పగబట్టిన రాజకీయం!

ABN , First Publish Date - 2020-06-14T05:51:58+05:30 IST

ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాలు అధికారం తలకెక్కి లెక్కలేనితనం ప్రదర్శిస్తున్నాయనడానికి దేశంలోని వివిధ రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే నిదర్శనం. ప్రజలు మాకు అధికారం ఇచ్చారంటూ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా నిరంకుశ...

పగబట్టిన రాజకీయం!

జగన్మోహన్‌రెడ్డి పాలన ఫ్యాక్షనిస్టు తరహాలో సాగుతోందన్న భావన రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ వంటివి మరింత వివాదాస్పదం అవుతాయి. అచ్చెన్నాయుడు అరెస్టును సమర్థించుకోవడానికై అధికార పార్టీ నాయకులు పలు వ్యాఖ్యలు, హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ మరింత రాజకీయం అయింది. జగన్‌ అండ్‌ కో శాశ్వతంగా అధికారంలో ఉండదు. అప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్లు కచ్చితంగా ప్రతీకారానికి పాల్పడతారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీలో చేరడానికి అంగీకరించే వరకు గ్రానైట్‌ క్వారీలో పర్మిట్లు కూడా నిలిపివేయించారు. కండువా మార్చుకోగానే పర్మిట్లు జారీ అయ్యాయి. ఇలా అయితే వ్యాపారాలు ఉన్నవారు అధికార పార్టీలనే ఆశ్రయించాలన్న సందేశం ఇచ్చినట్టే కదా! ఈ పరిణామాలు రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళతాయో ఊహించడానికే భయంగా ఉంది. అయితే ఇలాంటివారే ‘‘అవినీతిని సహించం, గతంలో అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తప్పవు’’ అని కేకలు వేయడం ఎబ్బెట్టుగా ఉంటోంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే అవినీతి కేసులలో విచారణ జరుగుతోంది.


లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు అడ్డం, పొడవు మాటలు చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ప్రజలను గాలికి వదిలేయడం ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘‘ఇక మా వల్ల కాదు.. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి’’ అని ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రజలు వారి తిప్పలు వారు పడతారు కదా? తొలి దశలో లాక్‌డౌన్‌కు సహకరించిన ప్రజలు.. ఇప్పుడు ఆంక్షలు సడలించడంతో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇటు ప్రజల్లో బాధ్యతారహిత ధోరణితో వైరస్‌ అదుపు తప్పుతోంది. ప్రారంభ దశలో వలస కార్మికుల సమస్యను విస్మరించి హడావుడిగా లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వాలు.. ఆ తర్వాత వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపడం వల్ల వైరస్‌ విస్తృతికి కారణం అయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో ఇప్పుడు వైద్యులు కూడా వైరస్‌ బాధితులుగా మారారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పలువురికి వైరస్‌ సోకింది. ఫలితంగా ఇతరత్రా వైద్యం కోసం ఆసుపత్రులకు కూడా వెళ్లలేని దుస్థితి.


ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాలు అధికారం తలకెక్కి లెక్కలేనితనం ప్రదర్శిస్తున్నాయనడానికి దేశంలోని వివిధ రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే నిదర్శనం. ప్రజలు మాకు అధికారం ఇచ్చారంటూ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా నిరంకుశ పోకడలకు పోవడం వల్ల న్యాయస్థానాలు తరచుగా జోక్యం చేసుకోవలసి వస్తోంది. ప్రభుత్వాలకు బాధ్యత గుర్తుచేయాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు తార్కాణం. చట్టబద్ధమైన పాలనను అందించడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలను కట్టడి చేయవలసిన కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో బిజీగా ఉంటున్నారు. ఫలితంగా వివిధ రాష్ట్రాలలో హైకోర్టులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటోంది. కరోనా వైరస్‌ విషయమే తీసుకుందాం. ‘చెత్తలో శవాలా?’ అంటూ ఏకంగా సుప్రీంకోర్టుసైతం ధర్మాగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి! కరోనాని కట్టడి చేయడానికై రెండు నెలల క్రితం లాక్‌డౌన్‌ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు ప్రజల ముందుకొచ్చి గంభీర ఉపన్యాసాలు చేశారు. ‘అంతన్నాడు, ఇంతన్నాడే గంగరాజు...’ అన్నట్టుగా తొలుత రక్షకులుగా పోజులిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు.


తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో కరోనా విస్తరిస్తున్నప్పటికీ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగంలో పలువురికి కరోనా సోకి పాలనే కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కొంత నాటకీయత జోడించినప్పటికీ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్న భావనను దేశ ప్రజలలో వ్యాపింపజేయగలిగారు. తొలుత కరోనా బాధితులను కాపాడుతున్న వైద్యులకు, ఇతర సిబ్బందికి చప్పట్ల ద్వారా ప్రోత్సాహం ఇవ్వాలని ప్రధాని ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా స్పందించారు. ఆ తర్వాత ఇళ్లల్లో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించమంటే.. ఆ పని కూడా చేశారు. మరోదఫా వైద్య సిబ్బందిపై పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమాలన్నీ మొదట్లో ప్రజలను కూడా ఆకర్షించాయి. నెలన్నర గడిచేసరికి ప్రభుత్వాల ఆదాయం పడిపోతున్న విషయాన్ని గ్రహించి మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతించారు. దీంతో ‘‘అన్నీ అయిపోయాయి. ఇప్పుడు తీర్థం కూడా ఇస్తున్నారు’’ అని సామాజిక మాధ్యమాలలో ఛలోక్తులు వ్యాపించాయి. తొలుత ప్రజలనుద్దేశించి పదేపదే ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఇప్పుడు కరోనా వైరస్‌ గురించి మాట్లాడటం లేదు. వైరస్‌ కట్టడి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నట్టుగా చేతులు దులుపుకొన్నారు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద రాష్ట్రాలకు నిర్దుష్టమైన ఆదేశాలు ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.


గుజరాత్‌లో ఒకటి, రెండు రాజ్యసభ స్థానాలను అదనంగా గెలుచుకోవడం కోసమై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో భారతీయ జనతా పార్టీ పెద్దలు బిజీగా ఉన్నారు. అలాగే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌ తరహాలో కూలగొట్టడం ఎలా? అన్న దానిపై కూడా ఆ పెద్దలు తమ మేధస్సుకి పదును పెడుతున్నారు. దీంతో కరోనా బారి నుంచి ప్రజలను కాపాడాల్సిన అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో తీరిక లేకుండా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయానికి వస్తే.. ప్రారంభంలో కరోనాపై అధికారులతో సుదీర్ఘ సమావేశాలు జరిపి, ఐదారు పర్యాయాలు నిర్వహించిన విలేఖరుల సమావేశాల్లో ఏడెనిమిది గంటలకుపైగా గంభీర ఉపన్యాసాలిచ్చిన ఆయన.. ఇప్పుడు కరోనా వైరస్‌ కబళిస్తున్నప్పటికీ కనీసం గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నట్టు కనబడుతున్నారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ప్రైవేటు ఆసుపత్రులలో పరీక్షలు చేయించుకుందామనుకుంటే ‘కుదరదు’ అని మొండికేసింది. నెల రోజులపాటు కరోనానే ప్రధాన సమస్యగా పరిగణించి సమీక్షలు నిర్వహించిన కేసీఆర్‌.. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేనే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నియంత్రిత పంటల సాగుపై ఇప్పుడు ఆయన దృష్టి సారించారు. దీంతో రాష్ట్రానికి ఆయువు పట్టు అయిన హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. జిల్లాలకూ విస్తరిస్తోంది. ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే కాదు.. అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా వైరస్‌ సోకింది. మంత్రి హరీశ్‌రావు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిన దుస్థితి! ఈ నేపథ్యంలో ‘‘అనుమానితులకు కనీసం పరీక్షలైనా చేయించండి.. వైరస్‌ కారణంగా మృతి చెందారనుకున్న వారికి కూడా పరీక్షలు జరిపించండి..’’ అని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ‘‘పరీక్షలు జరపడంతోపాటు వైరస్‌ బారిన పడినవారికి చికిత్స అందించడానికి ప్రైవేటు ఆసుపత్రులను కూడా అనుమతించండి’’ అని న్యాయస్థానం నిర్దేశించింది. అయితే కేసీఆర్‌ ప్రభుత్వం ఈ ఆదేశాలను లెక్కచేయడం లేదు. దీంతో ‘‘మా ఆదేశాలను అమలుచేయకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవలసి వస్తుంది’’ అని అధికారులపై హైకోర్టు కన్నెర్రజేసింది.


