సినిమా.. రివర్స్‌ గేర్‌లో చూపించాడు

ABN , First Publish Date - 2020-08-12T05:49:06+05:30 IST

‘ఫ్లాష్‌బ్యాక్‌’ సినిమాలు చాలానే చూస్తూ ఉంటాం. కానీ ‘రివర్స్‌ గేర్‌’లో నడిచే చిత్రం ఎప్పుడైనా చూశారా? లేదంటే ఒక్కసారి ‘మనసా నమః’ షార్ట్‌ ఫిలిమ్‌ చూడండి. కాన్సెప్టే కాదు...

సినిమా..  రివర్స్‌ గేర్‌లో చూపించాడు

‘ఫ్లాష్‌బ్యాక్‌’ సినిమాలు చాలానే చూస్తూ ఉంటాం. కానీ ‘రివర్స్‌ గేర్‌’లో నడిచే చిత్రం ఎప్పుడైనా చూశారా? లేదంటే ఒక్కసారి ‘మనసా నమః’ షార్ట్‌ ఫిలిమ్‌ చూడండి. కాన్సెప్టే కాదు... మేకింగూ కొత్తగానే అనిపిస్తుంది. 28 ఏళ్ల హైదరాబాద్‌ యువకుడు దీపక్‌ రెడ్డి రూపొందించిన ఈ చిత్రం... అనుష్కా శెట్టి, రష్మికా మందాన వంటి టాలీవుడ్‌ తారలనూ మెప్పించింది. ఆ ‘కాన్సెప్ట్‌’ వెనక ఉన్న కథేంటో దీపక్‌ మాటల్లోనే... 




సినిమాలంటే నాకు మొదటి నుంచి పిచ్చి. దర్శకత్వం చేయాలని ఎప్పుడూ కలలు కంటుంటాను. ఆ లక్ష్యంతోనే 2013లో నాలుగు నిమిషాల నిడివిగల ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ లఘుచిత్రం తీశాను. అది హర్రర్‌ చిత్రం. యూట్యూబ్‌లో దానికి మంచి స్పందన వచ్చింది. టాలీవుడ్‌ దర్శకుడు సుకుమార్‌ ఫోన్‌ చేసి మరీ అభినందించారు. కానీ, సినిమాలకు డైరెక్షన్‌ చేయాలనే కోరిక అలానే మిగిలిపోయింది. అయితే అవకాశాల కోసం ఎవర్ని కలవాలి... ఎలా కలవాలో తెలియలేదు. ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చొనే కన్నా ముందు ఇంజనీరింగ్‌ డిగ్రీతో ఆగిపోయిన నా చదువును కొనసాగించాలనుకున్నా. అనుకున్నట్టుగానే అమెరికా వెళ్లి, అక్కడి ‘హూస్టన్‌ విశ్వవిద్యాలయం’ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశాను. 




శేఖర్‌ కమ్ముల దగ్గర... 

ఈ మధ్యలో ఓ విశేషం జరిగింది. మాస్టర్స్‌ చేస్తుండగా వేసవిలో భారత్‌కు వచ్చాను. ఆ సమయంలో నా స్నేహితుడొకరు... ‘దర్శకుడు శేఖర్‌ కమ్ముల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేస్తావా’ అని అడిగాడు. టెక్సాస్‌లో కొన్ని సన్నివేశాలు తీయాల్సి ఉందన్నాడు. మరో మాట మాట్లాడకుండా ఓకే అన్నాను. అలా అనుకోకుండా ‘ఫిదా’ సినిమాకు శేఖర్‌ కమ్ములకు అసిస్టెంట్‌ను అయ్యాను. ఆ తరువాత మళ్లీ నా చదువుపై దృష్టి పెట్టి, మాస్టర్స్‌ పూర్తి చేశా. 




ఎక్కడ ఉన్నా అదే ధ్యాస... 

అమెరికాలో ఉన్నానే కానీ, ధ్యాసంతా చిత్ర రంగంపైనే. డైరెక్టర్‌ను అవ్వాలనే! దీంతో పీజీ తరువాత అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదు. పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టాలని తిరిగి వచ్చేశాను. దర్శకుడిగా నా ప్రయాణం అక్కడే మొదలైంది. 


తారల అభినందనలు... 

