రెవెన్యూ డివిజన్‌గా పొదిలి

ABN , First Publish Date - 2022-01-27T04:44:33+05:30 IST

పొదిలి రెవెన్యూ డివిజన్‌ చేయాలనే ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.

రెవెన్యూ డివిజన్‌గా పొదిలి
పొదిలి పట్టణ వ్యూ

ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌.. ఫలించిన ఎన్నో ఏళ్ల కల 


పొదిలి రూరల్‌, జనవరి 26 : పొదిలి రెవెన్యూ డివిజన్‌ చేయాలనే ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. డివిజన్‌ ఏర్పాటుపై ప్రభుత్వ ప్రకటన వెలువడగానే ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలోనే కందుకూరు డివిజన్‌ అతిపెద్ద డివిజన్‌గా పేరుపొందింది. జిల్లాలోని 27 మండలాలతో ఉన్న కందుకూరు డివిజన్‌ను విభజించి జిల్లా నడికూడలిగా ఉన్న పొదిలిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలనే ప్రతిపాదన దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉంది. తాజా ప్రకటనతో చిరకాల కల నెరవేరనుంది. 


పొదిలి డివిజన్‌లోని మండలాలు...

దర్శి నియోజకవర్గంలోని దొనకొండ, దర్శి, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు, మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, పామూరు మండలాలను కలుపుకొని పొదిలి రెవెన్యూ డివిజన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


దొనకొండ మండలం, ముండ్లమూరు మండలాల ప్రజలు కందుకూరు వెళ్లాలంటే 120 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి. పొదిలి పట్టణం అన్ని మండలాలకు సమదూరంలో ఉంటుందని పొదిలిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దర్శి నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన అప్పటి మంత్రి శిద్దా రాఘవరావు దర్శిలో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని పట్టుబట్టడంతో అప్పట్లో ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుపై వెనుకడుగువేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నూతన రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు అనివార్యమైంది. పొదిలిలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మండలంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొదిలి పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రిపూడి మండలాన్ని పొదిలి మండల పరిధిలో చేర్చాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం మర్రిపూడి మండలాన్ని కందుకూరు డివిజన్‌లో ఉంచడంతో ఆ మండల ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. మర్రిపూడి మండలం నుంచి కందుకూరు వెళ్లాలంటే 60 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాలి. పరిపాలనా సౌలభ్యం కోసం మర్రిపూడి మండలాన్ని కూడా పొదిలి డివిజన్‌లో చేర్చాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మొత్తమ్మీద ఎన్నోఏళ్ల నిరీక్షణ ఫలించింది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో పొదిలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశిద్దాం. 


మర్రిపూడి ప్రజల ఆశలు గల్లంతు

మర్రిపూడి, జనవరి 26 : ప్రభుత్వం నూతన రెవెన్యూ డివిజన్‌లను ప్రకటించడంతో మర్రిపూడి మండల ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. పొదిలి రెవెన్యూ డివిజన్‌ ప్రక్రియ అస్తవ్యస్తంగా మా రింది. గతంలో పొదిలి తాలూకాలో ఉన్న మర్రిపూడిని మండలాల ఏర్పాటు సమయంలో మర్రిపూడి మండలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్నుంచి పొదిలిని రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసి మర్రిపూడి మండలాన్ని అందులో విలీనం చేయాలని మండల ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. ఆ మేరకు గతంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం మర్రిపూడి మండలం కందుకూరు డివిజన్‌ పరిధిలో ఉంది. మండల కేంద్రం నుంచి డివిజన్‌ కేంద్రానికి వెళ్లేందుకు ప్రజలు 70 కి.మీ మేర ప్రయాణించాల్సి వస్తుంది. దీనివలన అవసరార్థులు తీవ్ర వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో విలీనం చేస్తున్నారు. దీంతో కందుకూరు నెల్లూరు జిల్లా పరిధిలోకి వెళుతుంది. ఆ డివిజన్‌ పరిధిలోని కొండపి నియోజకవర్గ పరిధిలోని మండలాలైన పొన్నలూరు, కొండపి, జరుగుమల్లి, సింగరాయకొండ, మర్రిపూడిలను ఏ డివిజన్‌ పరిధిలో కలుపుతారో అర్థం కానీ పరిస్థితి నెలకొన్నది. మర్రిపూడి మండలానికి కూతవేటు దూరంలో ఉన్న పొదిలి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే మర్రిపూడి మండలాన్ని మాత్రం సమీపంలో ఉన్న పొదిలి రెవెన్యూ డివిజన్‌లో కలపాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అందరికీ సౌలభ్యంగా ఉండే విధంగా డివిజన్‌ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2022-01-27T04:44:33+05:30 IST