అటు ముఖ్యమంత్రిని ఎదురించలేరు.. ఇటు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయలేరు. దీంతో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. నియంతలను తలపింపజేసే విధంగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు అడ్డం, పొడవు మాటలు చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ప్రజలను గాలికి వదిలేయడం ఏమిటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘‘ఇక మా వల్ల కాదు.. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి’’ అని ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రజలు వారి తిప్పలు వారు పడతారు కదా? తొలి దశలో లాక్‌డౌన్‌కు సహకరించిన ప్రజలు.. ఇప్పుడు ఆంక్షలు సడలించడంతో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ఇటు ప్రజల్లో బాధ్యతారహిత ధోరణితో వైరస్‌ అదుపు తప్పుతోంది. ప్రారంభ దశలో వలస కార్మికుల సమస్యను విస్మరించి హడావుడిగా లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వాలు.. ఆ తర్వాత వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపడం వల్ల వైరస్‌ విస్తృతికి కారణం అయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో ఇప్పుడు వైద్యులు కూడా వైరస్‌ బాధితులుగా మారారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది పలువురికి వైరస్‌ సోకింది. ఫలితంగా ఇతరత్రా వైద్యం కోసం ఆసుపత్రులకు కూడా వెళ్లలేని దుస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయానికి వద్దాం. ఈ వైరస్‌ను ఆయన మొదటి నుంచీ సీరియస్‌గా తీసుకోలేదు. ‘‘కరోనా వస్తుంది.. పోతుంది..’’ అని ఆయన తేల్చిపారేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇప్పుడు పాలకులు అందరూ చెబుతున్న ‘‘కరోనాతో సహజీవనం చేయాల్సిందే..’’ అన్న మాటను అందరికంటే ముందే జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రారంభంలో అధికారులతో సమావేశాలు జరిపినట్టు ప్రకటించి, వీడియో సందేశాలు విడుదల చేసిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు కరోనా ఊసే ఎత్తడం లేదు.


తనదైన రాజకీయ ఎజెండాను అమలు చేసుకోవడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలతో ఘర్షణకు దిగడానికి కూడా ఆయన వెనుకాడటం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవి నుంచి రమేశ్‌కుమార్‌ను తొలగించడానికై జారీ చేసిన ఆర్డినెన్స్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారితో ఆటలా? ఇలాంటి ఆర్డినెన్స్‌లు ఎలా జారీచేస్తారు?’’ అని ధర్మాసనం ధర్మాగ్రహం వ్యక్తంచేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ హడావుడిగా ఎందుకు సంతకం చేశారో ఆయనే చెప్పాలి. రాజ్యాంగబద్ధమైన సంస్థల విషయంలో గౌరవంతో మెలగాలన్న సున్నితత్వం లేదు కనుక.. జగన్‌ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు కూడా చెవికి ఎక్కడంలేదు. ‘‘సుప్రీంకోర్టు మమ్మల్ని ఏమీ అనలేదు. రమేశ్‌కుమార్‌కే నోటీసులు జారీ చేసింది. సమగ్ర విచారణ చేపడతామని చెప్పింది’’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించగలిగారంటే వారి మనస్తత్వం ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి ఉంటే న్యాయస్థానాలలో ఇన్ని వ్యాజ్యాలు దాఖలై ఉండేవి కావు. కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకోవలసిన దుస్థితి అధికారులకు ఏర్పడేది కాదు. రాజధర్మాన్ని పాటించవలసిన ముఖ్యమంత్రులు అందుకు విరుద్ధమైన పోకడలు పోవడం వల్లనే న్యాయస్థానాలపై అదనపు భారం పడుతోంది. రెండు నెలలకుపైగా లాక్‌డౌన్‌ విధించి కరోనా వైరస్‌ను అరికట్ట లేకపోగా ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిన ప్రభుత్వాధినేతలు.. ఇప్పుడు తమకేమీ తెలియదు, తమ బాధ్యత ఏమీ లేదు అన్నట్టుగా వ్యవహరించడం విషాదం. ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన ప్రతిపక్షాలు ఉండటం ఎంత అవసరమో తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గుర్తుచేస్తున్నాయి.