ఇక తాజా లఘుచిత్రం ‘మనసా నమః’ విషయానికొస్తే... ఇది ఒక రివర్స్‌ గేర్‌ చిత్రం. అంటే ఒక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పినట్టు కాకుండా... కథ ప్రస్తుత కాలంలో నుంచి ఒక్కో సన్నివేశం వెనక్కి నడుస్తుంటుంది. ప్రయోగాత్మకంగా తీశాను. సరిగ్గా లాక్‌డౌన్‌ మొదలవ్వగానే యూట్యూబ్‌లో విడుదల చేశాను. విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పటికి 8 లక్షల మందికి పైగా వీక్షించారు. నా ప్రయత్నాన్ని మెచ్చుకొంటూ వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి. అన్నింటి కన్నా... నటి అనుష్కా శెట్టి ఈ వీడియోను ట్వీట్‌ చేయడం, మరో నటి రష్మిక మందాన అభినందించడం... అస్సలు నమ్మలేకపోతున్నా. ఈ ప్రశంసలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. అక్కడా 7 లక్షలకు పైగా వీక్షించారు. 


నటుల కోసం 45 ఆడిషన్లు... 

‘మనసా నమః’ ప్రధాన పాత్రధారులను ఎంపిక చేయడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. చాలామందిని పరిశీలించాను. నటీమణుల కోసమే 45 ఆడిషన్లు అవసరమయ్యాయి. వడపోయగా పోయగా చివరకు విరాజ్‌ అశ్విన్‌, దృషికలను తీసుకున్నాను. నటులు కుదిరారు. ఇక ప్రొడక్షన్‌... అదని ఇదని రకరకాల సమస్యలు దాటుకొని షూటింగ్‌ మొదలుపెట్టే సరికి మరో ఆరు నెలల సమయం పట్టింది. అయితే ఒక్కసారి షూటింగ్‌ ప్రారంభించాక నాలుగే రోజుల్లో చిత్రం పూర్తి చేసేశాను. వాస్తవానికి గత ఏడాదిలోనే పనంతా అయిపోయినా విడుదలలో జాప్యం జరిగింది. మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించాక... ఇదే సరైన సమయమని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాను. ఒక షార్ట్‌ ఫిలిమ్‌ కోసం ఇంత కష్టపడ్డానని చెబితే నమ్మడం కష్టమే. కానీ ప్రతి ఫ్రేమూ అనుకున్నట్టు వచ్చే దాకా రాజీ పడే మనస్తత్వం కాదు నాది. 


వారే నాకు ఆదర్శం... 

పాత తరం సినిమా దర్శకులంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల పనితనం బాగా నచ్చుతుంది. వారి చిత్రాల నుంచి నిత్యం పాఠాలు నేర్చుకొంటూనే ఉంటా. స్టాన్లే కుబిక్‌ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ దర్శకుడు. ఆయనలా పనిచేయడానికి ఇష్టపడతా. భారతీయ దర్శకుల్లో రాజమౌళి, గౌతమ్‌ మీనన్‌, అంజలీ మీనన్‌, సుకుమార్‌ల నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. 


ప్రశంసలు... పురస్కారాలు... 

ఈ లఘుచిత్రం కథ, స్ర్కీన్‌ప్లే, ఎడిటింగ్‌ వినూత్నంగా ఉండేలా ప్రయత్నించాను. సాంకేతికంగా ఎక్కడా తగ్గకుండా తీశాను. దానికి తగిన ఫలితం దక్కింది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు రావడంతో... ‘మనసా నమః’ను పది చిత్రోత్సవాలకు పంపించాను. క్రొయేషియా ‘ఇంటర్నేషనల్‌ సౌండ్‌- ఫిలిమ్‌ అండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌’ (ఐఎస్‌ఎఫ్‌ఎంఎఫ్‌)లో ప్రదర్శితమైంది. ఐరోపాలో జరిగే అతిపెద్ద ఈవెంట్లలో ఇది ఒకటి. ‘బెంగళూరు అంతర్జాతీయ చిత్రోత్సవం’లో ‘నాన్‌ కాంపిటీటివ్‌’ విభాగం కింద ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ‘సీకేఎఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ‘న్యూయార్క్‌ మూవీ అవార్డ్స్‌’లో ఏడు అవార్డులు దక్కించుకుంది. ఇవన్నీ చూసినప్పుడు గర్వంగా ఉంటుంది. 


అదే నా కల... 

నా లక్ష్యం ఎప్పుడూ ఒక్కటే... పూర్తి స్థాయి సినిమాకు దర్శకత్వం వహించాలని. దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని. హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ అనుష్కతో కలిసి పని చేయాలన్నది నా కల. ఆ కల నెరవేరుతుందనే ఆశిస్తున్నా. 


Updated Date - 2020-08-12T05:49:06+05:30 IST