Abn logo
Oct 23 2021 @ 01:18AM

సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ స్పందన

పామూరులో అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

దొనకొండ, అక్టోబరు 21 : మండలంలోని 14 సచివాలయాల కార్యాలయాల్లో గురువారం, శుక్రవారం రెండు రోజులు నిర్వహించిన రెవెన్యూ స్పందన కార్యక్రమంలో మొత్తం 315 అర్జీలు ప్రజల నుంచి వచ్చినట్ల్లు తహసీల్దార్‌ కే.వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజల నుంచి అందిన అర్జీలను నిర్ణీత కాలంలో విచారించి  సమస్యలు పరిష్కరిస్తామని తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ పి సురేష్‌, ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, వీఆర్వోలు పాల్గొన్నారు.

తాళ్లూరు : గ్రామాల్లో భూసమస్యలు, పట్టాదార్‌ పాసుపుస్తకాల్లో పేర్లుతప్పులు, భూములసర్వే సమస్యలు,భూములఆన్‌లైన్‌ పేరులో సమస్యలు  పరిష్కారం రెండవరోజు 75 అర్జీలు అందాయని తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య తెలిపారు.  రెండవరోజు రెవెన్యూ స్పందన కార్యక్రమాల్లో  శుక్రవారం ఆయన పాల్గ్లొన్నారు. మ్యుటేషన్‌ పట్టాదార్‌ పాసుపుస్తకాలకు 18అర్జీలు, అడంగల్‌ కరెక్షన్‌కు 31, భూములసర్వే కోసం 22, ఇతర సమస్యలకు 4 అర్జీలు అందజేశారన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్‌ఐలు ఇమ్మానియోల్‌రాజు, ప్రశాంత్‌, వీఆర్వోలు, సచివాలయ సర్వేయర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పామూరు : గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న  భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక రెవెన్యూ స్పందన గ్రామసభలు నిర్వహిస్తుందని రైతులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించు కోవాలని చిలంకూరు సర్పంచ్‌ మలినేని శ్రీనివాసులు, దాదిరెడ్డిపల్లి సర్పంచ్‌ బద్దిపూడి శారమ్మలు అన్నారు. మండలంలోని చిలంకూరు గ్రామ సచివాలయంలో రెవెన్యూ స్పందన రెండవరోజు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. మండలంలోని 19 గ్రామ సచివాలయాల్లో 191 అర్జీలు అందినట్లు తహశీల్దార్‌ సీహెచ్‌ ఉష తెలిపారు. 

వెలిగండ్ల : సచివాలయాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ స్పందనను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌  జ్వాల నరసింహం అన్నారు. శుక్రవారం మండలంలోని 12 సచివాలయాల్లో జరుగుతున్న రెవెన్యూ స్పందన కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం గుడిపాటిపల్లి సచివాలయంలో సర్పంచ్‌ కటికల రిబ్కా వెంకటరత్నం, తహసీల్దార్‌ నరసింహంలు రైతుల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మండలంలోని గ్రామ సచివాలయాలలో నిర్వహించిన రెవెన్యూ స్పందన కార్యక్రమంలో రెండవరోజు శుక్రవారం 128 అర్జీలు వచ్చినట్లు ఆర్‌ఐ విజయ్‌భాస్కర్‌ తెలిపారు. త్వరలోనే ప్రజలు ఇచ్చిన అర్జీలకు పరిష్కరిస్తామన్నారు.

ముండ్లమూరు : దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ స్పందనలో అర్జీలు ఇచ్చి సమస్యలను పరిష్కరించు కోవాలని తహసీల్దార్‌ పీ పార్వతి, ఎంపీడీవో బీ చంద్రశేఖరరావులు రైతులకు సూచించారు. శుక్రవారం రెవెన్యూ స్పందన రెండవరోజు మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం, నాయుడుపాలెం, ముండ్లమూరు గ్రామాల్లో జరిగిన సభల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో జరిగిన స్పందనకు 124 దరఖాస్తులు వచ్చినట్టు తహసీల్దార్‌ పార్వతి తెలిపారు. వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో వీఆర్‌వోలు జీ కోటయ్య, తేజ, దయానందం, సర్వేయర్లు వీ వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.