టార్గెట్‌ విపక్షం!

తెలంగాణలో ప్రతిపక్ష నాయకులను అడుగు ముందుకు వేయకుండా గృహ నిర్బంధాలు చేయిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన గొంతుకలు కూడా రాష్ట్రంలో మూగబోయాయి. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నాయి. కేసీఆర్‌ను అగ్రజుడుగా పరిగణిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక ఆకు ఎక్కువే చదివినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో ఆయన ఉన్నారు. దీంతో జగన్‌ కంటే కేసీఆర్‌ మెరుగు అన్న అభిప్రాయం కలిగిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, తప్పుబట్టినా కేసులు పెడుతూ వచ్చారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి రెండు సందర్భాలలో ఇదే పని చేయిస్తే ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గర్జించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ.. ఇప్పుడు ఇన్ని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ నోటికి తాళం వేసుకున్నారు. ప్రతిపక్షానికి చెందిన నాయకుల అరెస్టులు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. శుక్రవారం తెలతెలవారుతూనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్‌ చేయగా, శనివారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని అరె‌స్ట్‌ చేశారు. మందుల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలతో అచ్చెన్నాయుడుకి నిజంగా సంబంధం ఉంటే ఆయనను అరెస్టు చేయడంలో తప్పు లేదు. కాకపోతే అరెస్టు చేసిన తీరు అనుమానాలకు తావిస్తోంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి విషయంలో కూడా అక్రమాలు జరిగి ఉంటే, ఆయనపై చర్యలు తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే రాష్ట్రంలో గత ఏడాది కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకున్నప్పటికీ అనుమానించే పరిస్థితి ఉంది. నిజంగా తప్పు చేసిన వాళ్లు కూడా తనను అక్రమంగా అరెస్టు చేశారనే చెబుతారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయమే తీసుకోండి. అవినీతి కేసులలో సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసినప్పుడు కూడా అక్రమం, అన్యాయం అనే నినదించారు.


