Abn logo
Jul 5 2020 @ 05:45AM

మాన్యంలో పట్టాలు

దేవుడి భూమిని తీసుకున్న రెవెన్యూ

పంట దున్నించిన అధికారులు 

అన్యాయమంటున్న ఆలయ అర్చకులు

అభ్యంతరం చెబుతున్న గ్రామస్థులు


కర్నూలు-ఆంధ్రజ్యోతి: ఇంటి పట్టాలకు మాన్యాలనూ వదలడం లేదు. అర్చకులు, గ్రామస్థులు అభ్యంతరం చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దేవుడి భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో వారి తీరు వివాదాస్పదమవుతోంది. హాలహర్వి మండలం అమృతాపురం గ్రామంలోని సర్వే నెంబరు 119లో ఆదిలింగేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఇనాము భూములు 12.20 ఎకరాలు ఉన్నాయి. తరతరాలుగా వీటిని పూజారులు సాగు చేసుకుంటున్నారు. 2005లో అధికారులు ఈ భూమిని 119/ఏలో 4.90 ఎకరాలు, 119/2లో 4 ఎకరాలు 119/3లో 3.30 ఎకరాలుగా సబ్‌ డివిజన్‌ చేశారు. 119/ఏలోని 4.9 ఎకరాల్లో అమృతాపురం ప్రజలు గృహాలు నిర్మించుకున్నారు.


119/బీలో 4 ఎకరాలను 2005లో దేవదాయ శాఖ నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ నిమిత్తం కొన్నట్లు ప్రస్తుత తహసీల్దార్‌ సతీశ్‌ అంటున్నారు. ఈ మేరకు రికార్డుల్లో నమోదైంది. అయితే ఇప్పుడు లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుని మళ్లీ 133 మందికి పట్టాలు ఇవ్వడానికి సిద్ధం చేశారు. ఇందులో అమృతాపురం, బల్లూరు, సిద్ధాపురం, గూళ్యం గ్రామాల లబ్ధిదారులు ఉన్నారు. అయితే గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోకపోవడంతో పూజారులు సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాది పత్తి పంట వేశారు. ఇప్పుడు మళ్లీ ఇంటి పట్టాలు ఇవ్వడానికి ఆ పొలం స్వాధీనం చేసుకోడానికి రెవెన్యూ అధికారులు, పోలీసులు పంటను దున్నించారు. దీంతో గ్రామస్థులు ఇళ్ల స్థలాల పంపిణీకి ఎదురు తిరిగారు. తమ గ్రామానికి చెందిన దేవాలయ భూములను ఇతర గ్రామస్థులకు ఇవ్వడం ఏమిటని అధికారులను నిలదీశారు. వాస్తవానికి ఆలయ పూజారి 2006లోనే హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం స్పందించి పట్టాల పంపిణీ నిలిపేయాలని అప్పట్లో ఆదేశించింది. 


తాజాగా మళ్లీ..

2005లో ఇళ్ల పట్టాల కోసం కొన్న భూమి కాబట్టి 2006 నాటి తీర్పు ఇప్పుడు అమలుచేయలేమని అధికారులు అంటున్నారు. మళ్లీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పట్టాల పంపిణీ కోసం ఆ భూమిని అఽధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పట్టాల పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వోద్యోగులకు కోర్టు తేల్చి చెప్పింది. అయితే రెవెన్యూ రికార్డులు, ఆర్‌ఎస్‌ఆర్‌లోనూ సర్వే నెంబర్‌ ఆంజనేయస్వామికి చెందిన ఈనాం భూమిగా ఉంది. అధికారులు ఇచ్చిన అడంగల్‌లో మాత్రం ఆదిలింగేశ్వరస్వామి భూమిగా చూపుతుండడం గమనార్హం. దీంతో ఇది గందరగోళంగా మారింది. 


దేవదాయశాఖ జోక్యం

దేవదాయ శాఖ భూములను ఇళ్ల పట్టాలకు ఇవ్వకూడదని హాలహర్వి తహసీల్దారుకు ఆ శాఖ సహాయ కమిషనర్‌ మార్చి 9వ ఓ లేఖను పంపారు. అయినా సరే భూములను తీసుకుని అధికారులు పంపిణీకి సిద్ధమవుతున్నారు. 


అధికారుల వాదన ఇది.. 

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్నామని తహసీల్దార్‌ సతీష్‌ పేర్కొన్నారు. గెజిట్‌ ప్రకారం రెవెన్యూ భూమిగా భావించి అమృతాపురంలోని 119/ఏలో 4 ఎకరాల్లో పట్టాలు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామని అంటున్నారు. 


మంత్రి వద్దకు వెళ్లినా ఫలితం లేదు: రాజ్‌గోపాల్‌, గ్రామ పెద్ద, అమృతాపురం

దేవాలయ భూమి 4 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులు చెప్పడంతో కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను కలిశాం. అయినా ఫలితం కనిపించడం లేదు. 


అన్యాయం చేస్తున్నారు: ఆదిలింగస్వామి, పూజారి, అమృతాపురం

తరతరాలుగా ఈ భూమిని నమ్ముకుని 10 కుటుంబాల వాళ్లం జీవిస్తున్నాం. దీన్ని అధికారులు స్వాధీనం చేసుకుని పట్టాలు ఇవ్వడం ఏమిటి? పేదలకు వేరే భూమి ఇస్తే బాగుంటుంది. 


మా గ్రామస్థులకు మాత్రమే ఇవ్వాలి: బోజరాజు, గ్రామస్థుడు, అమృతాపురం

ఆలయ భూమిలో మా గ్రామస్థులకు మాత్రమే పట్టాలు ఇవ్వాలి. వేరే గ్రామస్థులకు ఇవ్వడం ఏమిటి. ఇది మంచి పద్ధతి కాదు. 


అప్పుడు కొనేసి మరిచిపోయాం: సతీశ్‌, హాలహర్వి తహసీల్దార్‌

2005లో ఈ భూమిని ఇళ్ల పట్టాల పంపిణీకి కొనుగోలు చేసి కేటాయించాం. లబ్ధిదారులు స్వాధీనం చేసుకోలేదు. అయితే తిరిగి మేం స్వాధీనం చేసుకోవడం మరిచిపోయాం. ప్రస్తుతం నవరత్నాలు పథకంలో భాగంగా తిరిగి ఇళ్ల పట్టాల కోసం ఆ భూమిని తీసుకున్నాం. చెప్పినా వినకుండా పంట వేశారు. అందువల్ల దున్నించి స్వాధీనం చేసుకున్నాం. 

Advertisement
Advertisement
Advertisement