Abn logo
Jul 29 2021 @ 02:47AM

మునిసిపాలిటీలకు ఆదాయ గండం

  • భవన నిర్మాణ అనుమతుల మంజూరు బాధ్యత కలెక్టర్లకు
  • మునిసిపల్‌ కమిషనర్ల అధికారానికి కత్తెర
  • ఆగస్టు 15 నుంచి అమల్లోకి కొత్తవిధానం!
  • అనుమతుల కోసం చెల్లించే ఫీజులు ఎవరికి చెందుతాయో చెప్పని సర్కారు
  • నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరితే మునిసిపాలిటీల ఆదాయానికి తప్పని గండి


హైదరాబాద్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల అధికారాలకు కత్తెర వేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంతో ఆయా సంస్థల ఆదాయానికి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి. భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేసే అధికారాన్ని మునిసిపల్‌ కమిషనర్ల నుంచి తప్పించి.. జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సర్కారు నిర్ణయించడంతో అనుమతుల కోసం ఫీజు రూపంలో వచ్చే ఆదాయం మునిసిపాలిటీలకు దక్కుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీఎ్‌స-బీపాస్‌ చట్టం ప్రకారం ఈ అధికారాలను కలెక్టర్లకు బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో అనుమతులు శరవేగంగా వస్తాయని అంటోంది. ఆగస్టు 15 నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, అనుమతులకు సంబంధించి ఫీజు రూపంలో వచ్చే ఆదాయంపై మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో ఈ ఫీజు మునిసిపాలిటీలకే చెందుతుందా? లేక నేరుగా ప్రభుత్వానికి వెళుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి మునిసిపాలిటీలకు వచ్చే ఆదాయంలో ఆస్తి పన్ను, వాణిజ్య పన్నుతోపాటు భవన నిర్మాణ అనుమతుల ఫీజులు కూడా కీలకమైనవి. 


మొత్తం ఆదాయంలో ఈ ఫీజుల రూపంలోనే 25 శాతం దాకా మునిసిపాలిటీలకు సమకూరుతుంది. దీనితో వాటి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటారు. ఒకవేళ ఈ ఫీజులను ప్రభుత్వ ఖజానాకు వెళ్లేలా చేస్తే అది మునిసిపాలిటీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. మునిసిపాలిటీలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి స్థానిక సంస్థలు, మునిసిపాలిటీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేసేందుకే 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పలు అధికారాలను వాటికి కల్పించారు. ఆర్థిక సంఘాలతోపాటు పలు కమిటీలు కూడా ఈ ఆవశ్యకతను వివరించాయి. కానీ, భవన నిర్మాణ అనుమతులను వేగంగా మంజూరు చేసే పేరుతో అందుకు సంబంధించి ఫీజుల రూపంలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఈ ఆదాయాన్ని లాక్కుంటే.. ఈ సంస్థలను బలహీనపరచడమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం భూముల విలువలు పెంచిన సందర్భంలో రిజిస్ట్రేషన్‌ ఫీజుల్లో నుంచి స్థానిక సంస్థలకు చెందాల్సి 0.5 శాతాన్ని రద్దు చేసింది. ఇప్పుడు నిర్మాణ అనుమతుల ఆదాయం కూడా రాకుండా పోతే అవి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇప్పటిదాకా అనుమతులిచ్చిన కమిషనర్లు

టీఎస్ -బీపాస్‌ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా మునిసిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులను స్థానిక మునిసిపల్‌ కమిషనర్లే ఇస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానం ప్రకారం.. దరఖాస్తుదారులు తమ భవన నిర్మాణ దరఖాస్తులను టీఎ్‌స-బీపాస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వీటిలో ఐదు అంతస్తుల లోపు భవన నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు టీఎ్‌స-బీపాస్‌ నుంచి నేరుగా సంబంధిత మునిసిపాలిటీలు/మునిసిపల్‌ కార్పొరేషన్లకు వెళ్తాయి. ఆ మునిసిపాలిటీలోని టౌన్‌ప్లానింగ్‌ అధికారి.. భవన నిర్మాణ ప్రాంతాన్ని తనిఖీ చేస్తారు. ఆపై సైట్‌ విజిట్‌ రిపోర్టు రాసి.. దానిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. దానిని మునిసిపాలిటీ పరిశీలించి సంబంధిత ప్రొసీడింగ్స్‌ ఇస్తుంది. ఈ మేరకు నిర్దేశిత ఫీజును దరఖాస్తుదారు డీడీ రూపంలో మునిసిపాలిటీకి చెల్లించాలి. ఐదు అంతస్తులకు మించిన నిర్మాణాలకు అనుమతులకైతే దరఖాస్తులు టీఎస్-బీపాస్‌ నుంచి స్థానిక మునిసిపాలిటీలు/కార్పొరేషన్లకు వెళతాయి. అక్కడి టౌన్‌ప్లానింగ్‌ అధికారి.. భవన నిర్మాణ ప్రాంతాన్ని తనిఖీ చేసి, విజిట్‌ రిపోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అనంతరం అది డీటీసీపీకి వెళ్తుంది. 