జగన్‌ కుటుంబసభ్యులు రాజ్‌భవన్‌ ఫుట్‌పాత్‌పై బైఠాయించి మరీ తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికీ రాజకీయ కారణాలతోనే తమపై కేసులు పెట్టారని జగన్‌ చెబుతున్నారు. రాజకీయ నాయకులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. జగన్‌ సహ నిందితులైన ఐఏఎస్‌ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఇలాంటి ఆరోపణలు చేయకపోవడం గమనార్హం. రాజకీయాలలో కులాల ప్రస్తావన కూడా తరచుగా వస్తూ ఉంటుంది. జగన్మోహన్‌రెడ్డిపై కేసులు పెడితే ఆయన సామాజికవర్గం వాళ్లు నొచ్చుకుంటారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసులు పెడితే ఆయన సామాజికవర్గం వాళ్లు కినుక వహిస్తారు. బీసీలు, ఎస్సీలు అంటూ విమర్శించడం ఎప్పటి నుంచో ఉంది. తప్పును తప్పుగా.. ఒప్పును ఒప్పుగా చూడటానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరనిపిస్తోంది. ఈ కారణంగానే రాజకీయ నాయకులు తప్పు చేసినా కులం కార్డు కూడా ఉపయోగిస్తుంటారు. మన దేశంలో మాత్రమే ఉన్న దౌర్భాగ్యం ఇది. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు అధికారంలోకి రాగానే కులాల ప్రస్తావన ఎందుకు అంటూ దీర్ఘాలు తీస్తుంటారు. జగన్మోహన్‌రెడ్డి పాలన ఫ్యాక్షనిస్టు తరహాలో సాగుతోందన్న భావన రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపించిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ వంటివి మరింత వివాదాస్పదం అవుతాయి. అచ్చెన్నాయుడు అరెస్టును సమర్థించుకోవడానికై అధికార పార్టీ నాయకులు పలు వ్యాఖ్యలు, హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఇదే చివరిది కాదు.. జాబితాలో చాలా మంది ఉన్నారు. చంద్రబాబునాయుడుని కూడా అరెస్ట్‌ చేస్తాం’’ అని వైసీపీ నాయకులు హెచ్చరించారు. దీంతో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ మరింత రాజకీయం అయింది. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నింటా అవినీతి జరిగినందున చర్యలు తప్పవని మంత్రులు సైతం హెచ్చరికలు చేశారు. అంతకు ఒకరోజు ముందు ‘చంద్రన్న కానుక’ వంటి పథకంపై సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది.


ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రతిపాదన చేసినప్పుడు మంత్రులు చప్పట్లు కూడా కొట్టారట! ఒకప్పుడు ఇదే జగన్‌ అండ్‌ కో, వారి ఆధ్వర్యంలోని నీలి మీడియా సీబీఐని ‘పంజరంలోని చిలుక’ అని విమర్శించిన విషయం ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడు వారికి సీబీఐపై అంత ప్రేమ, నమ్మకం ఎందుకు కలిగాయో తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా ఏపీలో ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రానికి మంచి చేయవు. హుందాతనంతో నడవాల్సిన రాజకీయాలు కక్షపూరితం కావడం వల్ల చివరకు మిగిలేది వినాశనమే! జగన్‌ అండ్‌ కో శాశ్వతంగా అధికారంలో ఉండదు. అప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్లు కచ్చితంగా ప్రతీకారానికి పాల్పడతారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు విషయమే తీసుకుందాం. ఆయన వైసీపీలో చేరడానికి అంగీకరించే వరకు గ్రానైట్‌ క్వారీలో పర్మిట్లు కూడా నిలిపివేయించారు. కండువా మార్చుకోగానే పర్మిట్లు జారీ అయ్యాయి. ఇలా అయితే వ్యాపారాలు ఉన్నవారు అధికార పార్టీలనే ఆశ్రయించాలన్న సందేశం ఇచ్చినట్టే కదా! రాజకీయాలలో వ్యాపారులను ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలకు ఇలాంటి శాస్తి జరుగుతోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఎవరి వ్యాపారాలు వారు చేసుకునేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేరు. రాజకీయ పార్టీలతో సంబంధం లేనివారు కూడా కష్టపడి వ్యాపారం చేసి సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని కప్పం కట్టాల్సిన పరిస్థితులు కల్పించారు. ఈ పరిణామాలు రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళతాయో ఊహించడానికే భయంగా ఉంది. అయితే ఇలాంటివారే ‘‘అవినీతిని సహించం, గతంలో అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తప్పవు’’ అని కేకలు వేయడం ఎబ్బెట్టుగా ఉంటోంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రిపైనే అవినీతి కేసులలో విచారణ జరుగుతోంది.


ప్చ్‌.. ఏం హీరోయిజమో?

