PRC ప్రకటనపై Jagan Sarkar మళ్లీ పిల్లిమొగ్గ..!

ABN , First Publish Date - 2021-12-23T07:58:59+05:30 IST

ఒకసారి సలహాదారు సజ్జలతో సమావేశమంటారు.. ఇంకోసారి ఆర్థిక మంత్రి బుగ్గనతో భేటీ అంటారు..

PRC ప్రకటనపై Jagan Sarkar మళ్లీ పిల్లిమొగ్గ..!

  • మరో వారానికి వాయిదా
  • పీఆర్సీపై కొత్తగా చెప్పేదేం లేదన్న సీఎస్‌
  • జేఎ్‌ససీ సమావేశంలో మళ్లీ పాతపాటే
  • ఇచ్చుడు లేదు.. ఆసాంతం నాన్చుడే
  • 5.30గం.కు భేటీ.. 8.15కు వచ్చిన సీఎస్‌
  • చెప్పుకోండి.. వినిపెడతాం అన్నట్టు వైఖరి
  • సీఎస్‌ కమిటీని అమలుచేస్తే రోడ్లపైకి వస్తాం
  • మీతో కాకుంటే సీఎం దగ్గరకు తీసుకెళ్లండి
  • సీఎస్‌ వద్ద డిమాండ్‌ చేసిన ఉద్యోగ నేతలు
  • వచ్చే వారం తీసుకెళ్తానని సీఎస్‌ హామీ
  • సర్కారు తీరుపై ఉద్యోగ నేతల అసహనం
  • ఇదేమైనా కూరగాయల బేరమా అని ఆవేదన
  • అంతా నాన్చుడే! పీఆర్సీపై పిల్లిమొగ్గలే! 


ఒకసారి సలహాదారు సజ్జలతో సమావేశమంటారు.. ఇంకోసారి ఆర్థిక మంత్రి బుగ్గనతో భేటీ అంటారు.. మరోసారి ఈ ఇద్దరితో సమావేశమంటారు.. మధ్యలో సీఎం దగ్గరకు తీసుకెళ్తామంటారు.. మళ్లీ సీఎ్‌సతో సమావేశమంటారు.. సీఎస్‌ ఏమో సీఎం దగ్గరికి తీసుకెళ్తానంటారు.. పది రోజులుగా ఇదే తంతు! జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీకి ఉద్యోగులను బుధవారం మరోసారి పిలిచి ఇదే తతంగం నడిపిన ప్రభుత్వం.. ప్రకటనను మరో వారానికి వాయిదా వేసేసింది. 


అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): పీఆర్సీపై మళ్లీ పిల్లిమొగ్గ వేశారు. వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులనూ, ఎన్నో ఆశలతో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీకి వెళ్లిన ఉద్యోగ సంఘాలనూ నిరాశపరుస్తూ.. ఆ ప్రకటనను ప్రభుత్వం మరో వారం రోజులకు వాయిదా వేసేసింది. ‘ఇక నేను చెప్పేదేం లేదు.. చెప్పాల్సింది ముందే చెప్పేశాం.. ఏదైనా ఉంటే మీరే చెప్పండి... నా మాట అదే’ అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ.. ఈ  సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులకు తేల్చిచెప్పారు. ‘సీఎస్‌ కమిటీ నివేదికను అమలు చేసే పక్షంలో ఉద్యోగులను తీసుకొని రోడ్లపైకి వస్తామ’ని ఉద్యోగసంఘాల నాయకులు కూడా సీఎ్‌సకు స్పష్టం చేశారు. పీఆర్సీ సహా పలు డిమాండ్లపై అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు బుధవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, సాయంత్రం ఐదున్నరకు రావాల్సిన సీఎస్‌ రాత్రి 8:15 నిమిషాలకు వచ్చారు. ముప్పావుగంట పాటు సమావేశం జరిగింది. సమావేశం మొత్తంలో చాలాసేపు సీఎస్‌ మౌనంగానే ఉన్నారు. ఉద్యోగుల ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానాలు చెప్పారు. సమావేశానికి వచ్చీరాగానే సీఎస్‌ ఉద్యోగసంఘాల నేతలను ఉద్దేశించి ‘చెప్పండి’ అన్నారు.


అయితే, తమ డిమాండ్లు చెప్పేశామనీ, ఇక మీరే చెప్పండంటూ ఉద్యోగ సంఘాల నాయకులు తాము సిద్ధం చేసుకున్న గణాంకాలను సీఎస్‌ ముందుంచారు. 27 శాతం నుంచి 31 శాతం వరకు పీఆర్సీ అమలు చేస్తే ప్రతి నెలా ఎంత ఖర్చు అవుతుంది? సీఎస్‌ కమిటీ ఖరారు చేసిన 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తే ఏఎ్‌సవో, ఎస్‌వో, డిప్యూటీ తహసిల్దార్‌, సబ్‌ట్రెజరీ ఆఫీసర్‌, డిప్యూటీ ఎగ్జ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కి సంబంధించిన వేతనాలు ఎంతెంత తగ్గుతాయనేది ఏకరువు పెట్టారు. తాము తెచ్చిన గణాంకాల్లో రూపాయి తేడా ఉన్నా వదిలేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎ్‌సకు చెప్పారు. సీఎస్‌ కమిటీ నివేదికలో ఉన్న సిఫారసులు కాకుండా ఇంకేమైనా చెప్తారా ? ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం ? మీరు చెప్పలేకపోతే మమ్మల్ని సీఎం దగ్గరకు తీసుకెళ్లండని సీఎ్‌సను ఉద్యోగ సంఘాలనాయకులు అడిగారు.


