోగించాలి.

జంధ్యాల రఘుబాబు

98497 53298


Advertisement
Advertisement
Advertisement