ఇప్పుడు సినీ ప్రముఖుల పోకడల విషయానికి వద్దాం. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ... ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ’’ అని సాహితీవేత్తలు చెబుతుంటారు. సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖుల వ్యవహార శైలి కృష్ణశాస్త్రిని గుర్తుకుతెస్తున్నది. తెలుగు ప్రజలు కరోనా వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతుంటే చిరంజీవి నేతృత్వంలోని కొంతమంది సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి తమకు విశాఖలో స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించడంతోపాటు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని కోరడం ఎబ్బెట్టుగా లేదా? దశాబ్దం క్రితమే విశాఖలో దివంగత రామానాయుడు నిర్మించిన స్టూడియో ఇప్పటికీ ఈగలు తోలుకుంటోంది. కరోనా కారణంగా మున్ముందు సినిమాల భవిష్యత్‌ ఏమిటో తెలియని స్థితిలో భూములు అడగటం ఎలా సమర్థనీయం? ఒకప్పుడు మద్రాస్‌కే పరిమితమైన చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తరలించాలన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి స్టూడియోలకు భూములు కేటాయించారు. పరిశ్రమకు చెందినవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దశాబ్దం గడిచినా ఇళ్ల నిర్మాణం జరగలేదు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్‌.టి.రామారావు వెంటనే ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో ఇప్పటి ఫిల్మ్‌నగర్‌ అభివృద్ధి చెందింది. ఇప్పుడు విశాఖలో ఇళ్ల స్థలాలు కావాలనుకుంటున్నవారు హైదరాబాద్‌ వదిలి విశాఖలో ఇళ్లు కట్టుకుని స్థిరపడతామని చెప్పగలరా? జగన్మోహన్‌రెడ్డిని కలిసినవారందరికీ హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన భవంతులు ఉన్నాయి.


కొంతమందికి ఫామ్‌హౌస్‌లు కూడా ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఓటీటీ ప్రాధాన్యం పెరిగింది. మట్టిలో మాణిక్యాలు వంటి అద్భుత నటులతో షార్ట్‌ ఫిల్మ్‌లు తీస్తున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీలతో తెర మీద అలరిస్తున్న హీరోలకు మున్ముందు ఆదరణ ఉండకపోవచ్చు. హైదరాబాద్‌లో ఉన్న స్టూడియోలే షూటింగులు లేక వెలవెలబోతున్నాయి. ఇక విశాఖలో స్టూడియోల అవసరం ఉంటుందా? షూటింగులకు అనుమతులు కావాలని కేసీఆర్‌, జగన్‌లను అర్థించారు. మంచిదే గానీ పెద్ద హీరోలుగా చలామణి అవుతున్నవారు ప్రస్తుత పరిస్థితులలో షూటింగులకు ఇష్టపడటం లేదు. మిగతావాళ్లకు 60 ఏళ్లు దాటాయి. 60 దాటినవాళ్లు షూటింగులలో పాల్గొనకూడదని ప్రభుత్వాలు షరతులు విధించాయి. ఇంతోటి దానికి అమరావతి వెళ్లి రైతులను కూడా కలవడానికి ఇష్టపడకుండా ముఖ్యమంత్రిని మాత్రమే కలిసి కోర్కెల చిట్టా ఇవ్వడాన్ని సదరు ప్రముఖులు ఎలా సమర్థించుకుంటారు? రాజధానిగా అమరావతినే కొనసాగిస్తానని జగన్‌ ప్రకటించి ఉంటే అదే రైతులు ఇచ్చిన భూములను తమకు స్టూడియోల కోసం, ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని ఇదే సినీ పెద్దలు కోరి ఉండేవారు కాదా? ఉమ్మడి రాష్ట్రంలో ఇస్తూ వచ్చిన నంది అవార్డుల ఊసెత్తని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వద్ద ఆ విషయాన్ని ప్రస్తావించడానికి కూడా సాహసం చేయలేని హీరోలు మనవాళ్లు! సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండిన దాసరి నారాయణరావు ఏ ముఖ్యమంత్రిని కలవకుండానే సినీ రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన బడుగుల పక్షాన నిలబడ్డారు. ఇతరులకు, ఆయనకు ఉన్న తేడా ఇదే!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-06-14T05:51:58+05:30 IST