అక్కడ భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు. అన్నీ సరిగా ఉంటే డ్రాయింగ్‌ పాస్‌ అయినట్లు మునిసిపాలిటీ/కార్పొరేషన్‌కు పంపుతారు. ఆ తదుపరి అనుమతులకు సంబంధించి నిర్దేశించిన ఫీజును దరఖాస్తుదారు డీడీ రూపంలో చెల్లించాలి. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో ఐదు అంతస్తులకు మించిన భవన నిర్మాణమైతే హెచ్‌ఎండీఏకు వెళ్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనైతే ఎన్ని అంతస్తుల నిర్మాణాలకైనా అనుమతులను గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషనే ఇస్తుంది. అయితే ప్రస్తుతం దరఖాస్తుదారుడి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఆధారంగా  ముందుగానే భవన నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారు. ఆ తరువాత క్షేత్రస్థాయిలో సంబంధిత భవన నిర్మాణ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. అప్పుడు.. నిబంధనల ప్రకారం ఉంటే సరి. లేదంటే ఆ నిర్మాణాలను కూల్చివేయడమో (ఒకవేళ నిర్మాణం జరిగితే), నిర్మాణాన్ని నిలిపివేయడమో చేస్తున్నారు. 


ఇబ్బందులు రెట్టింపు! 

భవన నిర్మాణ అనుమతుల బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తే ప్రజలకు ఇబ్బందులు రెట్టింపవుతాయని కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అంటున్నారు. నిత్యం బిజీగా ఉండే కలెక్టర్లు ఈ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలరా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉందని, చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి మొత్తానికే తిరస్కరిస్తారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.


దరఖాస్తులు నేరుగా కలెక్టర్‌కే..

ఇప్పటిదాకా అమలవుతున్న విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకడనుండడంతో ఇకపై మునిసిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన దరఖాస్తులన్నీ టీఎ్‌స-బీపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికే వెళ్తాయి. అక్కడి నుంచి మళ్లీ మునిసిపల్‌ కార్యాలయానికి వస్తాయి. వీరు క్షేత్రస్థాయికి వెళ్లి భవన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. నిబంధనల మేరకు ఉంటే అనుమతులు మంజూరు చేయవచ్చని సిఫారసు చేస్తారు. మునిసిపల్‌ కమిషనర్‌ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్‌ భవన నిర్మాణ అనుమతులను మంజూరు చేస్తారు. ఇంతవరకు బాగానే ఉందనుకున్నా.. నిర్మాణ అనుమతులకు ఫీజు రూపంలో వచ్చే ఆదాయం సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ప్రజలకు రెట్టింపు కానున్న ఇబ్బందులు! 

భవన నిర్మాణ అనుమతుల బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తే ప్రజలకు ఇబ్బందులు రెట్టింపవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా సమస్య వస్తే మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్లి క్లియర్‌ చేసుకోవచ్చని, కలెక్టర్‌ కార్యాలయానికి ప్రతిసారీ వెళ్లే పరిస్థితి ఉండదని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అన్నారు. నిత్యం అనేక ఫైళ్లతో బిజీగా ఉండే కలెక్టర్లు ఈ వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలరా? అన్న అనుమానాలు ఉన్నాయన్నారు. భవన నిర్మాణ అనుమతులు స్థానికంగా ఉండే మునిసిపాలిటీలు, హెచ్‌ఎండీఏకే ఉండాలని, దీంతో వీటి ఫీజులను స్థానిక అభివృద్ధికే ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుందని మణికొండకు చెందిన ఓ రియల్టర్‌ అన్నారు. కలెక్టర్లకు ఈ అధికారాన్ని కట్టబెడితే భారీస్థాయిలో అవినీతికి చోటుచేసుకునే ప్రమాదం ఉంటుందని, చిన్న చిన్న లోపాలను సాకుగా చూపి మొత్తానికే తిరస్కరించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.