నూతన జోన్ల ప్రకారమే రెవెన్యూ బదిలీలు

ABN , First Publish Date - 2021-11-27T08:51:59+05:30 IST

ఎట్టకేలకు రెవెన్యూ ఉద్యోగుల బదిలీలపై ఒక స్పష్టత వచ్చింది. 2016 నుంచి రెవెన్యూ శాఖలో బదిలీలు జరగని విషయం తెలిసిందే.

నూతన జోన్ల ప్రకారమే రెవెన్యూ బదిలీలు

  • వీఆర్వోలకు లేని బదిలీ ఆప్షన్లు
  • ఆయా జోన్లలో ఉన్న ఖాళీల ప్రకారమే...
  • రెవెన్యూలో పదోన్నతులు కల్పించే అవకాశం
  • రెండుజోన్లను ఏడు జోన్లుగా మార్పు


హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు రెవెన్యూ ఉద్యోగుల బదిలీలపై ఒక స్పష్టత వచ్చింది. 2016 నుంచి రెవెన్యూ శాఖలో బదిలీలు జరగని విషయం తెలిసిందే. అయితే.. నూతన జోన్ల ప్రకారమే బదిలీలు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. ఈ అంశంపై కసరత్తు దాదాపుగా పూర్తయిందని, ఈ నెలాఖరుకల్లా స్పష్టత రావచ్చని పేర్కొంటున్నాయి. బదిలీ ఆప్షన్లు కూడా జోనల్‌ సిస్టం ప్రకారమే ఉంటాయని చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ లాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. నూతన జోనల్‌ విధానంలో వీఆర్‌ఓలకు బదిలీ ఆప్షన్లు లేవని సమాచారం. ఆప్షన్ల ప్రకారం ఉద్యోగులు ఎంపిక చేసుకున్న జోన్‌లో ఉన్న ఖాళీలను బట్టి పదోన్నతులు ఉంటాయని తెలుస్తోంది. 


రెండు నుంచి ఏడు జోన్లుగా...

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు జోన్లను ప్రభుత్వం ఏడు జోన్లుగా మార్చింది. వీటిలో కొత్తగా రెండు బహుళ జోన్లను ఏర్పాటు చేసింది. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళ జోన్‌లో, విగిలిన మూడు జోన్లను మరొక బహుళ జోన్‌లో చేర్చింది. ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, బహుళ జోన్‌, రాష్ట్ర స్థాయి కేడర్లుగా మార్చి మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టాలని, రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన జోన్లకు సంబంధించిన ప్రతిపాదనలను 2018 మే నెలలో కేంద్రానికి పంపించగా... అవి ఆగస్టులోనే ఆమోదం పొందాయి. ఆ తర్వాత ప్రజల విజ్ఞప్తి మేరకు వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్చాలని, నారాయణపేట జిల్లాను జోగులాంబ జోన్‌లో, ములుగు జిల్లాను కాళేశ్వరం జోన్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో కొత్తజోన్లను అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జీవో-128ని విడుదల చేసిం ది. దీంతో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు బహుళ జోన్ల ప్రాతిపదికన కొత్త ఉద్యోగ నియామకాలు, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


బహుళ జోన్‌ల పరిధిలోకి వచ్చే జిల్లాలు 

మొదటి బహుళ జోన్‌లో- కాళేశ్వరం: ఆసిఫాబాద్‌-కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు జిల్లాలు, రెండో జోన్‌ బాసర: ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మూడో జోన్‌ రాజన్న: కరీంనగర్‌, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి, నాలుగో జోన్‌ భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ (గ్రామీణ), హన్మకొండ. రెండవ బహుళ జోన్‌ పరిధిలోని జిల్లాలను చూస్తే.. అయిదో జోన్‌ యాదాద్రి: సూర్యాపేట, నల్గొండ, భువనగిరి యాదాద్రి, జనగామ, ఆరవ జోన్‌ చార్మినార్‌: మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, ఏడవ జోన్‌ జోగులాంబ: మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌.

Updated Date - 2021-11-27T08:51:59+05:30 IST