రివర్స్‌ కేసులు..!

ABN , First Publish Date - 2022-01-23T05:53:49+05:30 IST

రివర్స్‌ కేసులు..!

రివర్స్‌ కేసులు..!
గుడివాడలో శుక్రవారం టీడీపీ నేతల వాహనంపై బండరాయితో దాడిచేస్తున్న వైసీపీ నేత

గుడివాడ కేసినో వ్యవహారంలో పోలీసుల ఏకపక్ష ధోరణి

టీడీపీ నాయకుడు రమేశ్‌పై వైసీపీ నేతల దాడి

తిరిగి రమేశ్‌పైనే కేసు నమోదు

టీడీపీ ఫిర్యాదుపై మాత్రం స్పందన శూన్యం

నిజనిర్ధారణ బృంద సభ్యులు 27 మందిపై కేసులు


శుక్రవారం  జరిగింది ఇదీ..

గుడివాడలో కేసినో వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో నిజాలను నిగ్గు తేల్చేందుకు టీడీపీ.. నిజనిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృంద సభ్యులు శుక్రవారం గుడివాడ వెళ్తుండగా, అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు గుడివాడ చేరుకుని, పార్టీ కార్యాలయంలో ఉండగా, వైసీపీ కార్యకర్తలు, నాయకులు దాడికి పాల్పడ్డారు. బొండా ఉమా వాహనాన్ని ధ్వంసం చేశారు. తెలుగు రైతు నాయకుడు ముళ్లపూడి రమేశ్‌ చౌదరిని రక్తం వచ్చేలా కొట్టారు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగాయి. 


శనివారం  పోలీసుల తీరిదీ..

తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టేందుకు వెళ్లిన ముళ్లపూడి రమేశ్‌ను సాక్షాత్తూ సీఐ గోవిందరాజులు సమక్షంలో నిందితుడు కిషోర్‌ చంపేస్తానంటూ బెదిరించాడు. అయినా పోలీసులు ఏమీ చేయలేదు. పైగా రమేశ్‌పై రివర్స్‌ కేసు నమోదు చేశారు. వైసీపీ కార్యకర్త పెద్ది కిషోర్‌, మరికొందరు చేసిన దాడిలో తీవ్ర గాయాలైన రమేశ్‌పై స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులపై రమేశ్‌, శివ అనే వ్యక్తి దాడి చేశారనే కారణంతో ఈ కేసు నమోదు చేశారు. రమేశ్‌ ఫిర్యాదుపై మాత్రం స్పందించలేదు. 

గుడివాడ, జనవరి 22 : గుడివాడ కేసినో వ్యవహారంలో పోలీసుల ఏకపక్ష తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కె.కన్వెన్షన్‌ వేదికగా జరిగిన కేసినో నిర్వహణపై నిజనిర్ధారణ చేసేందుకు వచ్చిన టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేస్తే.. పోలీసులు మాత్రం రివర్స్‌ కేసులు నమోదు చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి టీడీపీ నాయకులపైనే కేసులు పెట్టి పోలీసులు స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. 

వర్ల రామయ్యపై కుట్ర కేసు

పోలీసులను విధినిర్వహణ చేయనీయకుండా అడ్డగించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి తదితరులపై పామర్రు పీఎస్‌లో కేసు నమోదు చేశారు. శుక్రవారం గుడివాడ వెళ్తున్న టీడీపీ నాయకులను పామర్రు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో సీసీఎస్‌ సీఐ బాలశౌరి టీడీపీ నాయకులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఏకవచనంతో సంబోధించారు. ఇదే విషయాన్ని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సీఐతో ప్రస్తావించారు. ప్రశాంతంగా వెళ్తున్న తమను ఎందుకు రెచ్చగొడుతున్నారని, ఏం ఆశించి ఇలా చేస్తున్నారని నిలదీశారు. కాసేపు వాగ్వాదం తర్వాత పోలీసులు టీడీపీ నాయకులను గుడివాడ వెళ్లనిచ్చారు. అయితే, శనివారం సీఐ బాలశౌరి ఫిర్యాదు మేరకు కుట్ర (120 బీ), రెడ్‌విత్‌ 341 ఐపీసీ, సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. న్యాయపోరాటం ద్వారా పోలీసుల తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. దాడి చేసిన వైసీపీ నాయకులపై తూతూమంత్రం కేసులు పెట్టి తమపై మాత్రం కుట్ర కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

27 మంది టీడీపీ నాయకులపై కేసులు

గుడివాడలో టీడీపీ నిజనిర్ధారణ బృందం పర్యటన సందర్భంగా 27 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. బృంద సభ్యులు కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, వర్ల కుమార్‌ రాజా, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, కాగిత కృష్ణప్రసాద్‌, దండమూడి చౌదరి, కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్‌, వల్లూరి కుమారస్వామి, గరిమెళ్ల చిన్నా, నందిగం వెంకటశివరావు, పల్లపోతు శివశంకరరావు, బొర్రా నాగరాజు, వలిశెట్టి విమలేష్‌, చిన్నం సురేష్‌, శొంఠి రామకృష్ణ, గోవాడ శివ, మజ్జాడ నాగరాజు, దేవరపల్లి కోటి, కాకరాల సురేష్‌, అడుసుమిల్లి కృష్ణయ్య, అడుసుమిల్లి శ్రీనివాసరావుపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారని వన్‌టౌన్‌ పీఎస్‌లో సీఐ గోవిందరాజులు కేసు నమోదు చేశారు. 

బొండా ఉమా ఫిర్యాదుతో వైసీపీ నేతలపై..

వైసీపీ నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్‌, మరికొంతమంది తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుతో పాటు టీడీపీ బృందం పర్యటనను అడ్డుకోవడానికి రహదారులపై బైఠాయించిన వైసీపీ నాయకులపైనా కేసు నమోదైంది. మొత్తం 20 మంది వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. 




Updated Date - 2022-01-23T05:53:49+05:30 IST