Abn logo
Aug 4 2020 @ 04:58AM

రెవెన్యూ సమస్యలతో సతమతం

మంథని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ జనం ప్రదక్షిణలు 

పరిష్కరించే వారిలో పట్టింపు కరువు


మంథని ఆగస్టు 3: మంథని డివిజన్‌ ప్రజలు రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్నారు. డివిజన్‌, నియోజకవర్గ కేంద్రమైన మంథని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏడాది కాలంగా సమస్యలు తిష్ట వేశాయి. ప్రతీ రోజు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కార్యాలయంలో పని చేస్తున్న వివిధ స్థాయిలో ఉన్న అధికారులు సైతం వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో బాధితులు చేసేది ఏమి లేక వెనుదిరుగుతున్నారు. నూతన పట్టాలు, పట్టా మార్పిడి, విరాసత్‌, భూముల క్రయవిక్రయాలు, సరిహద్దుల వివాదాలు, జారీ చేసిన పాసుబుక్కుల్లో తప్పుఒప్పుల సవరింపు, సర్వే నంబర్ల ఆన్‌లైన్‌లతో పాటు తదితర  సమస్యల పరిష్కారం ఆర్జీలు, ఆధారాలతో వివిధ గ్రామాల నుంచి నిత్యం తహసీల్దార్‌ కార్యాలయం వచ్చే బాధితులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి ఆవేదనతో వెనుదిరుగుతున్నారు.


మంథని మండలం పుట్టపాక వద్ద ప్రవేశించి గాజులపల్లి, మైదుపల్లి, సూరయ్యపల్లి, కాకర్లపల్లి, ఎక్లాస్‌పూర్‌, ఖానాపూర్‌ చివరి ఆయకట్ట వరకు సాగునీటిని అందించే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు డీ-86 కెనాల్‌కు ఇరువైపుల గల సర్వే నంబర్లలోని దాదాపు 1800 ఎకరాలకు సంబంధించిన సుమారు 1600 మంది రైతులకు ఈ వానాకాలం సీజన్‌లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. రైతులు ఆశగా ఎదురు చూసే రైతు బంధు వారికి అందకుండా నిరాశనే మిగిల్చింది. ఈ విషయమై బాధిత రైతులు వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆన్‌లైన్‌లో సర్వే లేవని చెప్పడంతో బాధిత రైతులంతా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.


నేటికీ వారి సమస్య పరిష్కారం కాలేదు. కరోనా సాకుతో కార్యాలయంలోకి ఎవరినీ రానియ్యకుండా అడ్డుకోవడంతో పాటు గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలోనే దరఖాస్తులు వేయాలని సూచించారు. ఇందులో ప్రజలు వేసిన పలు దరఖాస్తులు, ఆర్జీలు పరిష్కారానికి నోచుకోక పోవడంతో అవి బుట్టదాఖలు అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ల ద్వారా అడ్డదారిలో వెళ్లే వారికి ఆఫీస్‌లో పనులు చకచక జరిగి పోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


తహసీల్దార్‌కు అదనపు బాధ్యతలు..

తహసీల్దార్‌కు మంథని మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ప్రజలు తహసీల్‌ కార్యాలయం నుంచి మున్సిపల్‌కు.. మున్సిపల్‌  కార్యాలయం నుంచి తహసీల్‌ కార్యాలయానికి తిరగవలసి వస్తున్నది. కరోనా సాకు చూపి తహసీల్దార్‌ కార్యాలయంలోని ఛాంబర్‌లో సైతం గతంలో ఉన్న కుర్చీలు తొలగించారు. దీంతో కొద్ది నెలలుగా ఏదైన సమస్యపై దరఖాస్తులు ఇచ్చేందుకు  వచ్చే మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, సీనియర్‌ సిటిజన్స్‌, దివ్యాంగులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఎంతసేపైనా నిలబడే తహసీల్దార్‌తో మాట్లాడి దరఖాస్తులు ఇస్తున్నారు.  హరితహారంలో రాష్ట్రమంతా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుండగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న మొక్కలను, గ్రీనరీ తలపించే విధంగా ఏర్పాటు చేసిన స్థలంలోని మొక్కలను సైతం తొలగించిన తీరు విమర్శలకు తావిస్తోంది. కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించి మంథని తహసీల్‌లో పరిపాలన సవ్యంగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తున్నాం..

బాధితుల నుంచి వస్తున్న ఆరోపణలపై తహసీల్దార్‌ అనుపమరావును వివరణ కోరగా నిబంధనల మేరకు అర్హులైన వారి రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిబంధనల మేరకు లేని వారు తమ పనులు కాకపోవడంతో ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు వస్తే చైర్‌ ఆఫర్‌ చేస్తున్నామన్నారు. కార్యాలయ అవరణలో బాధితులతో చర్చించే వారి గురించి ఆరా తీస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో కార్యాలయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. 


పట్టించుకున్న వారే లేరు..బోనగిరి లక్ష్మి, విలోచవరం

విలోచవరంలో సర్వే నం. 60లో తన మామ బోనగిరి లింగయ్య ద్వారా వారసత్వంగా లభించిన ఎకరం భూమి విరాసత్‌ ద్వారా తన పేరు మీదకు పట్టా మార్చుకొని ప్రభుత్వ రైతు బంధు, రైతు బీమా పథకాన్ని అందుకునేందుకు ఏడాది కాలంగా మంథని తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. ఎన్ని సార్లు తహసీల్దార్‌, కింది స్థాయి అధికారులను కలిసి  సమస్య చెప్పుకున్నా, అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదు. పట్టించేకునే వారు ఇబ్బందులు పడుతున్నాను. 


డిజిటల్‌ సంతకం కోసం నెలల తరబడి..అనుముల వెంకట్రాజం, గాజుపల్లి

గాజుపల్లిలో సర్వే నం. 206 లో తాత, తండ్రి వారసత్వంగా వచ్చిన 23 గుంటల భూమిని నా పేరు ఆన్‌లైన్‌ చేయటానికి తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం కోసం నెలల తరబడి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. పలుమార్లు తహసీల్దార్‌ను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రైతు బంధు, బీమాకు నోచుకోకుండా పోతున్నాను. ఆర్డీవో, కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చనా సమస్య పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు పడుతున్నాను. 

Advertisement
Advertisement