అయితే, సీఎస్‌ కమిటీ నివేదికలోని 14.29 శాతం ఫిట్‌మెంట్‌పైనే సీఎస్‌ స్థిరంగా ఉన్నారు. సీఎస్‌ కమిటీ నివేదికను అ మలు చేసే పక్షంలో తాము ఉద్యోగులను తీసుకుని రోడ్ల మీదకొస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ఒప్పుకోబోమని సీఎ్‌సకు స్పష్టం చేశారు. దీంతో సీఎస్‌ ఉద్యోగసంఘాల నాయకులను సీఎం దగ్గరకు తీసుకెళ్తానని చెప్పారు. ఎప్పుడు అని ఉద్యోగ నేతలు అడగ్గా, కొంచెం సమయం పడుతుంది... వచ్చే వారం తీసుకెళ్తానని సీఎస్‌ చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాల్సిన వివిధ రకాల పెండింగ్‌ నిధులన్నీ ఒక్కసారిగాకాకుండా కొద్దికొద్దిగా మార్చి నాటికి ఇస్తామని సీఎస్‌ సమీర్‌ శర్మ ఉద్యోగసంఘాల నాయకులకు చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి లోను అడ్వాన్సులు, ఎల్టీసీ, మెడికల్‌ బిల్లులు, జీపీఎఫ్‌, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు కలిసి ప్రభుత్వం వద్ద రూ.1600 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని సీఎస్‌ చెప్పారు. కాదు.. అవి రూ.2,200 కోట్లు ఉన్నాయని ఉద్యోగులు వాదిస్తున్నారు.


సీఎం వద్దే తేల్చాలని కోరాం: బండి శ్రీనివాసరావు

సీఎం జగన్‌ వద్దే ఫిట్‌మెంట్‌పై తేల్చాలని సీఎ్‌సను సమావేశంలో కోరగా.. వచ్చేవారం పీఆర్సీపై సీఎంకు అన్ని వివరాలు చెప్పి, త్వరలో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్‌ చెప్పారని ఏపీ  జేఏసీ చైర్మన్‌ బండి  శ్రీనివాసరావు తెలిపారు. ‘‘అధికారుల కమిటీ సిఫారసులను అంగీకరించేదిలేదని సీఎస్‌కు స్పష్టం చేశాం. సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన 71 డిమాండ్లపై చర్చించాం. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.1600 కోట్ల విలువైన జీపీఎప్‌, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ బిల్లులు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ బెనిఫిట్స్‌ త్వరలోనే చెల్లిస్తామని అధికారులు చెప్పారు. మార్చిలోపు అన్ని క్లియర్‌ చేస్తామని తెలిపారు. పీఆర్సీపై అన్ని ఉద్యోగ సంఘాల నేతలం ఒకే మాటపై ఉన్నాం. పీఆర్సీపై మళ్లీ మాట్లాడాలన్న సీఎస్‌ ఆలోచనను మేం అంగీకరించలేదు. మళ్లీ మాట్లాడేదేలేదని.. సీఎం వద్దే ఫిట్‌మెంట్‌ తేల్చాలని కోరాం’’ అని బండి వెల్లడించారు. 


కాలయాపన తప్ప ఉపయోగం లేదు: బొప్పరాజు

జాయింట్‌స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలతో కాలయాపన తప్ప ఉపయోగంలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వరు అన్నారు. ‘‘గతంలో జరిగిన సమావేశాల్లో ఉద్యోగ సంఘాలుగా మా అభిప్రాయాలు తెలిపాం. సీఎం ఏం చెప్పారో, ప్రభుత్వం అభిప్రాయం ఏంటో ఇప్పటికీ మాకు చెప్పడం లేదు. అనేక సమావేశాలు పీఆర్సీపై ఇప్పటికే జరిగాయి. ఈ సమావేశంలో కూడా ఫిట్‌మెంట్‌పై స్పష్టత రాలేదు’’  అని బొప్పరాజు తెలిపారు. 


సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారు: వెంకట్రామిరెడ్డి

అధికారుల కమిటీ సీఎం జగన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నదని సచివాలయ ఉద్యగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ‘‘పీఆర్సీపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక అన్యాయంగా ఉంది. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. పీఆర్సీ వల్ల ఉద్యోగుల జీతాలు పెరగాల్సిందిపోయి కోతపడనుంది. 34 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తున్నాం. పీఆర్సీపై సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎ్‌సను కోరాం. వారంరోజుల్లో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్‌ హామీ ఇచ్చారు’’ అని వెంకట్రామిరెడ్డి తెలిపారు. కాగా పీఆర్సీ అంశానికి సీఎం జగన్‌ వెంటనే ముగింపు పలకాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. ‘‘ఐదేళ్లు ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబాలపై ప్రభావం చూపే పీఆర్సీపై కూరగాయల బేరంలా చర్చలు జరగడం బాధాకరం. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఈ వ్యవహారం ముగుస్తుందని నేను అనుకోవడం లేదు. వేతన సవరణ అంశానికి సీఎం ముగింపు పలకాలి’’ అన్నారు. 



Updated Date - 2021-12-23T07:58:59+05:30 IST